వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాంట్రాక్టు పనుల విషయంలో అనుసరిస్తున్న రివర్స్ టెండరింగ్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. అయినవారికే పనులు పంచిపెడుతున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. గతంలోనూ అదే సంస్థలు పనులు దక్కించుకున్నా.. క్వాలిటీ విషయంలో నిబంధనలు మార్చుతున్నారేమోనన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇందుకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. అయినవారికే మళ్లీ పనులు దక్కేలా చూస్తున్నారని విమర్శించారు. ఇందుకు రాజకీయ నాయకుల కంపెనీలకే మళ్లీ ఆ పనులే రావడంపైనా ప్రస్తావించారు. ‘గురువారం మొత్తం జగన్‌మోహన్ రెడ్డి తనవారికి పంచిన రోడ్డు కాంట్రాక్టులు రూ.791.53 కోట్లు.. ఆ కాంట్రాక్ట్స్ దక్కించుకున్న కంపెనీల వివరాలు.. చిత్తూరు జిల్లాలో PLR (పెద్దిరెడ్డి) : రూ.126 కోట్లు.. కర్నూలు జిల్లాలో NSPR (నర్రెడ్డి.. పులివెందుల YS చుట్టం): రూ.228 కోట్లు.. అనంతపురంలో KCVR (సురేష్ రెడ్డి): రూ.128.36 కోట్లు.. కడపలో Nitin Sai ( మాజీ మంత్రి సారధి YCP):రూ.121.63 కోట్లు.. ప్రకాశం జిల్లాలో JMC ( శ్రీనివాసులు చిత్తూర్ YCP MLA):రూ.186.కోట్లు’అని ఆరోపించారు. మొత్తం మీద ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.30.4 కోట్లు ఆదా అయినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడే మరో విషయం ఏంటంటే గతంలోనూ వీటిలో కొన్ని పనులను ప్రస్తుతం చేస్తున్న కంపెనీల దక్కించుకున్నాయి.
జిల్లా కంపెనీ గతంలో% ఇప్పుడు% విలువ (అప్పుడు-ఇప్పుడు-రూ.కోట్లలో)
చిత్తూరు PLR&RCIPL +2.52 -.04 129.33-126.10
కర్నూలు NSPR +4.89 -.10 240.01-228.59
కడప Nitin Sai (JV) + 3.69 – .045 126.73-121.63
అనంతపురం KCVR +1.50 -0.23 130.31-128.36
ప్రకాశం JMC + 4.29 -0.19 186.85-178.2
మరోవైపు కావలి ప్రధాన రహదారి వర్క్‌లోనూ ఆర్అండ్ బీ అధికారులు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రూ.41 కోట్ల పనులకు గతంలో టెండర్లు ఖరారయ్యాయి. అప్పట్లో 4.5 ఎక్సెస్‌కి ఓ సంస్థ పనులు దక్కించుకోగా ఈ సారి 1.8 శాతం ఎక్సెస్ వేసిన సంస్థకి పనులు దక్కాయి. అయితే పనుల్లో ఇంత జాప్యం కావడంతో ప్రభుత్వానికి పెద్దగా ఆదా కాకపోవచ్చని, అయితే తమవారికి పనులు దక్కేలా చేయడంకోసం కొందరు ప్రయత్నించారన్న ఆరోపణలూ వచ్చాయి.
ఇక గత ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం పనుల విషయంలోనూ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838కోట్లు ఆదా చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో పోలవరం నీటినిల్వ సామర్థ్యంలో మార్పులు చేస్తున్నారన్న విమర్శలు తలెత్తాయి. మైనస్ 26 శాతంతో పనులు అప్పజెప్తే నాణ్యత విషయం ఏంటని, పైగా పోలవరంలో 1 మీటరు ఎత్తు తగ్గించాల్సింది పోయి 4.5మీటర్ల ఎత్తు తగ్గించారని, తద్వారా ప్రాజెక్టు సామర్థ్యంపై ప్రభావం చూపుతోందన్న విమర్శలు వచ్చాయి. గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా..రివర్స్ టెండరింగ్‌లో లెస్‌కు పనులు అప్పజెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఆ పనుల నాణ్యత, సామర్థ్యం లాంటి విషయాలను పట్టించుకుంటే పర్వాలేదు..కాని ఆ పార్టీ నేతల కంపెనీలే పనులు చేస్తున్న నేపథ్యంలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.