మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి కొట్టిన దెబ్బకు ఇక తమకు తిరుగే లేదన్న ధీమాతో ఉన్న వైసీపీ ఊహలు పటాపంచలయ్యాయనే చెప్పాలి. 151 సీట్లతో బలీయంగా ఉన్న వైసీపీని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 11 సీట్లకు కుదించేసింది. ఆ తర్వాత 11 సీట్లు దక్కించుకున్న జగన్ అసెంబ్లీకి రాగలరా? జనానికి ముఖం మూపించగలరా? అన్న దిశగా పలు విశ్లేషణలు సాగగా… తాజాగా ఇప్పడు వైసీపీకి దక్కిన సీట్ల సంఖ్యతోనే కూటమి సర్కారు ఆ పార్టీని ర్యాగింగ్ చేస్తోంది. 11వ నెల, 11 వ తేదీ, 11 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి రావాలని టీడీపీ నేతలు పదే పదే ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ ర్యాగింగ్ దెబ్బకి తల పట్టుకుని కూర్చున్న జగన్ కు… జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఊహించని రీతిలో భారీ దెబ్బే కొట్టారు. 11 సీట్లే వచ్చినా… తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న జగన్.. పవన్ కొట్టిన దెబ్బకు అసలు విపక్షంగానైనా తనను జనాల్లో ఉండనిస్తారా? అన్న భయాందోళనకు గురవుతున్నారు.
సోమవారం పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా పవన్ నోట నుంచి సంచలన వ్యాఖ్యలు వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అంతకంతకూ పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన పవన్… నేరస్తులకు కులం, మతం ఉంటాయా? అని కూడా నిలదీశారు. నేరం చేసిన వాళ్లను వెనకేసుకువచ్చే వారిని ఇకపై సహించేది లేదని కూడా పవన్ ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. నేరస్తులకు మద్దతు పలికేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత పేరును ప్రస్తావించిన పవన్… నేరాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అంతటితో ఆగని పవన్… తాను హోం మంత్రిత్వ శాఖ పగ్గాలు తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని కూడా పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను చర్చకే తెర లేపాయి. అదేంటీ…కూటమి సర్కారులో భాగస్వామిగా ఉంటూనే మిత్రపక్షానికి చెందిన మరో మంత్రిని తక్కువ చేసి మాట్లాడేశారే అంటూ గుసగుసలు వినిపించాయి.
అయితే పవన్ అనుసరించిన ఈ వ్యూహాన్ని వైసీపీ ఇట్టే పసిగట్టింది. పవన్ నోట నుంచి వచ్చిన వ్యాఖ్యలను విన్నంతనే వైసీపీ అధిష్ఠానం రంగంలోకి దిగిపోయింది. విమర్శలు చేసినా… కాస్తంత మంచి మర్యాదతో మసలుకునే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డిని బరిలోకి దింపించంది. హదరాబాద్ లో ఉన్న ఆయనతో అక్కడే హడావిడిగా మీడియా సమావేశం పెట్టించింది. ఈ మీడియా సమావేశంలో పవన్ తీరును తప్పుబట్టిన బుగ్గన… చంద్రబాబు తీరును, మొత్తంగా కూటమి సర్కారు వైఫల్యం చెందిందంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని తాము చెప్పడం లేదని… మీ కేబినెట్ లో, మీ తర్వాతి స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణే చెప్పకనే చెప్పారంటూ బుగ్గన తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. అంతిటితో ఆగని బుగ్గన… కూటమి సర్కారులో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయనే అర్థం వచ్చేలానూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అయినా ఎప్పుడూ లేనిది పవన్ వ్యాఖ్యలకు వైసీపీ ఇంత వేగంగా ఎందుకు స్పందించింది అంటారా?… తనకున్న విపక్ష హోదాను కూటా కూటమి సర్కారే కబ్జా చేస్తుంటే… అసలే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు…ఇక సాధారణంగా కూడా తమను విపక్షంగా కొనసాగడానికి అవకాశం ఇవ్వరా? అన్నది వైసీపీ భావన. నిజమే మరి… పవన్ చేసిన వ్యాఖ్యలు వింటూ ఉంటే… స్వపక్షంలోనే విపక్షం ఉన్నట్టే కదా. తమలోని తప్పులను తామే సరిదిద్దుకుంటూ సాగే ప్రభుత్వాలకు విపక్షాల అవసరం ఏమీ ఉండదు కదా,. మరి పవన్ చేసింది అదే కదా. అలా ఉన్న పళంగా తమ ప్రమేయం లేకుండానే తమకు ఉన్న ఆ కాస్త మర్యాదను కూడా పవన్ లాగేస్తూ ఉంటే జగన్ చూస్తూ ఊరుకోరు కదా. అందుకే పవన్ ప్రసంగం ముగిసిన కాసేపటికే బుగ్గన మీడియా ముందుకు వచ్చేశారు. మొత్తంగా తనదైన శైలి వ్యాఖ్యలు, వ్యూహంతో తాడేపల్లి ప్యాలెస్ లో సుఖంగా నిద్రపోతున్న జగన్ కు పవన్ వెన్నులో వణుకు పుట్టించారన్న మాట.