మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధిక సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు. పార్ట్ టైంగా అమరావతికి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ సరదా మాటలు మాట్లాడుతున్నారు. ఏపీకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి.. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉంటున్నాయి. ‘‘రాష్ట్రంలో పాలన కుప్పకూలింది.. వ్యవసాయం, చదువులు, వైద్యం తిరోగమనంలోకి వెళ్లాయి.. 4 నెలల్లోనే ప్రభుత్వ వ్యతిరేకత తారస్థాయికి వెళ్లింది.. సీఎం కుర్చీలో నేను ఉండుంటే ఇవన్నీ జరిగేవి కావు’’ అంటూ జగన్ మాటలు ఉంటున్నాయి. ఈ రేంజ్ మాటలు చెప్పేసి మళ్లీ బెంగళూరుకి చెక్కేశారు.. జగన్.
గాంధీజీ, లాల్‌బహుదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ లో వారి చిత్రపటాలకు జగన్ నివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి సీట్లో నేనుంటేనే సరైన పాలన సాగుతుంది.. స్కూళ్లు పోయాయి.. చదువులూ పోయాయి.. ఆస్పత్రులూ పోయాయి. ఆరోగ్యశ్రీలూ పోయాయి. ఆసరా పోయింది.. డోర్ డెలివరీ పోయింది. వ్యవసాయం పోయింది. పెట్టుబడి సాయం పోయింది. ఉచిత బీమా పోయింది.. ఆర్బీకేలూ పోయాయి.. ఇలా అన్నీ పోయాయి’’ అంటూ జగన్ మాట్లాడారు. ఆ మాటలకు జనమంతా నవ్వుకున్నారు.
పైగా విజయవాడ వరద బాధితులకు ఎన్యుమనరేషన్ కూడా చేయలేకపోతున్నారని జగన్ చెప్పడం ఆయన తెలివి తక్కువ తనానికి నిదర్శనంగా ఉంటోంది. కానీ, టీడీపీ అక్కడి ప్రజలతో మాట్లాడించి వరద సాయం అందిందా..? చుట్టుపక్కల అందరికీ వచ్చిందా.. అనేవి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడంతో జగన్ పరువు పోయినట్లు అయింది. ఆ సంగతి అటుంచితే.. జాతీయ స్థాయిలో పార్టీలేవీ లేనంతగా వైసీపీని బలోపేతం చేయాలని జగన్ పిలుపిచ్చారు. ఇందుకు కార్యకర్తల్లో స్పార్క్ ఉండాలన్నారు.
ఇన్ని సుద్ధపూస మాటలు చెప్పిన జగన్ రెడ్డి.. ప్రెస్ మీట్ కాగానే నేడు బెంగళూరుకు వెళ్లిపోనున్నారు. నిజానికి ఆయన మొదటి నుంచి ప్రతి శుక్రవారం బెంగళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్తున్నారు. పని ఉంటేనే తాడేపల్లికి వస్తున్నారు. గత శుక్రవారం వెళ్లి మంగళవారమే అమరావతికి వచ్చారు. తాజాగా శుక్రవారం కాకుండా గురువారమే ఆయన బెంగళూరు వెళ్తున్నట్లుగా వైసీపీ వర్గాలు తెలిపాయి.











