హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడప్పుడే జరిగేలా కనిపించడం లేదు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్సే స్వయంగా ఆ ఉప ఎన్నిక వాయిదా పడేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికను వాయిదా పడేలా చేసిన టీఆర్ఎస్.. హుజూరాబాద్ ఓటర్లను మచ్చిక చేసుకోవడాన్ని మాత్రం మరింతగా ముమ్మరం చేసిందనే చెప్పాలి. కేసీఆర్ మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మరో మంత్రి గంగుల కమలాకర్ లు హుజూరాబాద్ ఓటర్లను టీఆర్ఎస్ వైపునకు తిప్పే దిశగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం చేనేత కార్మికులకు నూలు విక్రయాలకు సంబంధించిన రిబేట్ చెక్కుల పంపిణీ కోసం హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన హరీశ్ రావు.. టీఆర్ఎస్ గొప్పతనాన్ని చెబుతూనే, బీజేపీని విలన్ గా చూపే యత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన నోట నుంచి పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ విడుదలైంది. నమ్మకానికి టీఆర్ఎస్ మారు పేరైతే.. అమ్మకానికి బీజేపీ మారు పేరుగా మారిందని హరీశ్ చెప్పిన డైలాగ్ బాగానే పేలింది.
నమ్మకానికి టీఆర్ఎస్ మారు పేరు
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ క్రమంలో ఆయన ఏమన్నారంటే.. ‘‘చేనేత కార్మికుల త్విఫ్ట్ ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తుంది. చేనేత కార్మికుల కోసం త్విఫ్టు కోసం త్వరలో రూ.30 కోట్లు మంజూరు చేస్తాం. మంత్రి కెటిఆర్ చేనేత కార్మికుల కోసం రూ.70 కోట్లు విడుదల చేశారు. హుజురాబాద్ లో చేనేత కార్మికుల కోసం రూ.1.90 కోట్లు మంజూరు చేశాం. చేనేత సంఘం కార్మికులకు పెండింగ్ ఉన్న అన్ని రకాల డబ్బులు విడుదల చేస్తున్నాం. తెలంగాణ వచ్చాక చేనేత కార్మికులు తీసుకున్న అన్ని రకాల అప్పులు మాఫీ చేయించినం. త్వరలో చేనేత కార్మికుల సమస్యల పై సీఎం కేసీఅర్ తో సమావేశం ఏర్పాటు చేయిస్తా. చేనేత మిత్ర పథకం ద్వారం చేనేత కార్మికులకు సబ్సిడీ ఇస్తాం. రైతు బీమా తరహాలో చేనేత ,మత్స్య ,గౌడ బీమా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయబోతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, స్థలాలు ఉన్న వారికి ఇల్లు కట్టిస్తం. హుజురాబాద్ లో పద్మశాలి భవనం నిర్మిస్తాం భవనానికి కొండ లక్ష్మణ్ బాపు జీ అని పేరు పెడుదాం’’ అని హరీశ్ రావు తనదైన ఫ్లోలో ప్రసంగించారు. మొత్తంగా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నామని, ఈ కారణంగానే టీఆర్ఎస్ నమ్మకానికి మారు పేరుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
అమ్మకానికి బీజేపీ మారు పేరు
టీఆర్ఎస్ గొప్పతనాన్ని వివరించిన హరీశ్ రావు.. ఆ తర్వాత కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. ఈ సందర్భంగా హరీశ్ ఏమన్నారంటే..‘‘రాష్ట్రంలో తెరాస, కేంద్రంలో బీజేపీ ఉంది. 200 పెన్షన్ , రెండు వేలు చేశాం. ఆడపిల్లపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి , కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, ఉచితవిద్యుత్, రైతు రుణ మాఫీ చేశాం. కరోనా సమయంలో ప్రతీ కార్డుదారుడికి 1500 రూ. పది కేజీల బియ్యం, పప్పు ఇచ్చాం. ఇన్ని మేం చేస్తుంటే, కేంద్రంలో బీజేపీ అసలు ఏం ఇచ్చింది. గ్యాస్ ధర రూ.1000కు పెంచింది. పెట్రోల్ , డిజిల్ ధరలు పెంచింది. వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.గ్యాస్ సబ్సిడీ 250 నుండి 40 రూ తగ్గించింది. బొట్టు బిల్లలు, కుట్టుమిషన్లు, కడుపు నింపుతాయా ? వాళ్ల ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కదా..గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎందుకు చెప్పడం లేదు. గ్యాస్‌సబ్సిడీ 250 రూ ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు. ప్రభుత్వ రంగంలోని సంస్థలను విక్రయిస్తూ అమ్మకానికి బీజేపీ మారుపేరుగా నిలిచింది’’ అని హరీశ్ రావు సెటైరిక్ వ్యాఖ్యలు చేశారు. చివరి పంచ్ గా హుజూరాబాద్ ఓటర్లు ఎవరి వైపు అని ప్రశ్నించిన హరీశ్ రావు..అన్నం పెట్టే వాళ్ల దిక్కా? పన్నులు వేసే వాళ్ల దిక్కా? అంటూ లాస్ట్ పంచ్ సంధించారు.
Must Read ;- అటు బీజేపీ, ఇటు మజ్లిస్.. మధ్యలో టీఆర్ఎస్











