( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
స్థానిక సంస్థల ఎన్నికల మాటెత్తితేనే వైయస్సార్సీపీ ప్రభుత్వం హడలి పోతున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాబోమని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక అభిప్రాయాలు పార్టీల నుంచి తీసుకుని సమర్పించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించాలన్న ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యాఖ్యలను.. హైకోర్టు ఆక్షేపించింది. “ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా?” అని ప్రశ్నించింది. ఏయే చోట్ల ప్రభుత్వం సరిగ్గా సహకరించడం లేదో.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
ఇప్పుడు వైరస్ గుర్తొచ్చిందా?
లాక్‌డౌన్‌కు ముందు ఎన్నికల కమిషన్ తనకున్న విచక్షణ అధికారంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వివాదాలకు దారితీస్తుందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం తగ్గించడం.. ఆయన స్థానంలో మరొకరిని నియమించడం.. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టడం.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? అంటూ ఎన్నికల కమిషనర్‌పై నిప్పులు చెరగడం.. అబ్బో.. చాలానే జరిగాయి.
తరువాత క్రమంగా లాక్‌డౌన్‌ను పెంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం వెళ్లడం… దేశ ఆర్థిక పరిస్థితులు, రెవెన్యూను దృష్టిలో పెట్టుకొని అన్లాక్ ప్రక్రియ దశల వారీగా అమలు చేయడంతో… దేశమంతా కరోనా వైరస్ కు ముందున్న దశకు చేరుకుంది. వైన్‌షాప్ ల ముందు క్యూ ల గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బార్లు .. రెస్టారెంట్లు సినిమా థియేటర్లు, పార్కులు, చివరకు వచ్చే నెల నుంచి విద్యా సంస్థలు సైతం తెరచుకోబోతున్నాయి. దేశంలో అనేక చోట్ల ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
ప్రభుత్వం ససేమిరా
దేశమంతా ఒకదారైతే.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది మరోదారి. కరోనా వైరస్ మరోసారి తిరగబెట్టే ప్రమాదం ఉందని, ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను జనం అడ్డగోలుగా వాడుకుంటూ ఒకరి మీద ఒకరు ఎగబడి మద్యం కొనుగోళ్లు, మాంసం విక్రయాలు చేస్తుండగా జరగని కరోనా వైరస్ వ్యాప్తి … ఇప్పటికే బడులు మొదలైన 9, 10 తరగతుల విద్యార్థులకు.. వచ్చేనెల నుంచి ప్రైమరీ విద్యార్థులకు… అంటుకోని వైరస్.. ఓటర్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టదని ప్రభుత్వం భయపడుతోంది. నమ్మేందుకు అతి కష్టంగా ఉన్నా ప్రభుత్వం చెబుతున్న వాదన ఇదే.
వ్యతిరేకతే కారణం..
ప్రస్తుతం ప్రభుత్వానికి అన్ని వైపులా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి ఖాయం అన్న అభిప్రాయానికి వచ్చేసింది. మరోవైపు ఎన్నికల కమిషనర్ తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించరు కనుక అడ్డగోలు వ్యవహారాలు సాగవనే ఆందోళన కూడా వారిలో ఉన్నట్టుంది. ఒక్కటేంటి ఎటు చూసినా అధికార పార్టీకి నష్టమే తప్ప మరో దృశ్యం కనిపించడం లేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు వద్దు మొర్రో … అంటూ గగ్గోలు పెడుతోంది. తదుపరి కోర్టు విచారణలో తమ వాదనలు ప్రభుత్వం ఎలా వినిపిస్తుందో వేచి చూడాలి.