కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి రథ సారధి బీజేపీ. ఈ కూటమి ఏర్పాటులో టీడీపీది కూడా కీలక భూమికే. 1998లో ఏర్పాటైన ఈ కూటమికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కన్వీనర్ గానూ వ్యవహరించారు. కూటమి ఏర్పాటయ్యేలా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ బీజేపీ నేతలకు చంద్రబాబు తనవంతు సహాయం చేవారు. ఇక అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉండగా… జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన చంద్రబాబు… నాటి ఎన్డీఏ సర్కారు తీసుకున్న కిలక నిర్ణయాల్లో చంద్రబాబు పాత్ర గణనీయంగా కనిపిస్తుంది. ఏపీజే అబ్దుల్ కలామ్ ను దేశ ప్రథమ పౌరుడిగా ఎంపిక చేయడంలో చంద్రబాబు నిర్ణయమే పనిచేసిందని అందరికీ తెలిసిందే. అయితే 2004 తర్వాత ఎన్డీఏ వరుస ఓటములతో డీలా పడిపోగా… బీజేపీతో టీడీపీ బంధాలు కూడా ఒకింత క్షీణించాయనే చెప్పక తప్పదు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ మళ్లీ జట్టు కట్టింది. ఈ రెండు పార్టీల బంధం అటు కేంద్రంలో, ఇటు ఏపీలో రెండు పార్టీలకు విజయాన్ని అందించింది. అయినా కూడా 2019 ఎన్నికల దాకా ఈ బంధం నిలబడలేదు. ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతరత్రా రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి దక్కాల్సిన పలు కీలక అంశాలపై సీఎం హోదాలో చంద్రబాబు రాజీపడలేకపోయారు. ఫలితంగా ఎన్నికలకు కాస్తంత ముందుగానే ఈ రెండు పార్టీల బంధం ముగిసింది. ఈ పరిణామం అటు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. కేంద్రంలో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోగా… ఏపీలో మాత్రం టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకున్నా… ఏపీలో మాత్రం ఆ పార్టీకి సింగిల్ సీటు కూడా దక్కలేదు. తాజాాగా మొన్నటి ఎన్నికలకు ముందు ఇరు పార్టీల మధ్య తిరిగి చర్చలు మొదలు కాగా….ఆ చర్చలు ఇరు పార్టీల మధ్య మళ్లీ పొత్తుకు బాటలు వేశాయి. 2014 మాదిరిగానే ఈ పొత్తు అటు కేంద్రంలో బీజేపీకి హ్యాట్రిక్ ను అందించగా.. ఏపీలో టీడీపీకి తిరిగి అధికారాన్ని అందించింది.
ఈ పరిణామం ఇరు పార్టీల వైఖరిలో సమూల మార్పును తీసుకుని వచ్చింది. అప్పటిదాకా ఏపీ సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మిత్రపక్షమైన బీజేపీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీని కలవాలంటే అపాయింట్ మెంట్ కావాల్సి వచ్చేది. అంతేనా… చంద్రబాబు పది అడిగితే… మోదీ వాటిలో ఏ కొన్నింటికి మాత్రమే తలూపేవారు. వెరసి రెండు పార్టీలు ఒకే కూటమిలోనే ఉన్నా… ప్రొటోకాల్, ఇతరత్రా పలు అంశాలు వాటిని అల్లంత దూరాననే ఉంచేవి. 2024 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అప్పటిదాకా రెండు పార్టీల మధ్య కొనసాగిన దూరం కనుమరుగు అయిపోయింది. రెండు పార్టీల నేతలు ఏమాత్రం మొహమాటం లేకుండానే కలిసిపోతున్నారు. వీరి మధ్య ఇప్పుడు ప్రొటోకాల్ సమస్యలు కూడా ఉత్పన్నం కావడం లేదు. చంద్రబాబు ఢిల్లీలో దిగినంతనే మోదీ పిలిచేస్తున్నారు. లోకేశ్ దిగీదిగంగానే… అమిత్ షా రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు అడిగిన ఏ ఒక్కదానికి కూడా మోదీ నో చెప్పడం లేదు. లోకేశ్ చెప్పిన ప్రతి అంశాన్ని సావదానంగా వింటూనే గో అహెడ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లోనూ బీజేపీ, జనసేనతో కలిసే పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేనలతో మంచిగా వ్యవహరించాలని, ఆ పార్టీ నేతలతో పొరపొచ్చాలు పనికి రావని తెలిపారు. అంతేకాకుండా ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న 29 నియోజకవర్గాలనూ మనమే చూసుకోవాలని, రానున్న ఎన్నికల్లోనూ ఆ స్థానాల గెలుపు బాధ్యతలు మనవేనని కూడా టీడీపీ శ్రేణులకు తెలిపారు. వెరసి బీజేపీతో టీడీపీ బంధం ఇప్పుడప్పుడే ముగిసేది కాదని చంద్రబాబు చెప్పకనే చెప్పేసినట్టైంది. మరోవైపు చంద్రబాబు, లోకేశ్ లే కాకుండా ఏపీకి చెందిన ఇతర మంత్రులు ఢిల్లీకి వెళ్లినా కేంద్ర మంత్రులు వారిని సొంత పార్టీ నేతలుగానే చూస్తున్నారు. చివరకు టీడీపీ ఎంపీలను కూడా కేంద్ర మంత్రులు సొంత పార్టీ నేతలుగానే పరిగణిస్తున్నారు. మొత్తంగా టీడీపీని వీడేందుకు బీజేపీ గానీ, బీజేపీని వీడేందుకు టీడీపీ గానీ సిద్ధంగా లేవని చెప్పాలి.