ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా సరితూగని వైసీపీ… తాను అధికారంలో ఉండగా మరో 30 ఏళ్ల పాటు తమను అధికారం నుంచి దించే వారెవ్వరూ లేరంటూ బీరాలు పలికింది. అంతేనా… మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు ఆ పార్టీ ఏకంగా వై నాట్ 175 అంటూ సంచలన స్లోగన్ లను ఇచ్చింది. 2019లో టీడీపీకి దక్కిన 23 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంటు స్థానాలను కూడా ఈ దఫా చేజిక్కించుకుంటామని ప్రతినబూనింది. అంటే… టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని కూడా ఓడించేస్తామని వైసీపీ సంచలనాలకే సంచలనమైన ప్రకటన చేసింది. ఈ బాధ్యతను వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. విద్యాభ్యాసంలో చంద్రబాబుకు సహధ్యాయి అయిన పెద్దిరెడ్డికి ఈ తరహా ఆఫర్ అంతకుముందెన్నడూ దొరకలేదేమో… జగన్ ఆదేశించగానే కుప్పంలో వాలిపోయారు.
కుప్పం వైసీపీ అభ్యర్థిగా అప్పటికే రెండు సార్లు పోటీ చేసి చంద్రబాబు చేతిలో చిత్తుగా ఓడిన చంద్రమౌళి 2019 ఎన్నికలు ముగియకుండానే అనారోగ్యంతో మృతి చెందగా… ఆయన కుమారుడు భరత్ కు కుప్పం బాధ్యతలు దఖలు పడ్డాయి. నవ యువకుడైన భరత్ చేతిలో చంద్రబాబును ఓడించాలని అటు జగన్ తో పాటు ఇటు పెద్దిరెడ్డి కూడా వ్యూమాల మీద వ్యూహాలు పన్నారు. చంద్రబాబును ఓడించడం అలా పక్కనపెడితే… కనీసం ఆయన మెజారిటీని కూడా తగ్గించలేకపోయారు. 2019-24 మధ్య కుప్పం ఇంచార్జీ తానేనన్న ఫోజులు కొట్టిన పెద్దిరెడ్డి నిత్యం కుప్పం చుట్టూరానే తిరిగారు. భరత్ ను వెంటేసుకుని… కుప్పంలోని చోటామోటా నేతలందరినీ గాటన కట్టేసుకున్నారు. ఇలా తన మాట వినని వారిని పోలీసులతో బెదిరించి మరీ పెద్దిరెడ్డి వర్గం తమ పంచన చేర్చుకుంది. పెద్దిరెడ్డి స్వైరవిహారం చూసిన వారైతే… ఈ దఫా చంద్రబాబు ఓడిపోతారేమో అని కూడా భావించారట. అయితే ఎన్నికల వ్యూహ రచనలో బాబును మించి పెద్దిరెడ్డి ఏనాడూ సత్తా చాటిన దాఖలా లేనే లేదు. ఈ విషయాన్ని మాత్రం పెద్దిరెడ్డి మరిచిపోయారు.
అయితే వైసీపీ అధికారం కళ్లు మూసి తెరిసేంతలోగానే అంతమైపోయింది. ఆ ఐదేళ్లు అలా అలా కరిగిపోగా… మొన్నటి ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని సీట్లను కూడా వైసీపీ సాధించలేక చతికిలబడిపోయింది. ఇక పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేలుగా, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచారు. పెద్దిరెడ్డి నియోజకవర్గాల్లో ఎన్నికలు ఏ రీతిన జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. కుప్పంలోనూ తన నియోజకవర్గంలో జరిగిన మాదిరిగానే ఎన్నికలు నిర్వహించి చంద్రబాబును ఓడించాలని పెద్దిరెడ్డి భావించి ఉంటారేమో. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా… పెద్దిరెడ్లు, పెద్దారెడ్లు చెప్పినట్లుగా వ్యవహారాలు నడవవు కదా. అందుకే కాబోలు…ఎన్నికల సందర్భంగా తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన పెద్దిరెడ్డి కుప్పంను టచ్ చేయడానికి కూడా సాహసించలేకపోయారు. ఫలితంగా జనం మెచ్చిన ఫలితాలు వచ్చాయి. పెద్దిరెడ్డి అధిాకారం కోల్పోగా… చంద్రబాబు ఏకంగా నాలుగో సారి సీఎం కుర్చీలో దర్జాగా కూర్చుకున్నారు.
అక్కడితోనే ఈ కథ ముగియలేదు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఆ ఐధేళ్లు కుప్పంలో ఎలాంటి పాలన సాగిందో అక్కడి టీడీపీ శ్రేణులు తమ కళ్లారా చూశారు కదా. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాాగానే… నాడు టీడీపీ శ్రేణులపై దాడులు, దారుణాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డ వారిలో చాలా మంది పరారైపోయారు. వారంతా తిరిగి ఎప్పుడు కుప్పం చేరతారో కూడా తెలియని పరిస్థితి. ఇక కుటుంబాలు, తమ జీవనాధారాలను వదులుకోలేక కుప్పంలోనే కొనసాగుతున్న వైసీపీ నేతలు టీడీపీలోకి క్యూ కట్టారు. ఈ సందర్భంగా వారు టీడీపీ శ్రేణుల కాళ్లావేళ్లా పడి మరీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా కుప్పం మునిసిపల్ చైర్మన్ కూడా మంగళవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. సుధీర్ ను టీడీపీలో చేర్చుకునేందుకు తొలుత తెలుగు తమ్ముళ్లు ససేమిరా అన్నారట. అయితే వైసీపీ జమానాలో తాను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటానని, వైసీపీ ద్వారా తనకు దక్కిన చైర్మన్ సహా పదవులన్నింటినీ వదులుకుంటానని చెప్పడంతో సుధీర్ కు మార్గం సుగమం అయ్యిందట. వెరసి పెద్దిరెడ్డి నడిపిన వ్యూహాలు కుప్పంలో వైసీపీని ఖాళీ చేశాయన్న మాట.