రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో 4 వేల కోట్ల వ్యయంతో రెన్యూ ఎనర్జీ సంస్థ సోలార్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ పేరుతో.. సోలార్ ప్యానెల్స్, మాడ్యూల్స్‌లో వినియోగించే ఇన్‌గట్స్, వేఫర్స్‌ను ఉత్పత్తి చేస్తారు. రాంబిల్లి ప్లాంట్ ద్వారా ఏడాదికి 6 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ఇన్‌గోట్, వేఫర్స్‌ని తయారు చేస్తారు..
సీఎం చంద్రబాబు సమక్షంలో భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలనే టార్గెట్‌తో పనులు ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా రెండు వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రెన్యూ ఎనర్జీ సంస్థకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో 4 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ ఉత్పత్తి పరిశ్రమ, గుజరాత్‌లోని థోలేరాలో 2.4 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్, 2.5 గిగావాట్ల సోలార్ సెల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకొంది. రాష్ట్రవ్యాప్తంగా సోలార్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో మొత్తం 82 వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది..
సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో వరుసగా భారీ ఇండస్ట్రీలు వస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లక్షా 50 వేల కోట్లు పెట్టుబడితో నిర్మిస్తున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. దానికి కొద్ది రోజుల ముందు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో బ్లూ జెట్ హెల్త్‌కేర్ సంస్థకు చెందిన కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రానికి మంత్రి నారా లోకేశ్ పునాది వేశారు..
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని ఇచ్చిన హామీ నేరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, ఉక్కు పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, మెడికల్ టెక్నాలజీ సంస్థలు, టూరిజం ప్రాజెక్టులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన పరిశ్రమలను తీసుకొస్తూ.. రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్ హబ్‌గా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేసుకొంటున్న కంపెనీలన్నీ మరో రెండు మూడేళ్లలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభిస్తాయి. అప్పుడు ఆంద్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోతుంది..











