Do Not Go For OTT Until October Says Telangana Film Chamber :
సినిమా హాళ్ళను కాపాడమని తెలుగు సినిమా నిర్మాతలకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిక్వెస్ట్ చేసింది. అక్టోబర్ వరకు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో నిర్మాతలకు కొన్ని షరతులు పెట్టింది. సినిమా హాళ్లను కాపాడాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని, అక్టోబరు వరకూ ఓటీటీలకు సినిమాలు ఇవ్వడాన్ని నిలిపివేయాలని కోరింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీ మోహన్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
అక్టోబరు నెలాఖరు వరకూ నిర్మాతలెవరూ ఓటీటీలకు సినిమాలు ఇవ్వవద్దని, ఆ తర్వాత కూడా పరిస్థితి బాగుండకపోతే అప్పుడు ఇచ్చుకోండని మురళీ మోహన్ నిర్మాతలను కోరారు. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ‘చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే ఫరవాలేదు, కనీసం పెద్ద వాళ్లు అయినా ఓర్పు వహించాలి కదా?. అక్టోబరు 30 వరకైనా ఆగండి, సినిమాను కాపాడండి.. ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి..నేను కూడా సినిమాలు తీస్తున్నా. నేను కూడా నిర్మాతనే. నాక్కూడా ఆ బాధలు తెలుసు.
నిర్మాత కంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎక్కువ బాధలు అనుభవిస్తున్నారు. మేం నిర్మించిన ‘లవ్ స్టోరీ‘ సినిమాకు పది ఆఫర్లు వచ్చినా ఓటీటీకి ఇవ్వలేదు. మా రిక్వెస్ట్‌ను నిర్మాతలంతా వింటారని అనుకుంటున్నా’ అన్నారు. హీరోలకు కూడా ఓటీటీలకు సినిమాలు ఇవ్వడం ఇష్టం లేదని, వాళ్ళు తమకు మద్దతు ఇస్తారన్నారు. థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీలు 40, 50 కోట్ల ఆఫర్లు ఇవ్వవనే విషయాన్ని గుర్తు చేశారు.
సినిమాలను ఎవరికైనా అమ్ముకోవడం నిర్మాత హక్కేనని, కాస్త ఓర్పుతో నిర్మాతలు వ్యవహరిస్తే మంచిదని తెలంగాణ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు. థియేటర్ వ్యవస్థను చంపాలని ఓటీటీలు చూస్తున్నాయని వాపోయారు. నిర్మాతలకు వెంటనే షేర్ ఇచ్చేది ఎగ్జిబిటర్ల్లేనన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు. కరోనా వల్ల అందరికన్నా ఎక్కువ నష్టపోయింది సినిమా వాళ్లేనని అభిషేక్ నామా అన్నారు. సినిమా థియేటర్ వ్య వస్థ బతకాలంటే ప్రతి ఒక్కరూ పూనుకోవాలని ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ కోరారు.
Must Read ;- ఆర్ఆర్ఆర్ కలిసి ఓటీటీ ప్లాన్ చేయడం నిజమేనా..?











