అసలే మొన్నటి ఎన్నికల్లో జనం కొట్టిన దెబ్బకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయన పార్టీ నేతలు కొత్త కొత్త నేరాలకు పాల్పడటం, ఆ నేరాల్లో వారు అడ్డంగా బుక్ అవుతున్న తీరు ఆయనను మరింతగా ఇబ్బంది పెడుతోంది. ఇలా నిత్యం పార్టీ అధినేతను అసహనానికి గురి చేస్తున్న వైసీపీ నేతల్లో విజయవాడకు చెందిన గౌతం రెడ్డి అందరి కంటే ముందు ఉంటారు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచే ఆయన వెంటే తీరుగుతున్న గౌతం రెడ్డి… ఎప్పనటికప్పుడుజగన్ కు కొత్త సమస్యలను తెస్తూనే ఉన్నారు.
తాజాగా ఓ భూకబ్జా కేసుతో పాటు సదరు భూమి యజమానిని హత్య చేయించేందుకు ఏకంగా సుపారీ గ్యాంగులనే రంగంలోకి దించి తనదైన మార్కు విలనిజాన్ని బయటపెట్టుకున్నారు. ఈ ఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న బెజవాడ పోలీసులు…గౌతంరెడ్డిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా… కేసు విషయాన్ని ముందే పసిగట్టి అండర్గ్రౌండ్ లోకి వెళ్లిన గౌతం రెడ్డిని అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు ఏకంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
గౌతం రెడ్డి రూటే సపరేటు అని చెప్పాలి. ఓ రాజకీయ పార్టీలో ఉంటూ… అదే పార్టీలోని నేతలతో సఖ్యతగా మెలిగే విషయంలో ఏనాడూ ఆయన పరిణతి చూపించలేదనే చెప్పాలి. సొంత పార్టీ అయినా, ప్రత్యర్థి పార్టీలకి చెందిన వారైనా… తనతో శత్రుత్వం ఉంటే…దానిని అలాగే ఆయన కొనసాగిస్తారు. ఇలానే గతంలో వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న వంగవీటి రాధాకృష్ణపై గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపాయి. ఆ వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. అంతేనా… సదరు వ్యాఖ్యల ఫలితంగానే వంగవీటిమ రాధా వైసీపీకి దూరంగా జరిగారన్న వాదనలూ వినిపించాయి. వైఎస్ ఫ్యామిలీతో ప్రత్యేకించి… కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో దగ్గరి బంధుత్వమే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చిందని పార్టీలో గుసగుసలు వినిపించాయి. ఇక వైసీపీ అధికారంలో ఉండగా…ఇదే బంధుత్వాలతో ఏకంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌతం రెడ్డి పదవిని దక్కించుకోగలిగారు.
ఇక తాజా వివాదం వివరాల్లోకి వెళితే… విజయవాడ నగరంలో ఉమా మహేశ్వర శాస్త్రికి ఓ విలువైన స్థలం ఉండగా… దానిపై గౌతం రెడ్డి కన్నుపడింది. ఎలాగైనా సదరు ఆస్తిని దక్కించుకునేందుకు పావులు కదిపిన గౌతం రెడ్డి… పలుమార్లు ఉమామహేశ్వర శాస్త్రిని బెదిరించారు. స్థలం ఇవ్వకుంటే చంపేస్తానని కూడా బెదిరించారు. అయితే గౌతం రెడ్డి బెదిరింపులకు ఉమామహేశ్వర శాస్త్రి బెదిరిపోలేదు. ఈ క్రమంలో ఎలాగైనా సదరు స్థలాన్ని హస్తగతం చేసుకోవాల్సిందేనన్న భావనతో ఏకంగా సుపారీ గ్యాంగులను గౌతంరెడ్డి రంగంలోకి దించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లుకు చెందిన నలుగురు వ్యక్తులను గౌతం రెడ్డి రంగంలోకి దించారు. ఉమామహేశ్వర శాస్త్రి కాళ్లు, చేతులు విరిచేయాలని ఆదేశించిన గౌతంరెడ్డి.. అందుకోసం వారికి రూ.24 లక్షలమేర సుపారీ ఇచ్చారు.
గౌతంరెడ్డి కదలికలపై అనుమానం వచ్చిన ఉమామహేశ్వర శాస్త్రి అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌతం రెడ్డి నుంచి తనకు ప్రాణ హానీ ఉందని సదరు ఫిర్యాదులో ఆయన పోలీసులకు తెలిపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు… గౌతంరెడ్డి వ్యవహారసరళిపై అప్పటికే ఓ అవగాహన ఉండటంతో… దీనిపై ఒకింత లోతుగానే ఆరా తీశారు. ఈ పరిశీలనలో గౌతం రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఉమామహేశ్వర శాస్త్రిని మట్టుబెట్టేందుకు హంతక ముఠాకు గౌతం రెడ్డి సుపారీ మొత్తాన్నిఇస్తున్న దృశ్యాలను సీసీ ఫుటేజీ ద్వారా పట్టేశారు. వెనువెంటనే గౌతం రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. అయితే అప్పటికే ఈ విషయం తెలుసుకున్న గౌతం రెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు… గౌతంరెడ్డి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.