2020… కొత్త సంవత్సరం మాత్రమే కాదు.. కొత దశాబ్దానికి నాంది కూడా.. అందుకే ఈ సరికొత్త దశాబ్దానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అత్యుత్సాహంతో వెలుగుజిలుగుల మధ్య స్వాగతం పలికారు. కానీ, అందరికీ అప్పటికి తెలియని విషయమేమిటంటే.. త్వరలోనే ప్రపంచంమంతా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడబోతుందని. కరోనా కూడా అన్ని జబ్బుల్లానే భావించేలోగానే.. మన కళ్లముందే అప్రతిహతంగా పెరిగిపోయింది ఈ మహమ్మారి. భూమిని తన కబంద హస్తాలలో బంధించింది.. ప్రపంచాన్ని క్వారంటైన్ చేసింది.. మనుషుల్ని లాక్ డౌన్‌లో పెట్టింది.. ఇలాంటివి ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
నేటికి కూడా ఎక్కడ నుండి పుట్టిందో ఆధారాలతో సహా తెలుసుకోలేకపోతున్నారు. కంటికి కనిపించదనే మాటే గానీ.. లక్షల ప్రాణాలు బలితీసుకుంది.. కోట్ల మంది తన ధాటికి వణికేలా చేసింది. నిజానికి డిసెంబర్ 31కే 27 కేసులు నమోదు చేసినట్టు చైనా ప్రకటించినా దాన్ని పట్టించుకున్న వారు లేరు. ఏముందిలే.. అన్నీ వ్యాధుల లాగే కదా అనుకున్నారు. కానీ జనవరి 11 నాటికి మొదటి మరణం నమోదైంది. అలా నమోదైన కొద్దిరోజులకే దావనంలా ప్రపంచ దేశాలను వ్యాప్తి చెందింది. చైనా, ఈ కరోనా గురించి ప్రపంచ దేశాలకు చాలా ఆలస్యంగా సమాచారం ఇచ్చిందనేది నేటికి ఎదుర్కొంటున్న ఆరోపణలు. అందులో నిజాలు లేకపోలేదు. దేశాలకు దేశాలే కరోనా వ్యాప్తిని ఆపలేకపోకపోతుంటే.. కరోనా పుట్టినిల్లుగా పిలవబడే చైనా మాత్రం కరోనా వ్యాప్తిని వూహన్ చుట్టు పక్కల ప్రాంతాలు దాటకుండా జాగ్రత్తలు తీసుకుంది.
షేక్ హ్యండ్ వద్దు.. నమస్కారమే ముద్దు..
నమస్కారం.. భారతీయ సంస్కారానికి గుర్తు.. భారతీయ ప్రాచీన పలికరింపు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చింది కరోనా. ఈ కొత్త జబ్బు వ్యాప్తి అరికట్టడానికి పాటించిన జాగ్రత్తల్లో భాగంగా షేక్ హ్యండ్స్ ఇవ్వద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేసింది. అదే సమయంలో అందరూ నమస్కారంతో పలికరించుకోవడం మొదలుపెట్టారు. ఫ్రాన్స్, అమెరికా.. ఇలా ఎన్నో దేశాధినేతలు సైతం నమస్కారంతో పలకిరించుకున్నారు. మనకందరికి తెలిసిన సంగతే వ్యక్తిగత శుభ్రత.. కరోనాకు ముందు కూడా ఈ విషయం మనకు తెలుసు.. కరోనా ప్రభావంతో వ్యక్తిగత శుభ్రత అనేది మన జీవనవిధానంలో భాగంగా మారింది.
మాస్క్.. భౌతిక దూరం..
కరోనా ముందు వరకు బయటకు వెళ్తున్నాం అంటే డబ్బులున్నాయా.. ఫోన్ ఉందా అనేవి చూసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అంటే మాస్క్ ఉందా.. శానిటైజర్ తీసుకున్నామా లేదా అనే పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఒక రకంగా మంచిదే.. ఇవి కేవలం కరోనాను ఆపడమే కాదు.. ఎన్నో దీర్ఘకాలిక జబ్బులు, సీజనల్ రోగాలు రాకుండా కూడా ఆపుతుంది ఈ అలవాటు. ఈ రకంగా కరోనా మనకు ఒక మంచి అలవాటు నేర్పిందనే చెప్పాలి.
