వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలస్ లో ఇప్పుడు పెద్ద ఎత్తున నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తన ఇంటి చుట్టూ శత్రు దుర్భేద్యంగా నిర్మించుకున్న ఇనుప కంచెలో కొంత భాగాన్ని తొలగిస్తున్న కూలీలు… చకచకా పనులు చేసుకుపోతున్నారు. ఈ మొత్తం పనులన్నీ జగన్ స్వీయ పర్యవేక్షణలో జరుగుతున్నాయట. దాదాపుగా రూ.13 కోట్ల మేర .ప్రజా ధనాన్ని వెచ్చించి మరీ నిర్మించిన ఈ కంచెను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దిశగా ఆలోచన చేస్తే… తన ఇంటిలో ఉన్న వాస్తు దోషాలను జగన్ సరిచేయిస్తున్నారని తేలింది. ఈ వాస్తు దోషాల కారణంగానే మొన్నటి ఎన్నికల్లో తన పార్టీ ఘోరంగా ఓడిపోయిందని, తాను అధికారానికి దూరమైపోయానని జగన్ భావిస్తున్నారట. ఈ కారణంగానే సదరు వాస్తు దోషాలను వాస్తు రంగ నిపుణుల సూచనల మేరకు సరిదిద్దే పనులకు జగన్ శ్రీకారం చుట్టారట.
అయినా జగన్ క్రైస్తవుడు కదా. ఆయన వాస్తును కూడా నమ్ముతారా? అంటారా? క్రిస్టియన్ అయినా కూడా జగన్ తిరుమల సహా పలు ఆలయాలకు వెళ్లడం మనకు తెలిసిందే. ఇక విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని ఆయన తన రాజ గురువుగా భావిస్తున్న వైనమూ మనకు తెలిసిందే. ఈ లెక్కన క్రిస్టియన్ అయినా కూడా జగన్ వాస్తును నమ్ముతారనే చెప్పాలి. అంతేకాకుండా ఎవరైనా వేద పండితుడు చెప్పారంటే దానిని జగన్ తూచా తప్పకుండా పాటిస్తారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. సరే… మత విశ్వాసాలు ఎలా ఉన్నా… జగన్ ఇప్పుడు తన తాడేపల్లి ప్యాలస్ లో వాస్తు దోషాలు ఉ్నాయని, వాటిని సరిదిద్దే పనులకు శ్రీకారం చుట్టిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. తాడేపల్లి ప్యాలస్ లో దక్షిణం వైపున ఉన్న ఇనుప కంచెలో కొంత భాగాన్నితొలగించిన కూలీలు… ప్రస్తుతం తూర్పు, ఈశాన్యం వైపున ఉన్న కంచెలో కొంత భాగాన్ని తొలగిస్తున్నారట.
అయినా తాడేపల్లి ప్యాలస్ లో వాస్తు దోషాలు ఉంటే… అదే ఇంటిలో ఉండగానే జగన్ సీఎం అయ్యారు కదా. 2019 ఎన్నికలకు ముందే తాడేపల్లిలో సర్వాంగ సుందరంగా ప్యాలస్ ను నిర్మించుకున్న జగన్…అందులో కొంత భాగాన్ని త నివాసంగా, మరికొొంత భాగాన్ని తన పార్టీ కేంద్ర కార్యాలయంగా మలచుకున్నారు. ఆ తర్వాతే ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూనే 2019 ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆయన 151 సీట్ల భారీ మెజారిటీని సాధించి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేనా… ఆ తర్వాత దానినే సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకుని ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు కూడా. ఎన్నికల్లో గెలిచినప్పుడు అడ్డురాని నిర్మాాణాలు ఓడిపోగానే… ఎలా వాస్తు దోషాలుగా మారాయంటూ జగన్ పై సెటైర్లు పడుతున్నాయి. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని దోచేసి కట్టిన నిర్మాణాలు ఎప్పటికైనా ఆయా నేతల పతనాన్ని శాసిస్తాయన్న దిశగానూ వ్యంగ్యాస్త్రాలు వచ్చి పడుతున్నాయి.