గత సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఏపీ రాజకీయాలు తారుమారు అయ్యాయి. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ఏపీలో పరిస్థితి. ఒకప్పుడు 151 సీట్లతో విర్రవీగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయి.. ఏమీ పాలుపోలేని స్థితిలో ఉంది. అదే సమయంలో టీడీపీ అఖండ మెజారిటీ సాధించి విపరీతమైన జనాదరణ కూడగట్టుకోగలిగి మరోసారి అధికారంలోకి రాగలిగింది. వైసీపీకి ఓటర్లు షాక్ ఇవ్వడంతో.. ఇప్పటికీ ఆ పార్టీ కోలుకోలేకపోతోంది. ప్రజల తీర్పు దెబ్బకి వైసీపీలో కింది స్థాయి క్యాడర్ లో దాదాపు సగం ఖాళీ అయింది. మాజీ మంత్రులు, సీనియర్లు, కీలక నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు.
కొంతమంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా జరిగారు. పరిస్థితులు చక్కబడ్డాక వారు ఏదో ఒక పార్టీలోకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపై జగన్‌ను నమ్ముకుంటే తమకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండబోదని వారి అభిప్రాయంగా ఉంది. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో ఇటీవల ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి పోటీచేసిన వారు పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం జరిగారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి చూస్తుంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి తప్పుకుంటేనే బెటర్ అనే చర్చ జరుగుతుంది.
ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పార్టీ శ్రేణులకు సీనియర్ నేతలు అందుబాటులో ఉండటం లేదు. ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో కింది స్థాయిలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోగలదనేది ప్రశ్నార్థకంగా ఉంది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉండగా.. తమకు 40 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయని.. ప్రజలే తమ బలమని వైసీపీ కాలర్ ఎగరేస్తూ వచ్చింది. కానీ 11 సీట్లకే పరిమితమైంది. అయినా ఓటు శాతం 39 శాతం ఉంది. ఈ ఎన్నికల్లో 39 శాతం ఓట్లు కలిగిన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బలంగా ఎదుర్కొనాలి. కానీ, ఆ సాహసం చేసే యోచనలో వైసీపీ లేనట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, వైసీపీ అధినేత జగన్ రెడ్డి తీరు చూస్తుంటే మాత్రం పార్టీ శ్రేణులకు ఏ మాత్రం విశ్వాసం కుదరడంలేదనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. ప్రభుత్వంపై ప్రస్తుతం ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ.. తనకు ఉన్న పాలనా అనుభవంతో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తు్న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సైతం చంద్రబాబు నాయకత్వానికి అండగా నిలుస్తున్నారు. అందుకే తాము ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఘోర పరాజయం చూడడం కంటే కూడా ఏదో ఒక కారణం చెప్పి స్థానిక ఎన్నికల బరిలోంచి తప్పుకుంటే కాస్త అయినా గౌరవంగా ఉంటుందని జగన్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.