లక్షల కుటుంబాలు అతలాకుతలం..
కరోనా కొన్ని లక్షల కుటుంబాలపై ప్రభావం చూపింది. కేవలం బాధితులే కాదు.. వారిని కాపాడడానికి ప్రయత్నించిన కొన్ని వేల మంది డాక్టర్లు, హెల్త్ వర్కర్లు కరోనా బారిన పడి మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంతో పోలిస్తే.. ఈ కరోనా ప్రభావం ఎక్కువ ఉందనడంలో సందేహం లేదు. ఇప్పటికే మరణాల సంఖ్య లక్షలు దాటింది. వ్యాక్సిన్ వచ్చి కరోనాను కట్టిడి చేసే సమయానికి ఇంకెన్ని మరణాలు నమోదవుతాయనేది ఊహకు అందని విషయం.
క్వారంటైన్.. లాక్ డౌన్..
క్వారంటైన్.. లాక్ డౌన్.. కరోనా మన జీవితాల్లో ప్రవేశించేంత వరకు ఇలాంటి పదాలున్నాయని కూడా తెలియదు. అలాంటిది 2020లో క్వారంటైన్.. లాక్ డౌన్‌లు తప్ప ఇంకో పదమనేది వినకుండా చేసింది కరోనా. తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరుకోదంటారు.. అలాంటి మనిషిని ఇంటిని పరిమితం చేసింది లాక్ డౌన్. ఇక ఏ మాత్రం దగ్గినా.. తుమ్మినా.. క్వారంటైన్‌లోకి నెట్టేలా చేసింది. కొందరైతే తమ పిల్లలకు ఈ పేర్లు కూడా పెట్టుకోవడం గమనార్హం.
ఆర్థిక సంక్షోభం
కరోనా సృష్టించిన ప్రకంపనల దాటికి ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైంది. ఎందరో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.. రోజు కూలి పరిస్థితి అయితే దారుణం.. ఇలా ప్రపంచంలో ఒక్కొక్కరది ఒక్కో విషాదమైంది కరోనా దాటికి. కానీ గ్లోబలైజేషన్ ప్రాముఖ్యతను నేర్పింది కరోనా. ఉన్న ప్రాంతం నుండి కదలకుండా ప్రపంచాన్ని పలకరించే ఏర్పాట్లు చేసుకునే విధంగా మనిషికి అవసరం ఏర్పడింది. ఇంటి నుండి పనిచేయడం అనే ఆవస్యకతను కల్పించింది. కరోనా సర్దుకున్నాక మళ్లీ పుంజుకోవచ్చు అనే మాటను పక్కన పెట్టి.. కరోనాతో మనం సర్దుకుని పనిచేసే విధంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా ఏర్పడిన అసమానతలను తొలగించడానికి ప్రపంచ దేశాలు చేతులు కలిపే దిశగా కరోనా వల్ల సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి
ప్రకృతికి మేలు
కరోనా వల్ల ఎవరికైనా మంచి జరిగింది అంటే.. అది ప్రకృతికి.. కరోనా ధాటికి ప్రపంచమంతా లాక్ డౌన్ పాటించడంతో కాలుష్యానికి తావు లేకుండా పోయింది. కొద్ది రోజులపాటు ప్రకృతి కాలుష్యం లేని రోజుల్ని ప్రశాంతంగా గడిపిందని చెప్పచ్చు. తిరిగి మనిషి కాలు బయటపెట్టడం మొదటు పెట్టిన మరుక్షణం నుండి మళ్లీ కాలుష్య ప్రమాద ఘంటికలు మోగుతుండడం మనిషి గమనించాల్సిన విషయం.
2020 డైరీ విషయానికొస్తే.. ప్రపంచ వ్యాప్తంగా డైరీని కేవలం 5 పదాలతో ముగించవచ్చు.. అవే కరోనా, కొవిడ్, క్వారంటైన్, లాక్ డౌన్.. వ్యాక్సిన్.. మరి రాబోతున్న 2021లో నైనా కరోనా సమస్యకు చెక్ పెట్టే పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం. కరోనాతో ఏర్పడిన అసమానతలు తొలగి అందరూ తిరిగి సాధారణ జీవనాన్ని కొనసాగించాలని కోరుకుందాం..