సూపర్ స్టార్.. ఈ పేరుకు ఓ సార్థకత ఉండాలి. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ నట వారసుడిగా తన ‘ఖలేజా’ ఏంటో మహేష్ బాబు నిరూపించుకున్నాడు. కృష్ణ ‘నీడ’లోనే సినిమా రంగ ప్రవేశం చేసినా మళ్లీ ఆ సూపర్ స్టార్ అన్న పదాన్ని సొంతం చేసుకోవాలంటే ఎంత టాలెంట్ ఉండాలి?
నెపోటిజంలో ‘నిజం’ ఉంటే కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఎందుకు హీరోగా నిలబడలేకపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్క కాలం మాత్రమే చెప్పగలదు. నాలుగేళ్ల వయసులో ‘నీడ’తోనే ఆయన బతుకు ‘పోరాటం’ ప్రారంభమైంది. అందరికీ కృష్ణగారి అబ్బాయిగా పరిచయమైన మహేష్ బాల నటుడిగా తొమ్మిది సినిమాల ప్రయాణం సాగింది. బాల నటుడిగానే ద్విపాత్రాభినయం చేసి ఆ వయసులోనే ప్రేక్షకుల మనసుల్లో బుల్లెట్ దించేశాడు. ఎప్పుడో కాదన్నయ్యా అప్పుడే వచ్చేశానని గుర్తుచేశాడు. బాల నటుడిగా ప్రారంభమై సూపర్ స్టార్ గా సాగిన మహేశ్ నట ప్రయాణానికి ఈ నవంబరు 29తో 41 సంవత్సరాలు నిండాయి. అందుకే నాకు తెలిసిన కృష్ణగారి కుటుంబం, నేను గమనించిన మహేశ్ బాబు గురించి నాలుగు మాటలు చెబితే బాగుంటుంది.

పద్మాలయ అనే పేరును చిన్నప్పటి నుంచి వినడమే కానీ ఆ స్టూడియోలో అడుగుపెడతానని అనుకోలేదు. 2000 సంవత్సరంలో ‘ఈనాడు సినిమా’ రిపోర్టర్ గా అడుగు పెట్టా.. అలాగే పద్మాలయలో కాలు పెట్టా.. కృష్ణగారిని కలవాలనుకుంటే కుదరలా. పద్మాలయ శర్మను అడిగితే ఇదిగో అదిగో అన్నారు. 2000 సంవత్సరం ‘చాలా బాగుంది’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ ఒక్క సినిమా.. నటుడిగా ఎల్బీ శ్రీరామ్ జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాతో 25 సినిమాలకు ఆయనకు అడ్వాన్సులు వచ్చేశాయని అందరూ చెప్పేవారు. ఓ ఇంటర్వ్యూ చేయడంతో ఆయనతో బాగా పరిచయం ఏర్పడింది. ఓసారి ఫోన్ చేస్తే ‘పద్మాలయ స్టూడియోలో ఉన్నా వచ్చేయండి’ అన్నారు. అప్పుడక్కడ మహేష్ బాబు హీరోగా ‘వంశీ’ షూటింగ్ జరుగుతోంది. అందులో ఎల్బీ శ్రీరామ్ కూడా ఉన్నారు.
పద్మాలయ ఫ్లోర్ లో హీరో మహేష్ బాబు, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ ల మీద ఓ పాట చిత్రీకరిస్తున్నారు. పైన ఉన్న గదిలో నుంచి పాట పాడుతూ మెట్ల మీది నుంచి హీరోహీరోయిన్లు దిగి రావాలి. ఆ సీన్ చిత్రీకరిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, సూర్య, ఎం.ఎస్. నారాయణ, ఎల్బీ శ్రీరామ్, సూర్యలు కూడా ఆ సన్నివేశంలో ఉన్నారు. ‘వేయించుకుంటే బాగుంటాది.. పచ్చాని గాజులు నీచేతికి..’ అంటూ ఈ పాట సాగుతుంది. హీరో హీరోయిన్లు పైన గదిలో నుంచి కిందికి రావాలి. పైనున్న ఆ గదిలో మహేష్, నమ్రత మాత్రమే ఉన్నట్లు నాకు అనిపించింది. ఎందుకంటే కెమెరాలన్నీ కిందే ఉన్నాయి. మిగిలిన నటులూ కిందే ఉన్నారు. పై గదిలో వీరిద్దరే ఉంటారు కాబట్టి ‘మహేష్ ఆ అమ్మాయిని పటాయిస్తే..’ అనే సందేహం కూడా నాకు వచ్చింది.
