ప్రాణాలు నిలపాల్సిన ప్రాణవాయువు కొరత కరోనా రోగుల ప్రాణాలు తీస్తోంది. అనంతపురం జిల్లాలో ఆక్సిజన్ అందక వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. నిన్న సాయంత్రం 7 గంటలకు రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ 8 గంటలు ఆలస్యంగా రావడంతో అనంతపురంలోని సర్వజన ఆసుపత్రిలో ప్రాణవాయువు నిండుకుంది. దీంతో ఆక్సిజన్ సరఫరాపై చికిత్స పొందుతున్న 11 మంది కరోనా రోగులు చనిపోయారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆక్సిజన్ సరఫరాదారుకు నోటీసులు జారీ చేశారు.
హిందూపురంలోనూ ఇదే పరిస్థితి
అనంతపురం జిల్లాలోని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. రెండు రోజుల కిందటే ఈ ఆసుపత్రిలో అర్థరాత్రి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో నలుగురు రోగులు చనిపోయారు. తాజాగా రాత్రి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కరోనా రోగులు చనిపోయారు.అయితే అధికారులు మాత్రం ఆక్సిజన్ సరఫరాపై నోరు మెదపడం లేదు. మీడియాతో కూడా మాట్లాడేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఆక్సిజన్ సరఫరా లేక చనిపోయినా, వైద్యాధికారులు మాత్రం కరోనాకు చికిత్స పొందుతూ చనిపోయారని చెబుతున్నారు.











