గయ్యాళి అత్తగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన డాక్టర్ సూర్యకాంతం శతజయంతి ఉత్సవం ఈ ఏడాది జరగబోతోంది. 1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో ఆమె జన్మించారు. వచ్చే అక్టోబరు 28న ఆమె శతజయంతి సంవత్సరం ప్రారంభమవుతోంది. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆమె తన అక్క కుమారుడు అనంత పద్మనాభమూర్తిని దత్తత తీసుకున్నారు. ఆయనే ఈ శతజయంతి ఉత్సవ బాధ్యతను తీసుకున్నారు. తన సహజ నటనతో ఆ బాలగోపాలాన్ని అలరించిన నట శిరోమణి ఆమె. తన ఎడమచేతివాటంతో వయస్సుతో నిమిత్తం లేకుండా ఎలాంటి వారినైనా అలవోకగా వాయించే విలక్షణ నటి.
నాటి తరం నుంచి నేటి తరం వరకు తన హావభావాలతో ఏ రసాన్ని అయినా ఇట్టే పోషించి మెప్పించే అద్భుత నటి కావడం వల్లే ప్రేక్షకులు ఆమెకు చిత్ర పరిశ్రమలో పట్టంగట్టారు. ఆమె శత జయంతి సందర్భంగా చె న్నపురి తెలుగు అకాడమీ వారి ఆధ్వర్యంలో ఆమె అమోఘమైన నటనకు నీరాజనాలు అర్పిస్తూ ఓ గ్రంథాన్ని రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. ఆమె నటనకు సంబంధించిన మంచి వ్యాసాలను సేకరిస్తున్నారు. ఆమె అనేక పాత్రల్లో పోషించిన నవరసాలైన శృంగారం, హాస్యం, బీభత్సం, వీరం, అద్భుతం, భయానకం, శాంతం, కరుణ, రౌద్రం ఆధారంగా వ్యాసాలు ఉండాలి.ఎవరైనా ఈ వ్యాసాలు రాయవచ్చు. డీటీపీలో నాలుగు పేజీలకు తగ్గకుండా ఈ వ్యాసాలు ఉండాలి. వ్యాసాలను ఈ నెల 30లోగా పంపించాల్సి ఉంటుంది. dr[email protected] అనే మెయిల్ ఐడీకి ఈ వ్యాసాలు పంపవచ్చు.
నట జీవిత ప్రస్థానం
జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డ్యాన్సర్ గా సూర్యకాంతానికి తొలి అవకాశం వచ్చింది. నెలకు ఆమె తొలి జీతం 75 రూపాయలు. 1949లో ధర్మాంగద చిత్రంలో మూగ పాత్ర పోషించారు. అలా చిన్నా చితకా వేషాలు వేసినా తర్వాత లీలాకుమారి సాయంతో నారద నారది సినిమాలో సహాయ నటి అవకాశం వచ్చింది. చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేశారామె. ఆ తర్వాత సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. హీరోయిన్ అవ్వాలనుకున్న కోరికను సౌదామిని చిత్రంతో వచ్చింది. అదే సమయంలో కారు ప్రమాదం జరిగి ఆమె ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం చేజారిపోయింది. కోలుకున్న తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది.
ఆ పాత్ర క్లిక్ అవడంతో ఎక్కువగా అలాంటి పాత్రలే వచ్చాయి. ముఖ్యంగా గయ్యాళి అత్త అంటే ఇలానే ఉంటుంది అనేలా ఆ పాత్ర మారిపోయింది. అంతే కాదు సూర్యకాంతం అనే అందమైన పేరు కాస్తా గయ్యాళి పేరుగా మారిపోయింది. అందుకే ఎవరూ ఆ పేరు పెట్టుకోవడానికి కూడా సాహసించలేదు. అదే పేరుతో సినిమా తీయడం విశేషం. ‘నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. ‘సూర్యకాంతం’ అనే చక్కని పేరును ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు’ అంటూ నటుడు గుమ్మడి ఆమెతో చలోక్తులు విసేరేవారట.
ఆమెకన్నా ముందే నటి అంజలి సినీ రంగానికి వచ్చారు. అంజలి, ఆదినారాయణరావు, ఎస్వీ రంగారావు లాంటి వారితో ఉన్న పరిచయం వల్లనే ఆమెకు సినిమాలపై ఇష్టం ఏర్పడింది. దాదాపు 750పైగా సినిమాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో పోషించారు. ఎన్నో గయ్యాళి పాత్రలు పోషించినా ఆమె స్వతహాగా సౌమ్యురాలు. చక్కని మాటతీరుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. ముఖ్యంగా రకరకాల వంటలు చేసి తెచ్చి షూటింగులో అందరికీ పెట్టేవారంటారు. మహానటి సావిత్రి స్మారక అవార్డు ఆమెను వరించింది. ‘ఎస్.పి.పరశురాం’ నటిగా ఆమె ఆఖరి చిత్రం. 1994 డిసెంబరు 18న కన్నుమూశారు.