మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి టీడీపీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన ఇటీవలే టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది. నారా లోకేశ్ తనకు టికెట్ హామీ కనుక ఇస్తే టీడీపీలోకి వస్తానని బాలినేని రాయబారం పంపినట్లు సమాచారం. టికెట్ హామీ కనుక వస్తే టీడీపీలో చేరడానికి తాను రెడీ అని సంసిద్ధత కనబర్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బాలినేని గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇది నచ్చకే బాలినేని టీడీపీ వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారశైలి వైసీపీ అధిష్ఠానానికి కొన్నాళ్లుగా తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. బాలినేని పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండడంతో పార్టీనే ఆయన సేవలు వద్దని భావిస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే బాలినేని రెండు మూడు నెలల క్రితం వరకూ కూడా సొంత పార్టీనే ధిక్కరించేలా మాట్లాడుతూ వచ్చారు. అది అప్పుడు ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలలుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు, వ్యవహారశైలి ఎవరికి అంతుచిక్కలేదు. మంత్రివర్గం నుంచి ఆయన్ను తప్పించినప్పటి నుంచి జగన్ పై కాస్త అసమ్మతితోనే ఉన్నారు. ఆ తర్వాత రీజినల్ కోఆర్డినేటర్ పదవిని ఆయన కూడా బాలినేని వదులుకున్నారు. పార్టీలోనే ఉంటూనే, పార్టీ నేతలపై పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చారు.
మరోవైపు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని జగన్ పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. లోకేశ్, పవన్ కల్యాణ్‌ను తిట్టాలంటూ జగన్ విధించిన షరతులను తిరస్కరించడంతో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ వైపు దృష్టిసారించారు. కానీ, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట, ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను మాత్రమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరతామంటూ బాలినేని ఎన్నో వేదికలపై స్పష్టం చేశారు. ఇప్పుడు మాగుంటకు జగన్ సీటు నిరాకరించడం.. బాలినేనికి సైతం నచ్చడం లేదు. ఈ విషయంలో తాను సీఎం జగన్ తో మాట్లాడతానని కూడా ఓ సందర్భంలో చెప్పారు.
సోషల్ మీడియాలో తాను టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు రావడంతో.. బాలినేని క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీతో టచ్ లో లేనని.. రాజకీయాల్లో ఉన్నంత వరకూ జగన్ తోనే ఉంటానని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే.. అదికూడా ఒంగోలు నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్ధానాల మార్పు జరుగుతోందని. ఆ క్రమంలో తాను గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానన్న వార్తల్లో కూడా నిజం లేదని బాలినేని కొట్టిపారేశారు. అయితే, బాలినేని నిజంగానే టీడీపీతో సంప్రదింపులు చేయడం లేదని అనుకోలేమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. నిజంగా టీడీపీ నేతలతో రాయబారం నడుపుతున్నప్పటికీ.. ఆ విషయం బహిరంగంగా ఎవరూ చెప్పుకోరు. కాబట్టి, తెరవెనుక అంతా చర్చలు జరిగాక.. బాలినేని ఒక్కసారిగా రాజీనామా చేస్తారని అంటున్నారు.