నేషనల్, ఇంటర్నేషనల్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి, రాష్ట్రాల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఓ జాబితాని విడుదల చేస్తోంది. 2018వ సంవత్సరం నుంచి ఈ జాబితాను విడుదల చేస్తున్నారు. స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ – 2019 ర్యాంకింగ్స్ ని ర్యాంకింగ్స్ ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరిలు విడుదల చేశారు. ఈ ఇండెక్స్ ప్రకారం ఏపీ మొదటి స్థానంలో ఉండగా ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ మూడో స్థానంలో నిలిచి ఏపీతో పోటీ పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ఇండెక్స్ లో పోటీ పడటం విశేషం.
లాక్ డౌన్ వేళ ఆత్మనిర్బర్ భారత్ అమలులోనూ ఏపీ ముందంజలో ఉందని కేంద్రం తెలిపింది. పెరిగిన పారదర్శకత, మెరుగైన పని తీరుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అద్దం పడతాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని వ్యాఖ్యానించారు. టాప్-3లో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అభినందించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఈ మూడు రాష్ట్రాలు ముందుడటం అభినందనీయమని అన్నారు. దీనిపై ఏపీ పారిశ్రామిక శాఖల మంత్రి గౌతమ్ రెడ్డి ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న చర్యల వల్లే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు.
కరోనా సమయంలో పరిశ్రమలను తిరిగి తెరిచేందుకు సీఎం జగన్ ఆర్థిక తోడ్పాటు అందించాడని గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అయితే ఈ జాబితాపై విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామిక పెట్టుబడులు తెలంగాణలో ఎక్కువగా వస్తున్నాయి. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ సంవత్సర జాబితాలో మూడో స్థానానికి పడిపోవడంపై అనుమానాలు రేకెత్తాయి. ఇదే సమయంలో 2018లో విడుదలైన జాబితాలో 12వ స్థానంలో ఉన్న యూపీ రెండో స్థానానికి చేరుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు పెద్ద పీట వేస్తోందని కేంద్రం ప్రకటన చేయడంపై కూడా సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఏపీలో ప్రారంభానికి నోచుకోలేదని కానీ కేంద్రం మాత్రం బిజినెస్ లో నెంబర్ 1 అంటున్నారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మొత్తంమీద ఈ విషయంలో జగన్ సర్కార్ కు ఊరట లభించిందని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.











