వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో గురువారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు ఏకకాలంలో నిర్వహించడంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈడీ మూకుమ్మడి సోదాలు నిర్వహించింది. 9 సంస్థలు, వాటి కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా కీలక రికార్డులు, హార్డ్‌డిస్క్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి సతీమణి దివ్యారెడ్డి పై, యూవీ డిస్టిలరీస్ యజమానుల్లో ఒకరైన తీగల విజేందర్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న హైదరాబాద్ అరేట్ ఆసుపత్రి సహా పలుచోట్ల ఈ సోదాలు జరిగాయి.
జగన్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల సొమ్ము వసూలు చేసేందుకు వైసీపీ ముఠా అనేక మార్గాలు అనుసరించింది. APSBCL నుంచి డిస్టిలరీల ఖాతాల్లోకి సొమ్ము జమకాగానే ఆయా సంస్థల యజమానులు.. అందులో 12 శాతాన్ని నగదు రూపంలోకి మార్చి వైసీపీ ముఠాకు అందజేసేవారు. దీని కోసం డిస్టిలరీల యజమానులు బంగారు దుకాణాలు, డొల్ల కంపెనీలు, ప్యాకేజింగ్ సంస్థల ఖాతాల్లోకి నిధులు మళ్లించి వైట్ నుంచి బ్లాక్‌లోకి మార్చేవారు. ఈ అక్రమాల్లో వందల సంస్థలు భాగమయ్యాయి. ఈ ముఠా భారీగా మనీ లాండరింగ్‌కు పాల్పడింది. ఆ మూలాలు వెలికితీసేందుకు ఈడీ తాజా సోదాలు జరిపింది.
వైసీపీ ముఠాకు ముడుపులు చెల్లించిన డిస్టిలరీలు, సరఫరా కంపెనీల యాజమాన్యాలను ED ఇటీవల ప్రశ్నించి.. వారి వాంగ్మూలాలు నమోదు చేసుకుంది. APSBCL నుంచి డిస్టిలరీల ఖాతాలకు సొమ్ము జమకాగానే ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్ని వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించడం, బంగారం కొన్నట్లు రికార్డుల్లో చూపించడం లాంటి చర్యలతో నగదు రూపంలోకి మార్చి రాజ్ కసిరెడ్డి బృందానికి అందించినట్లు ఇప్పటికే నిర్ధారణ కావడంతో ఏయే మార్గాల్లో సొమ్ము చెల్లించారు? ఎవరెవరికి.. ఏయే తేదీల్లో ఎంతెంత చెల్లించారనే వివరాలన్నీ రాబట్టింది. అంతకు కొన్నాళ్లముందు విజయవాడ జైల్లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డినీ ప్రశ్నించి వివరాలు సేకరించింది. వాటి ఆధారంగా మనీలాండరింగ్ కోసం పలు కంపెనీలను వినియోగించినట్లు గుర్తించింది.
మొత్తంగా లిక్కర్ స్కామ్ వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తోంది. ఓ వైపు జగన్ ఆయన సన్నిహితులు వరుసగా లాయర్లతో సమావేశమవుతున్నారు. ఈ సమావేశాలు ఎక్కువగా బెంగళూరులోనే జరుగుతున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డిని అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది.











