హత్రాస్ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండ్డాయి. అయితే దీనిని ప్రత్యేక కేసుగా లక్నో కోర్టు విచారణ చేపడుతోంది. సోమవారం అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ వాదనలను విననుంది. అయితే బాధిత కుటుంబానికి యూపీ సీఎం ఇచ్చిన హామీ ఏమైందని అడ్వకేట్ సీమా కుశ్వహ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఢిల్లీలో ఆ కుటుంబానికి శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేయాలని సీమా అంటున్నారు. కోర్టులో ఈ వాదనను ఆమె వినిపించనున్నారు.
అయితే బాధిత కుటుంబం పక్షాన అక్టోబర్ 24వ తేదీన అఫిడవిట్‌లో పొందుపరిచిన తన డిమాండ్లను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని అనుకుంటున్నట్లు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటించినట్లుగా బాధిత కుటుంబానికి ఓ ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. ఆ హామీ ఇంత వరకు పూర్తి కాలేదు. అలాగే ఆ కుటుంబానికి దేశ రాజధానిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే హత్రాస్ ప్రాంతంలో మొత్తం అగ్రకులస్థుల ప్రభావమే ఉందని సీమా కుశ్వహ పేర్కొంటున్నారు.
కేసు తాలూకు విషయాలు..
యూపీలోని హత్రాస్ ప్రాంతంలో 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన దాడికి ఢిల్లీ సఫ్దార్ జంగ్ హాస్పిటల్‌లో ఆ నాడు ట్రీట్‌మెంట్ జరిగింది. సెప్టెంబర్ 14న దాడి జరిగితే సెప్టెంబర్ 29 వరకూ బాధితురాలు ప్రాణాలతో పోరాడుతునే ఉంది. హత్రాస్ బాధితురాలి శరీరాన్ని పోలీసులు అర్ధరాత్రి దహనం చేయడంపై మానవ హక్కుల ఉల్లంఘన అని అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ అక్టోబర్ 12న స్టేట్‌మెంట్ ఇచ్చింది. అలాగే అక్టోబర్ 27న సీబీఐ విచారణ చేస్తున్న ఈ కేసును పర్యవేక్షించాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు సూచించింది. దీంతో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఆరోపణలపై విచారణను వేగవంతం చేసేలా సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎస్ఏ బాబ్డే..ముగ్గురు జడ్జిలతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. కాగా, ఈ రోజు బెంచ్ ముందు ఈ కేసు విచారణకు రానుంది.