ఈ తరంలో సౌత్ సినిమాల్లో సహజనటి ఎవరంటే ‘సాయిపల్లవి‘ అనే పేరే వినిపిస్తుంది. గ్లామర్ కోణంలో ఈ అమ్మాయిని చూడవలసిన పనిలేదు .. ఎందుకంటే అలాంటి పాత్రలను ఆమె చేయనే చేయదు. నటన విషయంలో మాత్రం ఎన్ని మార్కులకు పేపర్ ఉంటే అన్ని మార్కులు ఆమెకి ఇచ్చేయవలసిందే. అందువల్లనే సాయిపల్లవి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. హీరోలు సైతం ఆమె డేట్స్ ఇచ్చాకనే మొదలెడదామని అంటున్నారు. అలాంటి సాయిపల్లవి ఒక సినిమా కోసం భారీ పారితోషికం డిమాండ్ చేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‘ సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ .. బిజూ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, వైవిధ్యభరితమైన సినిమాగా అక్కడ ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాను ‘సాగర్ చంద్ర’ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళంలో బిజూమీనన్ పోషించిన పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఇక పృథ్వీరాజ్ చేసిన పాత్ర కోసం రానాను తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ సినిమాలో రానా భార్య పాత్ర కోసం ‘ఐశ్వర్య రాజేశ్‘ ను ఎంపిక చేసుకున్నారు. పవన్ భార్య పాత్ర కోసం ‘సాయిపల్లవి’ని సంప్రదించారు. అయితే పారితోషికంగా ఆమె 2 కోట్లు డిమాండ్ చేసిందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె తీసుకునేదానికంటే ఇది చాలా ఎక్కువని చెప్పుకుంటున్నారు. ఆమె అంతమొత్తం అడిగేసరికి నిర్మాతలు ఆలోచనలో పడ్డారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కథానాయికగా సాయిపల్లవి స్థానం ప్రత్యేకం .. పైగా ప్రస్తుతం ఆమె తెలుగులో ఫుల్ బిజీగా ఉంది. ‘లవ్ స్టోరీ’ విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, ‘విరాటపర్వం’ సెట్స్ పై ఉంది.
ఇక నాని జోడీగా ఆమె చేయనున్న ‘శ్యామ్ సింగ రాయ్’ రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అందుకే ఆమె అంతమొత్తం అడగడంలో న్యాయం ఉందని కొంతమంది అంటుంటే, అసలు పాత్ర గురించి మాత్రమే తప్ప పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోని సాయిపల్లవి, పవన్ సినిమా విషయంలో పట్టుపడుతుందా? అనే సందేహాన్ని మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి!
Must Read ;- మహేష్ మచ్చల గురించి సాయిపల్లవికి ఎలా తెలుసు?