వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా…ఆయన అనుయాయులు, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఏ మేర స్వైర విహార చేసింది వరుసగా వెలుగులోకి వస్తోంది. కాకినాడ సీ పోర్టులో తమ వారికి చెందిన కంపెనీలకు వాటాలను బదిలీ చేసుకునేందుకు వైసీపీ నేతలు ఏ రీతిన వ్యవహరించారో ఇప్పటికే బయటపడిపోగా…తాజాగా అంతకుమించిన దారుణం మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారిగా పనిచేసిన ఓ వ్యక్తిని పావుగా వాడుకుని జగన్ గ్యాంగ్ ఏకంగా రూ.700 కోట్ల విలువైన భూములను తమ పేరిట రాయించేసుకుంది.
ఈ వ్యవహారంలో వైఎస్ సోదరుడైన వైఎస్ సునీల్ రెడ్డితో పాటుగా జగన్ పీఏగా చక్రం తిప్పిన కె.నాగేశ్వర రెడ్డి (కేఎన్నార్), జగన్ సతీమణి భారతి రెడ్డి బినామీగా పేరున్న చీమకుర్తి శ్రీకాంత్, అతడి రెడో భార్యగా ప్రచారంలోకి వచ్చిన టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరీలు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జగన్ గ్యాంగ్ చేతిలో పావుగా మారి…వారు చెప్పినట్టుగా ఆయా భూములను వారి పేర్ల మీద రిజిష్టర్ చేసిన రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ లాలా బాల నాగ ధర్మ సింగ్ బయటపెట్టడం గమనార్హం. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేశ్ లకు రాసిన లేఖలో సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.
2024 జూన్ లో రిటైర్ అయిన సింగ్… తన ఉద్యోగ జీవితం చివరలలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేశారు. అంటే… జగన్ సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన బెజవాడ పరిసరాల్లోనే పనిచేశారన్న మాట. సింగ్ చెప్పిన దాని ప్రకారం… ఆయనను జగన్ గ్యాంగ్ చాలా వ్యూహాత్మకంగా ట్రాప్ చేశారు. సింగ్ సొంతూరైన బాపట్ల జిల్లా కొల్లూరు మండల కేంద్రంలో ఆయన కుటుంబం ఆధ్వర్యంలో కొన్ని ఆలయాలు నడుస్తున్న విషయాన్ని ఆసరా చేసుకుని.. సదరు ఆలయాలను అక్రమంగా కబ్జా చేశారంటూ కేసులు నమోదు చేస్తామంటూ ఆయనను లొంగదీసుకున్నారట. అయితే తొలుత వారికి సింగ్ లొంగకపోగా… విశాఖపట్నానికి చెందిన దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను ఏ రీతిన అయితే వేధించి.. ఆత్మహత్య చేసుకునేలా చేాశామో… అదే రీతిన నీపైనా వేధింపులు ఉంటాయని బెదిరించారట.
ఇక ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబుపై ఏసీబీ కేసు నమోదు చేశామని, ఓ మాజీ సీఎం అయిన ఆయననే తాము జైల్లో పెట్టగలిగామని కూడా బెదిరించిన వారు సింగ్ ను తమ దారిలోకి వచ్చేలా చేసుకున్నారట. సింగ్ తమ దారిలోకి రాగానే… విజయవాడతో పాటుగా విశాఖ, రాజమహేంద్రరంలలో ఉన్న అత్యంత విలువైన ఆస్తులను శ్రీకాంత్, రీతూ చౌదరిల పేర్ల మీద రిజిష్టర్ చేయించుకున్నారట. దీనికి సంబంధించిన అన్నిఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన సదరు లేఖలో తెలిపారు.
ఇక వేధింపుల పర్వంలో జగన్ గ్యాంగ్ పాల్పడిన దురాగతాలను సింగ్ పూసగుచ్చినట్లుగా వివరించారు. సింగ్ తమ మాట విన్నంత వరకు ఆయనతో పనిచేయించుకున్న జగన్ గ్యాంగ్… తమ మాటను లెక్కచేయని సందర్భాల్లో ఆయనపై ఓ రేంజిలో వేధింపులకు పాల్పడ్డారట. సింగ్ తో పాటుగా సింగ్ కూతుళ్లు, అల్లుళ్లు, ఇతర బంధువర్గంపైనా ఈ దారుణాలు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ గ్యాంగ్ చెప్పిన పనులన్నీ చేసిన తర్వాత.. తనను, తన కుటుంబ సభ్యులను బెదిరించి ఏకంగా రూ.30 లక్షలను వసూలు చేశారట.
సింగ్ వద్ద డబ్బు లేకపోతే… ఆయన ఇంటిని తనఖా పెట్టించి మరీ ఆ డబ్బును వసూలు చేశారట. సింగ్ ను తమ దారిలోకి తెచ్చుకునే క్రమంలో ఓ ఏసీబీ కేసును కూడా నమోదు చేయించారట. ఆపై ఈ కేసు నుంచి బయటపడేస్తానంటూ నమ్మబలికిన చీమకుర్తి శ్రీకాంత్… సింగ్ ను కిడ్నాప్ చేసి మరీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి రూ.1 కోటి వసూలు చేశారట. ఈ సందర్భగా తనను కిడ్నాప్ చేసి గోవాకు తీసుకెళ్లి అక్కడే నిర్బంధించి తనను శారీరకంగా తీవ్రంగా హింసించారని కూడా సింగ్ తన లేఖలో తెలిపారు.
ఈ వ్యవహారంలో జగన్ గ్యాంగ్ లో కీలకంగా పనిచేసిన వైైఎస్ సునీల్ రెడ్డి ఎవరన్న విషయానికి వస్తే… గతంలో ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా…వెలుగు చూసిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సునీల్ రెడ్డే ఇతను.అప్పటిదాకా ఎవరో కూడా తెలియని సునీల్ రెడ్డి… ఈ కేసులో అరెస్ట్ కాగానే… ఒక్కసారిగా లైైమ్ లైట్ లోకి వచ్చారు. వైఎస్ ఫ్యామిలీకి దాయాదీ అయిన సునీల్… వైఎస్సార్ వద్ద అన్ని పనులను చక్కబెట్టే పనిలో కుదిరారట. ఈ క్రమంలోనే జగన్ కు మరింతగా చేరువ అయిన సునీల్ రెడ్డి… సాక్షి మీడియా సంస్థల్లో కొంతకాలం పాటు చక్రం తిప్పినట్లుగా కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఇక ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో కోనేరు రంగారావు, ఆయన భాగస్వాముల నుంచి డబ్బుల కట్టలను స్యయంగా సునీల్ రెడ్డే వసూలు చేసుకునేవారట. ఆ డబ్బుల కట్టలను బ్యాగుల్లో సర్దుకుని నేరుగా వైఎస్సార్ ఇంటికీ చేర్చేవారట. ఇవే ఆరోపణల మీదే అరెస్టైన సునీల్ రెడ్డి ఆ తర్వాత బెయిల్ పై రిలీజయ్యారు. నాటి నుంచి పత్తా లేకుండా పోయిన సునీల్ రెడ్డి… ఇప్పుడు ఇలా సింగ్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చారు. మరి సింగ్ రాసిన ఈ లేఖపై చంద్రబాబు, లోకేశ్ ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.