ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో.. ఆ పార్టీ నేతలు ఒక్కరొక్కరూగా పార్టీని వీడుతున్నారు. సీనియర్లుగా ఉన్న వారితోపాటు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో దగ్గరి బంధుత్వం ఉన్నవారు సైతం పార్టీని వీడుతున్నారు. వైసీపీని వీడి వెళుతున్న నేతల మూలంగా కొన్ని జిల్లాలకు సరైన నాయకుడు కరువవుతున్నారు. మరికొన్ని జిల్లాలకి నాయకుడే లేకుండా ఉన్న పరిస్థితి నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న ఇతర నాయకులను జిల్లా బాధ్యతలను తీసుకోవాలని కోరుతున్నప్పటికీ.. వారు ముందుకొచ్చి పార్టీ బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. 2019 ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న వైసీపీ.. మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా కేవలం 11 సీట్లకే పడిపోయింది. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చివరికి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ నేతలు పలు సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లాను క్లీన్ స్విప్ చేసింది. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏకంగా 12 స్థానాలు గెలుచుకోగా.. వైసీపీ 2 కేవలం స్థానాలకే పరిమితమైంది. కర్నూలు, కోడుమూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నంద్యాల, పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందగా… మంత్రాలయం, ఆలూరులో వైసీపీ అభ్యర్థులు గెలిచారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కోడుమూరు, నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కర్నూలు వైసీపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పరిస్థితి గందరగోళంగా మారింది. కర్నూలులో మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ ఎన్నికల ముందు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ఆయన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేతిలో ఓటమి చెందారు. ఓటమి తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడగా మరోవైపు రాజకీయాల నుంచి తప్పుకుని వ్యాపారాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
ఇక కేసుల భయంతో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కర్నూలును వీడగా.. వైసీపీ క్యాడర్ డైలామాలో పడింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలను చక్కబెట్టేందుకు గానూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. నంద్యాలకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధారా సుధీర్ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఒక్క ధారా సుధీర్ మాత్రం ముచ్చుమర్రి బాలిక ఘటన సమయంలో కనిపించారు తప్ప నేటి వరకు నియోజకవర్గంలో కనిపించిన దాఖలాల్లేవు. నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా సైలెంట్ కావడంతో ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ జీవచ్ఛంలా మారింది.
టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు కూడా వైసీపీ నేతలు ముందుకు రాకుండా ఎవరికి వారుగా ఉంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై.రామయ్య, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డిలు చాలా కష్టపడ్డారు. ఓటమి తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఐదేళ్ల పాటు పార్టీని ముందుకు నడిపించడం చాలా ఖర్చుతో కూడిన పని కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఐదేళ్లు ఏం చేయాలనే యోచనలో పడ్డారు.
ఇక కోడుమూరులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ యువతిపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉండటంతో ఆయనకు వైసీపీలో సరైన స్థానం ఇవ్వడం లేదు. అదే నియోజకవర్గంలో మొదటి నుంచి కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి అనుచరుడిగా, రాజకీయ వారసుడిగా, అనేక సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉన్న నియోజకవర్గ నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ ను ఇంచార్జిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించిన ఆయన అధిష్టానం సూచన మేరకు సీటును త్యాగం చేశారు. ప్రస్తుతం ఇంచార్జి లేకపోవడంతో ఇంచార్జిగా బాధ్యతలు ఇస్తే నియోజకవర్గంపై పట్టు సాధించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.