సాగర సంగమం- ఎంత అందమైన పేరిది. నది సముద్రంలో కలిసే చోటును ‘సాగర సంగమం’ అంటారు. దీని సినిమా టైటిల్ గా మార్చవచ్చన్న ఆలోచన కళాతపస్వి కాబట్టే విశ్వనాథ్ కు వచ్చింది.
కళకు మరణం లేదు అని దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నా అంతర్లీనంగా మరో అంశం ఇందులో ఉంటుంది. అదే ప్లెటోనిక్ లవ్. అచ్చతెలుగులో దీన్ని అమలిన శృంగారం అనవచ్చు. అలా చూసినప్పుడు శంకరాభరణంకూ, దీనికీ పెద్దగా తేడా ఏమీలేదు. ఈ కళాఖండం విడుదలై జూన్ 3వ తేదీ నాటికి 38 ఏళ్లవుతుంది. పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కమల్ హాసన్, జయప్రద ఈ కథకు మూలస్తంభాలు.
తెలుగులో ‘సాగర సంగమం’, తమిళంలో ‘సలంగై ఓలి’, మలయాళంలో ‘సాగర సంగమం’గా ఒకే రోజు విడుదలై అఖండ విజయాన్ని సాధించిన సినిమా ఇది. సీఎన్ఎన్, ఐబీఎన్ తయారుచేసిన 100 భారతీయ గొప్ప చిత్రాల జాబితలో 13వ స్థానాన్ని దక్కించుకున్న సినిమా ఇది. రష్యా భాషలోకి అనువాదమై అక్కడ 400 థియేటర్లలో విడుదలై వారి అభిమానాన్ని కూడా పొందింది.
తెరవెనుక కథ ఏమిటి?
కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘సప్తపది’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత విశ్వనాథ్ మదిలో ఓ ఆలోచన వచ్చింది. ఓ నృత్య కళాకారుడి జీవితాన్ని సినిమాగా తీయాలి అనేదే ఆ ఆలోచన. హీరోగా మాత్రం కమల్ హాసన్ అని ముందే నిర్ణయించుకున్నారు. దీనికి చేగొండి హరిరామజోగయ్య, అల్లు అరవింద్, వి.వి. శాస్త్రి నిర్మాతలుగా అనుకున్నారు. సంగీత దర్శకుడిగా ఎం. ఎస్. విశ్వనాథన్ ను ఎంపిక చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ‘సీతాకోకచిలుక’ తర్వాత తనతో సినిమా చేయాలనకున్న ఏడిద నాగేశ్వరరావుకి ఈ కథను వినిపించారు విశ్వనాథ్. ఏడిద వెంటనే ఓకే అనేశారు. ఎంఎస్. విశ్వనాథన్ స్థానంలో ఇళయరాజా చేరిపోయారు.
మొదట ఈ పాత్ర చేయడానికి కమల్ ఒప్పుకోలేదు. కారణం ఇది ముసలి పాత్ర కావడమే. పైగా అంతకుముందు చేసిన ‘కడల్ మీన్గళ్’ ఫ్లాప్ అయ్యింది. దానికి తోడు ఈ పాత్ర చేస్తే ఇక అలాంటి పాత్రలే రావచ్చన్న భయం ఇంకోపక్క. ఐదారు నెలలు బతిమాలితే గాని కమల్ ఒప్పుకోలేదు. జయప్రదకు ముందు జయసుధ అనుకున్నారు. ఆమె కాల్షీట్లు లేక జయప్రదను ఎంపిక చేశారు. డ్యాన్స్ తెలిసన అమ్మాయి శైలజ పాత్రకు కావాలి. ఆ టైమ్ లో సంప్రదాయ నృత్యం నేర్చుకుంటున్న ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్.పి. శైలజ పేరును నాగేశ్వరరావు సూచించారు. దానికి విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం ఇద్దరూ ఒప్పుకున్నారు.
తెరమీద కథ ఏమిటి?
ఓ నిస్వార్థ నృత్యకారుడి జీవితం ఇది. నృత్యంలోనే తన సర్వస్వాన్నీ వెతుక్కునేవాడు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ నృత్య ప్రక్రియల్లో రాటుదేలిన బాలకృష్ణ(కమల్) పాత్ర ఇది. కమర్షియల్ విలువలతో ముడిపడిన సినిమారంగానికి అతని కళ పనికిరానిది అవుతుంది. అతనిలోని టాలెంట్ మాధవి(జయప్రద) దృష్టిలో పడుతుంది. అతన్ని ప్రోత్సహిస్తుంది. ప్రముఖుల సమక్షంలో అతని ప్రదర్శనను ఏర్పాటుచేస్తుంది. కానీ తల్లి చనిపోవడంతో అతను ఆ ప్రదర్శనలో పాల్గొనలేకపోతాడు. తనకు అండగా నిలిచిన మాధవిపై ప్రేమను పెంచుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు పెళ్లయి ఉంటుంది. ఆ దంపతులను కలపడానికి బాలకృష్ణ తన ప్రేమను త్యాగం చేస్తాడు.
ఈ నేపథ్యంలోనే తాగుబోతుగా మారతాడు. దీనికి ఓ అందమైన ముగింపును దర్శకుడు ఇవ్వడంతో ఈ సినిమా కళాఖండంగా మారింది. మాధవి కూతురికే గురువుగా మారి ఆమెను మంచి నర్తకిని చేస్తాడు. బాలకృష్ణ మరణంతో ఈ కథ ముగిసిపోతుంది. ఏ కళకూ అంతం లేదనే ముగింపు మాటతో సినిమా పూర్తవుతుంది. ఆరు నందులు, రెండు జాతీయ పురస్కారాలు పొందిన చిత్రంగా దీనికి గుర్తింపు వచ్చిందంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. శతదినోత్సవం తో పాటు సిల్వర్ జూబ్లీ , గోల్డెన్ జూబ్లీ వైపు కూడా పరుగులు తీసింది. బెంగళూరులో ఒకే థియేటర్ లో 511 రోజులు ఆడింది. కథ, కథనాలు ఒక ఎత్తు, ఈ సినిమా పాటలు ఒక ఎత్తుగా చెప్పాల్సి ఉంటుంది.
ఇళయరాజా సంగీత సారథ్యంలోని ఈ సినిమా పాటలు ఓ ట్రెండ్ ను సెట్ చేశాయి. ఇళయరాజాకు మొట్టమొదటి సారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతిని సంపాదించి పెట్టింది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంను ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు వరించింది. కమలహాసన్ నూతి మీద డాన్స్ చేసే ‘తకిట – తధిమి’ పాట , జయప్రద తో కలిసి చేసే ‘నాద వినోదము’, క్లైమాక్స్ లో వచ్చే ‘వేదం అణువణువున నాదం’ పాటల్లో కమలహాసన్ కమల్ డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎస్.పి. శైలజ, శరత్ బాబుల నటన కూడా హైలైట్ గానే చెప్పాలి. అందుకే ఇది పూర్ణోదయ సంస్థ నుంచి వచ్చిన మరో కళాత్మక దృశ్య కావ్యంగా చెప్పాలి.











