ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ చంద్రబాబును మెచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీకి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేయడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతలు, ఎంపీలు ప్రచారం చేయడం ఢిల్లీలో బీజేపీకి కలిసొచ్చిందన్నారు మోదీ. చంద్రబాబుకు, తెలుగుదేశం నేతలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సుపరిపాలనతో ఓ ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారంటూ పొగడ్తలు కురిపించారు మోదీ. ఎక్కడైతే నాయకులు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకుంటారో అక్కడ సత్ఫలితాలు వస్తాయన్నారు మోదీ. డెవలప్‌మెంట్ పాలిటిక్స్‌కి దాదాపు మూడు దశాబ్దాలుగా చంద్రబాబు కేరాఫ్‌గా మారారు.. దేశంలోనే ఆయన ఈ విషయంలో ఒక స్టార్ పొలిటీషియన్.. ఏపీ, తెలంగాణకి ఎంత కొత్తమంది సీఎంలు వచ్చినా, దేశంలోనూ నవ యువ ముఖ్యమంత్రులు బాధ్యతలు చేపట్టినా, అభివృద్ది కేంద్రంగా జరిగే రాజకీయాలకు చంద్రబాబే చుక్కానీ.. అదే అంశాన్ని ప్రధాని మోదీ తన స్పీచ్‌లో సింగిల్ లైన్‌లో పొందుపరిచారు..
కేంద్రంలో NDA కూటమి ఉండడంతో ఏపీకి మరింత మేలు చేకూరుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు తీవ్రమైన నీటి ఎద్దడి ఉండి వ్యవసాయం చేయడం ఇబ్బందిగా ఉండేదన్నారు. కానీ ఇవాళ గుజరాత్ వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తోందన్నారు.
ఇక ఢిల్లీలో బీజేపీకి మద్దతుగా చంద్రబాబు రెండు రోజులు ప్రచారం నిర్వహించారు. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం చేయడం బీజేపీకి కలిసొచ్చింది. చంద్రబాబు ప్రచారం నియోజకవర్గాల్లో ఒకటైన షహదారాలో దాదాపు 30 ఏళ్ల తర్వాత బీజేపీ జెండా ఎగిరింది. బీజేపీ తరపున పోటీ చేసిన సంజయ్ గోయల్ గెలుపొందారు. చివరగా 1993లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
ప్రధాని మోదీ కామెంట్స్‌పై చంద్రబాబు స్పందించారు. మోదీకి అభినందనలు తెలిపిన చంద్రబాబు..దేశం ఇప్పుడు మోదీ నమూనాను కోరుకుంటుందన్నారు. సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు.











