మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్, ఆయన సోదరి షర్మిల. క్యారెక్టర్ లేని వ్యక్తి క్యారక్టర్ గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. విజయసాయిరెడ్డితో భేటీ విషయాలపైనా క్లారిటీ ఇచ్చారు షర్మిల. సొంత మేనల్లుడు, మేన కోడలు ఆస్తులను జగన్ దోచేయాలని చూస్తున్నారంటూ, విశ్వసనీయత, క్యారెక్టర్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
ఆస్తుల వివాదం విషయంలో విజయసాయిరెడ్డికి ప్రెస్‌మీట్ పెట్టే ఉద్దేశం లేకున్నా జగనే ఆయనతో బలవంతంగా ప్రెస్‌మీట్ పెట్టించారని, తనకు వ్యతిరేకంగా మాట్లాడించారని చెప్పారు. ఆ రోజు విజయసాయి రెడ్డి చెప్పిన ప్రతి మాట జగన్ రాసిచ్చిందేనన్నారు షర్మిల. ఇటీవల భేటీలో విజయసాయిరెడ్డి తనకు ఈ మాట చెప్పారన్నారు షర్మిల. ఆస్తుల్లో సమాన వాటా ఉందని కుటుంబంలోని అందరికీ తెలుసన్నారు షర్మిల. అయినప్పటికీ జగన్ సొంత మేనల్లుడు, మేన కోడలు ఆస్తి కాజేయ్యాలని చూశాడన్నారు.
విశ్వసనీయత అంటూ జగన్ మాట్లాడిన మాటలకు చురకలు అంటించారు షర్మిల. అబద్ధాలు ఆడకూడదు అంట..విలువలు,విశ్వసనేయత ఉండాలట.. పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం ఆలోచన చేయాలట..వెన్నుపోటు పొడవకూడదంట అని జగన్‌ను ఎద్దెవా చేశారు. సాయి రెడ్డి చేత అబద్ధాలు చెప్పించలేదా ? ప్రజలను అవే నిజాలని నమ్మించ లేదా ? సొంత తల్లి మీద స్వార్థం కోసం కేసు పెట్టలేదా ? ఆస్తికోసం ఏదైనా చేయొచ్చు అనుకోలేదా ? సొంత చెల్లికి మీరు వెన్నుపోటు పొడిచిన..మీకు క్రెడిబులిటి ఉందా ? అంటూ జగన్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.
వైసీపీ ఐదేళ్ల పాలనలో నాసిరకం మద్యం అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకున్నప్పుడే జగన్ క్రెడిబులిటి అర్థమైందన్నారు. సొంత చిన్నాన్నను హత్య చేసిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నప్పుడే జగన్‌కు విశ్వసనీయత పోయిందన్నారు. రుషికొండను తొలిచి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టించినప్పుడే, ఆస్తులు కాజేయాలని చూసి సొంత చెల్లెలిని అవమానించినప్పుడే విశ్వసనీయత పోయిందన్నారు షర్మిల.