వల్లభనేని వంశీ మోహన్… టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన యువ నేతగా, గన్నవరం నియోజకవర్గంలోని ఏ వర్గ ప్రజలకు ఎప్పుడు?… ఎలాంటి? ఇబ్బంది వచ్చినా… ముందుండి ఆదుకున్న నేతగా, ఆయా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా నిద్రపోని నేతగా… తన వారు అనుకున్న వారికి కష్టమొచ్చిందంటే… సొంత పార్టీ అయినా కూడా వ్యతిరేకించే నేతగా మొన్నటిదాకా మంచి పేరే ఉండేది. ఇప్పుడు తన వెంట నడిచిన ముఖ్య అనుచరులు, తన ఆదేశాలు పాటించిన వ్యక్తిగత సహాయకుడు అరెస్టైనా పత్తా లేని నేతగా, పరారీలో ఉన్న నేతగా వంశీ అప్రతిఫ్ట మూటగట్టుకున్నారు. అదేంటీ… అంత మంచి పేరున్న నేత… ఇలా పరారీలో ఉన్న నేతగా ఎలా మారాడు అంటే… ఆయన ఎంచుకున్న పార్టీలను బట్టే ఆయన వ్యక్తిత్వం కూడా మారిపోయిందని చెప్పక తప్పదు.
యువ నేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వంశీకి ఆదిలోనే విజయవాడ ఎంపీ సీటు ఇచ్చిన టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వంశీ… ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వంశీ కోరిన మేరకే చంద్రబాబు ఆయనకు గన్నవరం సీటు ఇవ్వగా… ఈ దఫా వంశీ ఎమ్మెల్యేగా గెలిచి నిలిచారు. తన నియోజకవర్గ ప్రజలకు అండాదండగా నిలబడ్డారు. వారికి ఏ సమస్య వచ్చినా పోరాడి మరీ పరిష్కరించారు. నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. వరుసబెట్టి మూడు పర్యాయాలు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2019లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ ఆయన గన్నవరంలో టీడీపీ జెండాను ఎగురవేశారు.
అయితే 2019 తర్వాతే వంశీ తీరులో మార్పు వచ్చింది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, కాపు నేత వంగవీటి రాధాలతో మంచి స్నేహ సంబంధాలను కలిగి ఉన్న వంశీ… నాని మాయలో పడిపోయారు. నానితో కలిసి నడిచే దిశగా టీడీపిని వీడి వైసీపీలో చేరారు. అనంతరం తనకు రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీపై కక్ష కట్టారు. టీడీపీ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఏకంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దా*డికి దిగారు. ఫలితంగా ఇప్పుడు పరారీలో ఉన్న నేతగా ఆయన అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ కార్యాలయంపై దా*డి కేసులో వంశీ సహా ఆయన అనుచరులపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణకు కోర్టుకు వచ్చేందుకు కూడా జంకుతున్న వంశీ మందీ మార్బలాన్ని వెంటేసుకుని… వారి వెనుక ఎక్కడో కనీకనిపించకుండా దాక్కుని మరీ కోర్టు వాయిదాలకు ఆయన హాజరవుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో వంశీ వ్యక్తిగత సహాయకుడు (పీఏ)తో పాటు ఆయన ముఖ్య అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి అండగా నిలవాల్సిన వంశీ మాత్రం అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఎక్కడో దాక్కున్నారు.