Jagan Not Fulfilling Promises Given To Leaders :
ఓట్లేసిన ప్రజలనే కాదు, నమ్ముకున్న నాయకులను కూడ జగన్ వాడుకుని వదిలేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. కష్టకాలంలో, ముఖ్యంగా ప్రతి పక్షంలో ఉన్నప్పుడు తనకు అండగా ఉన్న నాయకులను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదన్న ఆరోపణలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారమప్పుడు ఆయా నాయకులకు ఇచ్చిన హామీలు కూడ బుట్టదాఖలవుతున్నాయి. జగన్ ఇచ్చిన హామీలతో వైసీపీ అభ్యర్థుల విజయానికి అహర్నిశలు కష్టపడ్డామని, అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు నాయకులు ఆవేదన చెందుతున్నారు.
కాంగ్రెస్‌ను వీడి వైసీపీలోకి వస్తే..
ఎమ్మెల్యేలుగా ఉన్న ఆ నలుగురు నాయకులు కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు జగన్ వెన్నంటే ఉన్నారు. అధికారంలో ఉన్న టీడీపీపై ఆయన తరఫున పోరాడారు. అయితే వారికి 2019 ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో చుక్కెదురయ్యింది. వారిలో ఒకరు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయనకు ఆర్ధిక స్తోమత లేదన్న కారణంగా సీటు దక్కలేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవిచ్చి మంత్రిని చేస్తానని మాటిచ్చారు. దీంతో చిలకలూరిపేట అభ్యర్థి రజనీ విజయానికి ఆయన, ఆయన అభిమానులు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మంత్రి పదవి అటుంచి ఎమ్మెల్సీ కూడ ఆయనకు ఇవ్వలేదు.
మిగతా ముగ్గురి పరిస్థితి కూడా..
పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన రావి వెంకటరమణకు కూడ ఇదే పరిస్థితి ఎదురైంది. సామాజిక సమీకరణల పేరుతో కిలారి రోశయ్యకు సీటిచ్చారు. అధికారంలోకొచ్చాక ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్న ఆనాడు ప్రచారంలో జగన్ చెప్పిన మాటలు అమలు కాలేదు. రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు పరిస్థితి కూడ ఇదే. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మేరకు ఆయన రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి ఎంతో కష్టపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఆయనకు ఎలాంటి సముచిత స్థానం కల్పించకపోవడంతో 2019 ఎన్నికల్లో వాడుకుని వదిలేశారని ఆయన అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన దేవినేని వెంకటరమణకు ఎంతో ప్రాధాన్యమిచ్చి ఈయన్ను అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు.
వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావుది కూడ దాదాపు ఇదే పరిస్థితి. కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ కూడ ఆశించకుండా పని చేసినా అవమానాలు ఎదురొంటున్నట్లు తెలుస్తోంది. అధినేతనే కాకుండా ఆయన సహకారంతో గెలిచిన అభ్యర్థి కూడ తమను పట్టించుకోవడం లేదని మల్లిఖార్జునరావు అభిమానులు అంటున్నారు.
Must Read ;- వైసీపీలో హైటెన్షన్.. జగన్ బెయిల్ రద్దేనా?