జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై విపక్షాలో, సామాన్య జనాలో కోర్టుకు వెళితే.. విచారణ సందర్భంగా న్యాయమేదో, అన్యాయమేదో తేల్చాల్సిన బాధ్యత కోర్టులకు ఉంది కదా. అలాంటి కోర్టులు తమ నేత ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టాయని ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒళ్లు తెలియనట్టుగా నాట్యం చేశారు. న్యాయమూర్తులన్న గౌరవం కూడా లేకుండా వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. న్యాయమూర్తులకు కులం, ప్రాంతంతో పాటు వర్గం, రాజకీయ పక్షపాతాన్ని ఆపాదిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై న్యాయ వ్యవస్థ ఘాటుగానే స్పందించింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలంటూ నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచేసింది. నిందితులపై వేర్వేరుగానే సోమవారం నాడు కోర్టులో చార్జిషీట్లను దాఖలు చేసింది.
అరెస్ట్‌లు.. ఆపై చార్జిషీట్లు..
ఇప్పటికే ఈ కేసులో కడప జిల్లాకు చెందిన రాజశేఖరరెడ్డితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిని విచారించి పంపారు. తదుపరి విచారణలకు కూడా హాజరు కావాలంటూ వారికి ఆదేశాలు జారీ చేశారు. ఇంకా విదేశాల్లో ముగ్గురు దాక్కున్నారని, వారి కోసం కూడా సీబీఐ అధికారులు వేట సాగిస్తున్నారు. మొత్తంగా రాజశేఖరరెడ్డి అరెస్ట్ తోనే ఈ కేసులో వైసీపీకి చెందిన సోషల్ మీడియా బ్యాచ్ ఆత్మ రక్షణలో పడిపోయింది. అదే సమయంలో అప్పటిదాకా ఈ బ్యాచ్ సేవలను బాగానే సద్వినియోగం చేసుకున్న వైసీపీ కష్టాల్లో చిక్కుకున్న వారిని మాత్రం పట్టించుకోలేదు. వెరసి సీబీఐ కూడా ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచింది. అరెస్ట్ చేసిన వారందరిపై వేర్వేరుగా చార్జిషీట్లను దాఖలు చేసింది. అంటే.. అరెస్టులు, ఆపై చార్జిషీట్ల దాఖలు రోజుల వ్యవధిలోనే ముగిసిపోయిందన్న మాట.
తదుపరి చర్య ఏమిటంటే..?
ఈ కేసులో సీబీఐ దూకుడు చూస్తుంటే.. చార్జిషీట్లను కూడా పకడ్బందీ సాక్ష్యాలతోనే దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. తాము నమోదు చేసే కేసులను కూడా విచారించేది న్యాయమూర్తులే కదా. మరి అలాంటి న్యాయమూర్తులపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. సీబీఐ అధికారులే కాదు.. ఏ దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులైనా కాస్తంత వేగంగానే స్పందిస్తారు కదా. ఈ కేసులోనే అదే జరిగింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసును దర్యాప్తు చేయండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ రంగంలోకి దిగిపోయింది. పక్కా ఆధారాలను సేకరించిన సీబీఐ నిందితులను కూడా చాలా వేగంగానే పట్టేసింది. ఆపై చార్జిషీట్లను కూడా త్వరితగతిననే దాఖలు చేసింది. ఇక ఇప్పుడు జరిగేదేమంటే.. ఈ చార్జిషీట్లపై కోర్టుల్లో విచారణ ప్రారంభమే తరువాయి. ఏలాగూ ఆధారాలు కూడా బలంగానే లభించిన నేపథ్యంలో నిందితులకు శిక్షలు ఖాయమనే వాదన వినిపిస్తోంది.