(రంగారెడ్డి జిల్లానుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజు కు దిగజారి పోతోంది. గత శాసన సభ ఎన్నికల్లో పార్టీకి చెందిన అభ్యర్థులు చాలామంది ఓటమి పాలయ్యారు. గెలిచిన ముగ్గురు పార్టీ మారిపోయారు. దీంతో పార్టీ పరిస్థితి ఘోరంగా మారింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజక వర్గాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తాండూర్ నియోజక వర్గo ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎల్. బి. నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీని వదిలి తెరాస లో చేరారు. దీంతో జిల్లాలో బలంగా పార్టీని నడిపించే నాయకులే పార్టీని వదలటంతో పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా జిల్లాలోని కిందిస్థాయి నాయకులు కూడా పార్టీని వదిలి పోతున్నారు. పార్టీని వదిలిపోతున్నా అడిగేవారు, ఆపేవారు కూడా లేకుండా పోయారని పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
నాలుగు రోజుల క్రితం వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన వార్డు మెంబరు తెరాసలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో బలమైన తెరాస నాయకునిపై గెలుపొందిన నాయకులు విధి లేని పరిస్థితిలో తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని మిగతా నియోజక వర్గాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది. మేడ్చల్. వికారాబాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా రామ్మోహన్ రెడ్డి, నర్సింహారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ లను నియమించారు. వీరిని ఏడాది క్రితం నియమించారు. వీరు నియమించినప్పటి నుంచీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూల పరిస్థితులు లేవు.
గత 5 నెలల నుంచి కరోనా కారణంగా ఎలాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. జూమ్ అప్ ద్వారా నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అంతే తప్ప వేరు ఏలాంటి కార్యక్రమాలను నిర్వహించడం లేదు. నాయకులు కూడా కార్యక్రమాలను నిర్వహించడానికి ఆసక్తి చూపటం లేదు. పార్టీనీ నడిపించే మంచి పేరు ఉన్న నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీని బలోపేతం చేయగలరని పార్టీ కింది స్థాయి నాయకులు పేర్కొంటున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్ బాగానే ఉంది. పార్టీ దీనిని వినియోగించుకోవాలి.
జిల్లాలో నిరుద్యోగులు అధికార పార్టీ పై వ్యతిరేకంగా ఉన్నారు. దీనిని క్యాష్ చేసుకునే వారు లేరు. కరోనాతో రాజకీయ పార్టీ ల పరిస్థితి ఏటు పాలుపోని విధంగా ఉంది. గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లిపోగానే పార్టీ పరిస్థితి ఇంతటి దీనావస్థకు చేరుకుందంటే.. మిగిలిన నాయకులు ఎంతటి నిస్సారమైన సారథ్యాన్ని అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాకాకుండా రాష్ట్ర పార్టీకి కొత్త నాయకత్వం వచ్చిన తర్వాతనైనా.. చురుగ్గా ఉంటూ నడిపించే వారిచేతిలోనే స్థానికనాయకత్వం పగ్గాలు కూడా పెడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.











