వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలనూ దోచుకున్న విషయం తెలిసిందే. ఆఖరుకు ఆ ఏడుకొండలవాడిని సైతం వైసీపీ నేతలు వదల్లేదు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా గత వైసీపీ హయాంలో జరిగిన మరో భారీ దోపిడీని వెలుగులోకి తెచ్చారు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి.
TTD పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీపై షాకింగ్ వీడియోను విడుదల చేసిన భాను ప్రకాష్ రెడ్డి..పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి దోచుకున్న దృశ్యాలు అందులో ఉన్నాయని తెలిపారు. దొంగతనానికి వైసీపీ నాయకులు, అధికారుల సహకారం ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ దొంగతనాలు జరిగినాయని, ఒక్కటీటీడీలోనే రూ.100 కోట్ల వరకు దోచుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ఓ అధికారి త్వరలోనే అప్రూవర్‌గా మారనున్నారని, త్వరలోనే అసలైన దోషుల పేర్లు బయటకు వస్తాయన్నారు. టీటీడీ వ్యవహారాల్లోని అవినీతిపై మరింత దర్యాప్తు జరగవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు.
పరకామణిలో దొంగతనంపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయ్యిందన్నారు భానుప్రకాష్ రెడ్డి. దొంగతనం కేసును CIDకి అప్పగించిందని తెలిపారు. చోరీ చేసిన రవికుమార్‌కు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందన్నారు. సీఐడీ విచారణ జరిగితే సంచలన విషయాలు బయటికొస్తాయన్నారు. పరకామణిలో రవికుమార్ దోచుకుంటే వైసీపీ నేతలు, అధికారులు ఆ సొమ్మును పంచుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. దోచుకున్న కోట్లాది రూపాయలను రియల్ ఎస్టేట్‌లో పెట్టారన్నారు. అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నారని, చోరీ అంశంపై భూమన సమాధానం చెప్పాలని భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.











