తెలంగాణ ముఖ్యమంత్రితో ఏపీ సీఎం జగన్ కు పూర్తిగా మద్దతు కరవైన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే తెలంగాణ సీఎంగా కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయారో.. ఇక జగన్ ఒంటరి అయిపోయారు. రేవంత్ రెడ్డి అంటే జగన్ కి బొత్తిగా నచ్చదనే విషయం అప్పుడే అర్థం అయింది. రేవంత్ రెడ్డి కొత్తగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు కనీసం శుభాకాంక్షలు కూడా జగన్ చెప్పలేదు. పొరుగు రాష్ట్రాల విషయంలో ముఖ్యమంత్రిగా కొత్తగా పదవీ బాధ్యవీ బాధ్యతలు చేపడితే విషెస్ చెప్పుకొనే సాంప్రదాయం వస్తూ ఉంది. ఎంతటి ప్రత్యర్థులైనా కనీసం ఫార్మాలిటీకి అయినా సరే, సోషల్ మీడియాలో అయినా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కానీ, రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం జగన్ అస్సలు చెప్పలేదు.
అయితే, తాజాగా జగన్ విషయంలో రేవంత్ రెడ్డి తన వైఖరి ఏంటో స్పష్టంగా తేల్చి చెప్పేశారు. తనకు జగన్‌ను కలుపుకుపోయే ఉద్దేశం ఏ మాత్రం లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. అదే సమయంలో జగన్ చెల్లెలు, కాంగ్రెస్ నేత అయిన వైఎస్ షర్మిలకు మాత్రం తన నుంచి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. అందుకు కారణాలను కూడా రేవంత్ రెడ్డి ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాక్రిష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరినందున.. ఆమె ఏపీ నాయకురాలు అయినప్పటికీ తమ పూర్తి మద్దతు ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఏ సాయం కావాల్సి వచ్చినా, అధిష్ఠానం సూచనల మేరకు.. తమ పార్టీ లైన్‌కు కట్టుబడే వైఎస్ షర్మిలకు, ఏపీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటామని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ విస్తరణకు, పార్టీ బాగా బలపడడానికి తాము శాయశక్తులా పని చేస్తామని చెప్పారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి మాత్రం జగన్ కు ఏ విషయంలోనూ మద్దతు పలకబోనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీకి తెరవెనుక మద్దతుగా ఉంటున్నారు. జగన్ తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ.. కేంద్రంలోని బీజేపీకి సాగిలాపడ్డ సంగతి తెలిసిందే. అలా బీజేపీతో సీక్రెట్ గా కలిసి ముందుకు సాగుతున్న జగన్‌తో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచేలా తాము ప్రయత్నిస్తామని.. అదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి పని చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పార్టీని నిర్వీర్యం చేయడమే తమ అజెండా అని రేవంత్ రెడ్డి పరోక్షంగా చెప్పారు.
దీంతో వైఎస్ జగన్‌కు వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు కఠినంగా మారబోతున్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో మిత్రుడైన కేసీఆర్.. ఏపీలో జగన్ గెలిచేందుకు అన్ని విధాలుగా సహకరించారు. జగన్ గెలవాలని బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అలా గత ఎన్నికల్లో అన్ని కలిసొచ్చి జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇప్పుడు తెలంగాణలో జగన్ కు ఏ తోడూ లేకపోవడంతో ఒంటరి అయిపోయారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తారనే విషయం స్పష్టం అవుతోంది. నిజానికి వైసీపీ పైన అత్యంత ప్రజా వ్యతిరేకతతో ఈ సారి జగన్ గెలుపు అసాధ్యమని తేలిపోయింది. అయినప్పటికీ, రేవంత్ రెడ్డి కూడా జగన్ ఓటమికి హైదరాబాద్ లో ఉండే తన వంతుగా గోతులు తవ్వుతున్నారని భావిస్తున్నారు.