వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య కొన్నాళ్లుగా ఆస్తుల పంచాయతీ నడుస్తోంది. అయితే షర్మిలతో పాటుగా తన తల్లి విజయమ్మపైనా జగన్ కోర్టుకు ఎక్కిన విషయం బయటపడటంతో బుధవారం ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనను తన చెల్లి షర్మిల మోసం చేసిందని, ఈ విషయం తెలిసి కూడా తన చెల్లికే మద్దతుగా నిలిచిన తన తల్లి విజయమ్మకు గతంలో ఇస్తానని రాసిచ్చిన షేర్లను ఇప్పుడు ఇవ్వదలచుకోవడం లేదని జగన్ వాపోయిన తీరు అమితాసక్తి రేకెత్తించింది. అదే సమయంలో మాట తప్పను మడమ తిప్పను అంటూ సాగిన జగన్.. తన సొంత కుటుంబ సభ్యుల విషయంలోనే ఇలా రివర్స్ గేర్ వేశారంటూ ఆయనపై సెటైర్లు పడుతున్నాయి. అసలు ఈ వ్యవహారంలో జగన్ ను షర్మిల మోసం చేసిందా?.. లేదంటే షర్మిలను జగన్ మోసం చేశారా? అన్న దిశగానూ చర్చ నడుస్తోంది. ఈ సందిగ్ధతకు తెర దించుతూ జగన్ కు గత నెలలో షర్మిల రాసిన ఓ లేఖ తాజాా బయటకు వచ్చింది.
గత నెల 12న షర్మిల… జగన్ కు ఓ లేఖ రాసింది. తాడేపల్లి ప్యాలెస్ అడ్రెస్ కే వచ్చిన సదరు లేఖలో షర్మిల సంతకంతో పాటుగా జగన్ తల్లి వైఎస్ విజయమ్మ సంతకం కూడా ఉండటం గమనార్హం. ఈ లేఖలో తమ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ుండగా… ఆయన ఏం చెప్పారన్న విషయాన్ని కూడా షర్మిల ప్రస్తావించడం గమనార్హం. తన కుటుంబ ఆస్తులన్నింటిని రాజశేఖరరెడ్డి.. జగన్ కో, షర్మిలకో నేరుగా రాసివ్వలేదు. అంతేకాకుండా తన బిడ్డలుగా తన ఆస్తులను సమంగా పంచుకోాలని కూడా ఆయన వారికి చెప్పలేదు. జగన్, షర్మిలలకు ఇద్దరేసి పిల్లలున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన కుటుంబ ఆస్తులన్నింటినీ… తన నలుగురు మనవలు, మనవరాండ్లకు సమానంగా పంచాలని ఆయన చెప్పారు. నాడు ఆయన చెప్పిన మాటకు జగన్ కూడా సరేనన్నారట. ఇదే విషయాన్ని షర్మిల తన లేఖలో ప్రస్తావించారు.
నాడు నాన్న బతికి ఉండగా,…ఆయన చెప్పిన ప్రకారం కుటుంబ ఆస్తులను నలుగురు పిల్లలకు సమానంగా పంచుతానని ఒప్పుకున్నావవు కదా అంటూ షర్మిల తన లేఖలో జగన్ కు గుర్తు చేశారు. తన జీవిత కాలంలో పోగైన కుటుంబ ఆస్తులను నలుగురు పిల్లలకు సమానంగా పంపిణీ చేయాలని రాజశేఖరరెడ్డి చెప్పిన మాటను గుర్తు చేస్తూనే… ఆ ఆస్తులు భారతి సిమెంట్స్ అయినా, సాక్షి అయినా, ఇతరత్రా ఏ కంపెనీలకు చెందిన ఆస్తులనైనా ఇలానే పంపిణీ చేయాలన్న ఆయన మాటను గుర్తు చేశారు. అయితే తండ్రి మరణం తర్వాత ఇప్పుడేమో అలా నలుగురు పిల్లలకు ఆస్తులను పంపిణీ చేసేందుకు ఎందుకు నిరాకరిస్తున్నావని నిలదీశారు. నాడు నాన్న చెప్పిన మాటకు ఊకొట్టడం, ఇప్పుడు అడే మాటను తోసి రాజని ప్రవర్తిస్తున్న మీ తీరుకు ఇప్పటికీ బతికే ఉన్న మన తల్లి విజయమ్మ సాక్షిగానే కాకుండా జరుగుతున్న అన్ని పరిణామాలను పరిశీలిస్తూనే ఉన్నారంటూ ఆమె జగన్ కు చురకలంటించారు.