అలా ఓ నాలుగైదు రోజుల పాటు ఆ షూటింగుకు వెళ్లా. మహేష్ డ్యాన్సుల్లో మంచి ఈజ్ ఉన్నట్లు అనిపించింది. ఏడాది తర్వాత నీలకంఠ దర్శకత్వంలో కృష్ణగారి అమ్మాయి మంజుల ‘షో’లో నటిస్తోంది. పైగా అది సొంత సినిమా. పీఆర్వో బీఏ రాజు నన్ను మంజులకు పరిచయం చేశారు. అలా ఆమెను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. మాటలు కలిశాక దేవుడు అనే అంశంపైకి టాపిక్ వెళ్లింది. ‘నేను దేవుడిని నమ్మను’ అనేశాను. ‘హౌ ఇటీజ్ పాజిబుల్?’ అనేసిందామె. ఆమెతో మాట్లాడాక నాకు అర్థమైంది ఏమిటంటే ఆమెది చాలా పాజిటివ్ మైండ్. ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. తర్వాత వాళ్ల నాన్నగారిని పరిచయం చేసింది.
సినిమాల్లో చూసిన కృష్ణ గారిని అలా కలవాల్సి వచ్చింది. నేను ‘ఈనాడు’ అని చెప్పగానే ఆయన అడిగిన మొదటి మాట ‘దుర్గారావు ఎలా ఉన్నాడు?’ అని. దుర్గారావు ‘ఈనాడు’లో చిన్న ఉద్యోగి. అతని పేరును కృష్ణగారు అడగడం నాకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ‘విశ్వప్రసాద్ ఎక్కడున్నారు?’ అని అడిగారు. విశ్వప్రసాద్ కృష్ణగారి వీరాభిమాని అనే సంగతి నాకు తెలుసు. ‘విశ్వప్రసాద్ గారు మీ గురించి ఎప్పుడూ చెబుతుంటారు’ అన్నా. ఈ ఇద్దరూ కృష్ణగారికి వీరాభిమానులు. విశ్వప్రసాద్ ఈనాడులో సీనియర్ జర్నలిస్టు. విశ్వప్రసాద్ గురించి అడగడం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదుగానీ దుర్గారావు పేరును అంతలా గుర్తుపెట్టుకోవడం మాత్రం ఆశ్చర్యమేసింది.
ఆ తర్వాత కృష్ణగారికి సంబంధించిన డేటా దుర్గారావు దగ్గర ఎంత ఉందో నాకు అర్థమైంది. అప్పట్నుంచి పద్మాలయ స్టూడియోకి వెళితే కృష్ణగారి గదికి వెళ్లే వాడిని. ఆయన ఉదయం 10 గంటలకే ఆఫీసుకు వచ్చేవారు. తన గదిలో కుర్చీలో కూర్చుని కాళ్లు రెండూ ఎదురుగా ఉన్నా టేబుల్ పై పెట్టి డబ్బా టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తుండేవారు. మనం ఎదిగిపోయాం.. ఇక జనంతో పనేముంది అనుకోకుండా మనుషుల్ని పేర్లతో గుర్తుపెట్టుకోవడాన్ని బట్టి చూస్తే కృష్ణగారిలోని గొప్పతనం ఏమిటో అర్థమైంది. నేను ఫోన్ నంబర్ అడిగితే ఇంట్లో తన గదిలో ఉండే నంబర్ ఇచ్చారు. ఎప్పుడైనా అవసరమైతే కాల్ చేయవచ్చని చెప్పారుగానీ నాకు ఆ అవసరం రాలేదు. యువరాజు గురించి మాట్లాడుకోబోయే ముందు రాజుగారి గురించి తెలియడం కోసమే ఇదంతా.
