టీడీపీ పాలనలో ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పుకుని దందాలు సాగించడం కుదరదు. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి టీడీపీ అధినేత ఈ తరహా చేతివాటాలకు అస్సలు ఆస్కారం ఇవ్వలేదు. ఎప్పుడు ఇలాంటి ఘటనఃలు వెలుగు చూసినా…ఇట్టే చర్యలు చేపడుతూ… ఆ తర్వాత ఈ తరహా వ్యవహారాల్లో తలదూర్చాలంటేనే భయం పుట్టేలా చంద్రబాబు కఠినంగానే చర్యలు చేపట్టారు. ఫలితంగా వైసీపీ జమానాలో మాదిరిగా ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పుకుని ఆయా వ్యక్తులు దందాలు చేయడం టీడీపీ పాలనలో పెద్దగా కనిపించదు. ప్రజా ప్రతినిధుల్లో ప్రధానంగా మంత్రి పదవులు దక్కించుకున్నవారికి చంద్రబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అవుతూ ఉంటాయి. వ్యక్తిగత సహాయకులు (పీఏ), వ్యక్తిగత కార్యదర్శులు (పీఎస్(లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని… ఒకే వ్యక్తిని ఎక్కువ కాలం పీఏగా కొనసాగించి అవినీతికి ఆస్కారం ఇవ్వవద్దని కూడా చంద్రబాబు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా గతంలో తమ వద్ద పనిచేసిన వ్యక్తులను మరోమారు అవే పదువుల్లో నియమించుకోరాదని కూడా ఆయన ఒకింత కఠినంగానే చెబుతూ ఉంటారు.
అయితే ఈ మాటలను ఎలా పెడచెవిన పెట్టారో తెలియదు గానీ… ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఇరకాటంలో పడిపోయారు. అయితే పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైైన ఆదేశాలు రాగానే… అంటమేల్కొన్న అనిత… తన వద్ద ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్న సంధు జగదీశ్ ను విధుల నుంచి తప్పించి… ఆ ఇరకాటం నుంచి బయటపడిపోయారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… అనిత ఇప్పుడైతే మంత్రిగా ఉన్నారు గానీ… అంతకుముందు ఓ దఫా ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె గడచిన ఐధేళ్ల పాటు ప్రజా ప్రతినిధిగానే లేరు.
పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చిన చంద్రబాబు ఆమెను పార్టీ మహిళా విభాగం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకున్న అనిత… ఆ పదవిలో బాగానే రాణించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన అనిత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి బెరుకు లేకుండా పనిచేయగలిగారు. వైసీపీ దుర్మార్గాలపై ఆమె తనదైన శైలి పోరాటం చేశారు. ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మరోమారు ఎమ్మెల్యేగా గెలిచిన అనిత… ఈ దఫా ఏకంగా చంద్రబాబు కేబినెట్ లో హోం మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు.
ఎప్పుడో అనిత తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలోనే అనిత వద్ద .జగదీశ్ ప్రైవేటు పీఏగా చేరారు. అప్పటి నుంచి ఆమె వద్ద అతడు విధులు నిర్వర్తిస్తునే ఉన్నాడు. అంటే పదేళ్లకు పైగానే అతడు అనిత వద్ద పీఏగా పనిచేస్తున్నాడన్న మాట. ఈ క్రమంలో అనిత బలాలు, బలహీనతలపై పూర్తిగా పట్టు సాధించిన జగదీశ్… ఎలాంటి అక్రమాలు చేస్తే తాను టార్గెట్ కానన్న విషయంపై ఓ అవగాహనకు వచ్చేాశాడు. అదే సమయంలో నమ్మకంగా పనిచేస్తున్నట్లుగా అనిత వద్ద గుర్తింపు సంపాదించుకున్నాడు. అధికారంలో లేని పదేళ్ల సమయంలో తనను అంటి పెట్టుకుని పనిచేసిన జగదీశ్ ను నమ్మకస్తుడిగానే భావించిన అనిత… తాను హోం మంత్రి అయ్యాక కూడా తన ప్రైవేట్ పీఏగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పిన జాగ్రత్తలను ఆమె అంతగా పట్టించుకున్నట్లు కనిపిచలేదు. ఫలితంగా అనిత మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే…జగదీశ్ తన చేతివాటాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు.
హోం మంత్రి పీఏ హోదాలాతో పాయకరావుపేట నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో జగదీశ్ తన పరపతిని ప్రయోగించడం ప్రారంభించాడు. పేకాట క్లబ్బులకు అనుమతులిచ్చి… హోం మంత్రి పేరు బయటకు వచ్చేలా చేశాడు. ఇక మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఆయన ఏకంగా ఎక్సైజ్ శాఖ అధికారులతోనే ఆయా లైసెన్స్ దారులప ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇక తిరుమల దర్శనానికి సంబంధించి హోం మంత్రి సిఫారసు లేఖలను ఆయన గంపగుత్తగా తిరుపతిలోని ఓ హోటల్ కు అప్పగించిన వైనం కలకలమే రేపింది.
ఈ విషయాలన్నింటినీ గమనిస్తూనే ఉన్న టీడీపీ కేడర్… ఆయన అరాచకాలు మరింతగా పెరిగే సరికి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో అనితను అలెర్ట్ చేసిన పార్టీ అధినాయకత్వం తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో జగదీశ్ ను తన పీఏ విధుల నుంచి తప్పిస్తూ అనిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశంలో కేడర్ కు బహిరంగంగానే తెలియజేశారు.