దుబ్బాక ఉప ఎన్నికల వేడి టీఆర్ఎస్ను తాకుతోంది. నిన్న సిద్దిపేటలో జరిగిన ఘటనలు ఆ పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లపై దాడి చేయడం.. ఆ పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి వివిద పక్షాలు. ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు ఎన్నికల కమిషన్ ను తాకాయి. టీఆర్ఎస్ పార్టీ తీరును ఎండగడుతూ ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రధానాధికారి ని కలిసి ఫిర్యాదుచేసారు. టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చెప్పారు.
టీఆర్ఎస్ తీరుపై రేవంత్ ఫైర్..
ఎన్నికల్లో డబ్బులు పంచడం వేరు.. ఇంట్లో డబ్బులు దొరకడం వేరంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. సోదాలునిర్వహిస్తున్న సమయంలో ఎన్నికల అధికారిని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. నిన్న దొరికిన డబ్బులు మంత్రి హరీష్ రావు వి ఎందుకు కాకూడదని రివర్స్ ఎటాక్ చేశారు రేవంత్. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి దూకుడు చర్యలకైనా పాల్పడుతుందని, అందుకు ఈ ఘటనే నిదర్శనం అంటూ ఎద్దేవా చేసారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇక మరోవైపు దుబ్బాక ఎన్నికల్లో ధన ప్రవాహంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదుచేసింది. దుబ్బాక ఎన్నికల సందర్భంగా మద్యం ఏరులై పారుతోందని.. దానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే అంటూ ఫిర్యాదుచేసారు. తమ పార్టీ నేతలను కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఎత్తులు వేస్తుందో వీడియో రికార్డింగ్స్ కూడా ఎన్నికల అధికారికి ఇచ్చామని గుర్తుచేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక పోలీసులు సహకరిస్తున్నారంటూ ఫిర్యాదు చేసారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి .. కోదండరాం.
దుబ్బాక ఎన్నికల సందర్భంగా జరుగుతున్న తతంగంపై ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై ఆయన మండి పడ్డారు. ఎన్నికలను నిష్పక్ష పాతంగా నిర్వహిచేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికార పార్టీ ఒత్తిళ్ళమేరకు స్థానిక అధికారులు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం సరైంది కాదన్నారు. అధికారం ఉంది కదా అని విపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడటాన్ని ఆయన ఆక్షేపించారు. ఇలాంటి చర్యల వల్ల ఎన్నికల కమిషన్ పరువు బజారు పాలవుతుందని ఘాటుగా స్పందించారు . ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ సీరియస్గా ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలని.. తప్పు ఎవరు చేసినా శిక్షించే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు.











