నారా చంద్రబాబునాయుడు… టీడీపీ అధినేతగా సుదీర్ఘ కాలం రాజకీల్లో కొనసాగుతున్న నేతగా యావత్తు దేశానికి తెలుసు. అంతేనా… ప్రప్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకున్నా… వారందరిలోకి చంద్రబాబే వయసులో పెద్దవారు. అంతేకాదండోయ్… దేశంలోని అందరు ముఖ్యమంత్రుల కంటే కూడా చంద్రబాబే పవర్ ఫుల్ కూడా. అంటే…దేశంలోనే అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారు. ఇదేదో…టీడీపీ అనుకూలురు చెబుతున్న మాట కాదు. నేషనల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. నిబద్ధత కలిగిన మీడియా సంస్థగా పేరు తెచ్చుకున్న ఇండియా టుడే విడుదల చేసిన ఓ సర్వే ఈ విషయాన్ని వెల్డిడించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు, వారికి జాతీయస్థాయిలో కలిగిన పలుకుబడి, పార్టీ, ప్రభుత్వంపై పట్టు…ఇలా పలు కీలక అంశాల ఆధారంగా సర్వే చేపట్టిన ఇండియా టుడే… పవర్ ఫుల్ సీఎంల జాబితాను ఇటీవలి తన తాజా సంచికలో విడుదల చేసింది. ఇక దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో టాప్ టెన్ లోకి దూసుకుపోయిన చంద్రబాబు… ఏకంగా ఐదో స్థానంలో నిలిచారు.
చంద్రబాబు ఇటీవలి ప్రస్థానాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఇండియా టుడే పత్రిక… జైలు జీవితం నుంచి నేరుగా సీఎం కుర్చీ దాకా సాగిన ఆయన ప్రస్థానాన్ని ఫీనిక్స్ పక్షితో పోల్చింది. అంతేకాకుండా తాను అరెస్ట్ అయిన సమయంలో ఇక టీడీపీ ప్రస్థానం ముగిసినట్టేనన్న బావనను తుత్తునీయలు చేసిన చంద్రబాబు… అదే పార్టీని రాష్ట్రంలో రికార్డు మెజారిటీతో గెలిపించిన తీరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. నిరాశా నిస్పృహల నుంచి పార్టీని అత్యున్నత స్థానానికి చేర్చిన చంద్రబాబును అనితర సాధ్యుడిగా అభివర్ణించింది. ఏటికేడు వయసు మీద పడుతున్నా కూడా ఇప్పటికీ నిత్య నూతనంగా కనిపించే చంద్రబాబు… ఓ యువనేత మాదిరిగా తన పార్టీ శ్రేణులకు నిత్యం నూతనోత్తేజం నింపుతూ ఉంటారని తెలిపింది. ఈ తరహా చంద్రబాబు చురుకుదనం రాష్ట్ర ప్రజలను కూడా ఉత్తేజితులను చేస్తోందని సదరు పత్రిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియా టుడేలో చంద్రబాబు ప్రస్తావన, ఆయన స్థాయి దేశంలో ఓ రేంజికి వెళ్లిపోయిన వైనంపై టీడీపీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
2024 ఎన్నికలకు ముందు టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లోక్ సభ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యేల్లోనూ ఓ నలుగురు దాకా వైసీపీ పంచన చేరిపోయారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడమన్న మాటే లేదు. అయితే 2019 ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మొట్టమొదటి సారిగా రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులే లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితి నుంచి పార్టీని ఒక్కసారిగా ఫీనిక్స్ పక్షిలా పైకి లేపిన చంద్రబాబు.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు టీడీపీ ఎంపీలపై ఆధారపడే స్థాయికి తీసుకుని రాగలిగారు. ఈ ఇతివృత్తాన్ని ప్రస్తావించిన ఇండియా టుడే… దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఐదోస్థానంలో చంద్రబాబును నిలబెట్టింది.
చంద్రబాబు కంటే ముందు ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీలు ఉన్నారు. ఇక దేశ రాజకీయాల్లో కొమ్ములు తిరిగిన నేతలుగా పేరున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ అదినేత అఖిలేశ్ కుమార్ యాదవ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లు చంద్రబాబు తర్వాతి స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు.