(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
దీపావళి పండుగ పూట ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గుండెల్లో రెవెన్యూ అధికారులు బాంబు పేల్చారు. ఆయన స్వాధీనంలో ఉన్న సుమారు 13 ఎకరాల ప్రభుత్వ భూమిని శనివారం స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం దరి అడవివరం విజయరాంపురం అగ్రహారంలో టిడి నెంబర్ 1180 లో 124 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 35 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాను ఎటువంటి సర్వే నెంబరు లేకుండా ఈనామ్ డిప్యూటీ తాసిల్దార్ గతంలో జారీ చేశారు. దానితోపాటు అర్హులైన మరో 30 ఎకరాలకు సంబంధించిన భూములపై సమగ్ర సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు 124 ఎకరాల స్థలం ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 60 ఎకరాలకు సంబంధించి పలు కోర్టు వివాదాలు ఉండడంతో, మిగిలిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ గతంలో నిర్మించిన 7 షెడ్లు, 20 కాంపౌండ్ వాల్స్ ను తొలగించారు.
గంటా కు చెందిన భూములు…
ఇక్కడ మాజీ మంత్రి గంటా కు చెందిన సుమారు 13 ఎకరాల భూములు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి భూముల పై అనేక వివాదాలు తలెత్తినప్పుడు అధికారంలో ఉండటంతో వాటి జోలికి పోలేదు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి చెందినదిగా చెబుతున్న 124 ఎకరాల భూమి విలువ సుమారు 500 కోట్ల వరకు ఉంటుంది.
టీడీపీ నేతల ఆస్తులపై కొనసాగుతున్న దాడులు..
విశాఖ జిల్లాలో టిడిపి నేతలకు సంబంధించిన ఆస్తుల పై దాడుల పరంపర కొనసాగుతోంది. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ భూములను గుర్తించలేని రెవెన్యూ అధికారులు గత రెండు నెలల కాలంలో విస్తృతంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడే పనిలో పడ్డారు. మరి వారికి ఏ టెక్నాలజీ సాయం లభిస్తుందో తెలియదుగానీ.. ఏళ్లనాటి ఆక్రమణలు కట్టడాలను సైతం తిరగతోస్తున్నారు. మాజీ మేయర్ సబ్బంహరి, గీతం విద్యా సంస్థలకు చెందిన ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న అధికారులు తాజాగా గంటా ఆధీనంలో ఉన్న భూములను సైతం హస్తగతం చేసుకున్నారు. దీపావళి పండుగ రోజున అధికారులు ఇంత కష్టపడి పనిచేయడం వెనుక కారణం విశాఖ వాసులకు తెలిసిందే.
గంటా దారులు మూసుకు పోయినట్టేనా?
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస రావు ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతూనే ఉంది. అనేక తేదీలు ఖరారు చేసినా, వాయిదా పడుతూ వస్తోంది. మంత్రి ముత్తంశెట్టి వర్గం విభేదిస్తుండడంతో ఆయన టిడిపిలోనే కొనసాగుతున్నారు. ఇప్పటివరకు టీడీపీ నేతలు లక్ష్యంగా ఆక్రమణలు తొలగిస్తున్న ప్రభుత్వం… తాజాగా ఆ జాబితాలో గంటా ఆస్తులను కూడా చేర్చడం చూస్తుంటే… అధికార పార్టీ ద్వారాలు మూసేసినట్టు భావించాల్సి వస్తోంది. పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేసే గంటా శ్రీనివాసరావు ఏం చేస్తారో చూడాలి మరి!











