వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న బాధితులపైనే జగన్ సైన్యం ఉల్టా కేసులు పెట్టడం సంచలనంగా మారింది. వివేకా కుమార్తె ఎర్రెడ్డి సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాం సింగ్‌పై పులివెందుల పోలీసులు కేసులు పెట్టారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం చాలా అనుమానాలకు తావిస్తోంది.
సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం జగన్ సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆ ఎన్నికల్లో సానుభూతి ప్రదర్శించి, మొసలి కన్నీరు కార్చి జగన్ చేసిన డ్రామా ఆయనకు బాగా వర్కౌట్ అయింది. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా.. జగన్ తన సైన్యంగా భావించే ఏపీ పోలీసులతో పక్కా వ్యూహ రచన చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ దర్యాప్తు అధికారి రాం సింగ్ పై కేసులు పెట్టారు.
వివేకా హత్య అంశం గత ఎన్నికల్లో తనకు లబ్ధి చేకూరేలా జగన్ రెడ్డి మలచుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ ఐదేళ్లలో స్వయంగా వివేకా కుమార్తె తన తండ్రి హత్య గురించి ఎన్నో ఆరోపణలు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డే తన తండ్రిని చంపారని సునీతా రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయంలో జగన్ అండ్ కో కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు సైతం వెళ్లి కేసు విచారణను ముందుకు తీసుకువెళ్లగలిగారు. చెల్లెలు (బాబాయి కుమార్తె) సునీతా రెడ్డి జగన్ కు ఇలా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే.. సొంత చెల్లెలైన వైఎస్ షర్మిల కూడా వైఎస్ వివేకా హత్యపై కీలక ఆరోపణలు చేశారు. అది పచ్చి పొలిటికల్ హత్య అని వైఎస్ షర్మిల కొద్ది నెలల క్రితం తేల్చి చెప్పేశారు. ఇలా సొంత అన్నయ్య జగన్, బాబాయి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో షర్మిల ఈ వ్యాఖ్యలు చేయడం బాగా చర్చనీయాంశమైంది.
ఇప్పుడు ఏపీలో జగన్ అనుకున్న వై నాట్ 175 నినాదం కాస్తా చతికిలపడిపోయి, అసలు ఎన్నికల్లో గెలిస్తే చాలు అనుకున్న స్థితికి వైఎస్ఆర్ సీపీ దిగజారిపోయింది. అటు టీడీపీ వై నాట్ పులివెందుల అంటూ ముందుకు వెళ్తోంది. ఇంకోవైపు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తారని బాగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం జగన్ వర్గం మీద కోపంతో ఉన్న సునీతా రెడ్డితో టీడీపీ తరపున పులివెందుల నుంచి జగన్ పై పోటీకి దింపుతారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యాల్లో వివేకా హత్య కేసు ద్వారా తనకు వ్యతిరేకంగా చెల్లెళ్లు బయలుదేరుతారని జగన్ భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో బాబాయి హత్య విషయం.. జగన్ కు కలిసిరాగా.. ఇప్పుడు అదే అంశం చెల్లెళ్లు సునీతా రెడ్డి, షర్మిల ద్వారా కొంప ముంచే పరిస్థితి ఉందని జగన్మోహన్ రెడ్డి కలవరపడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే వివేకా పీఏ క్రిష్ణారెడ్డితో పిటిషన్లు వేయించి.. సునీతా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అధికారి రాం సింగ్ పై ఉల్టా కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.