యువరాజుతో రెండు ఇంటర్వ్యూలు
సినిమా షూటింగుల్లో మహేష్ బాబును చూసినా అతనితో ఇంటరాక్షన్ ఏర్పడింది మాత్రం రెండుమూడుసార్లు మాత్రమే. మొదట్లో చాలా సిగ్గుపడే తత్వం ఉన్న మనిషిలా అనిపించాడు. ‘సరిలేరు మీకెవ్వరు’ సమయంలో చూస్తే మాత్రం మనిషి చాలా ముదిరిపోయాడు అని అనిపించాడు. అలా ఎందుకనాల్సి వచ్చిందో కూడా చెబుతా. ‘షో’ సినిమా తర్వాత మంజులతో సాన్నిహిత్యం ఏర్పడింది. మహేష్ బాబుతో ఇంటర్వ్యూ కావాలని అడిగితే ఏర్పాటుచేశారు. అప్పటికే నమ్రతతో అతనికి లవ్ ఎఫైర్ సాగుతున్నట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఆ ప్రశ్న అడగాలా వద్దా అని నాకు సంకోచం. అడిగితే అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు.
పద్మాలయలోని ఆ గదిలో నేను, మహేష్ తప్ప ఎవరూ లేరు. ఆఖరికి ధైర్యం చేసి అడిగాను. ‘నమ్రతతో మీకు లవ్ ఎఫైర్ సాగుతోందని అంటున్నారు.. నిజమేనా అండీ ?’ అన్నా. మహేష్ మౌనం.. ఔననీ చెప్పలేదు.. కాదనీ చెప్పలేదు. ‘మీరు పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు?’ మళ్లీ అడిగా. నవ్వాడుగానీ సమాధానం చెప్పలేదు. ‘మౌనం అంగీకారం అనుకోవచ్చా?’ అన్నా. అయినా మౌనమే. ‘నేను రాయను.. పోనీ ఆఫ్ ది రికార్డుగా అడుగుతున్నా.. చెప్పండి?’ అన్నా. ‘అననివ్వండి.. రాయనివ్వండి’ అన్నాడు గానీ నాకు కావలసిన సమాధానం మాత్రం రాలేదు. ‘వంశీ’ సినిమా చేసేటప్పుడే ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందని నా అనుమానం.
అందుకే ఆపుకోలేక అడిగేశాను. నేను రాయడానికి కూడా అతని నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆ ప్రస్తావన లేకుండానే ఇంటర్వ్యూ రాసేశా. ఆ తర్వాత మంజుల మహేష్ హీరోగా ‘నాని’ సినిమా తీశారు. అది ఆడలేదు. ఆమె సెల్ నంబర్ కూడా ఇవ్వడంతో నాకేదైనా సమాచారం కావలసి వస్తే తరచూ ఫోన్ చేసేవాడిని. అలా మరోసారి ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా వచ్చింది. మరో రిపోర్టర్ చక్రవర్తి, నేను కలిసి ఇంటర్వ్యూ చేశాం. అప్పుడు కూడా మహేశ్ తన పెళ్లి విషయంలో గుంభనంగానే వ్యవహరించాడు. 2005లో అనుకుంటాను అతని పెళ్లయ్యాక ‘హమ్మయ్య.. నా అనుమానం నిజమైంది’ అనుకున్నా.
సరిలేరు అతని కెవ్వరూ..
నేను మహేష్ కలవడానికి చాలా గ్యాప్ వచ్చింది.‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలకు ముందు అన్నపూర్ణ స్టూడియోలో మహేష్ ప్రెస్ మీట్. అంతకుముందు నేను చూసిన మహేష్ లో సిగ్గు, బిడియం మచ్చుకైనా కనిపించలేదు. అప్పటి మహేష్ కీ ఇప్పటి మహేష్ కీ చాలా తేడా ఉందనిపించింది. అతని మాటల్లో అర్థాన్ని పట్టుకోడానికి జర్నలిస్టులకే ఇబ్బంది అయ్యింది. పంచ్ ల మీద పంచ్ లు వేసేస్తున్నాడు. ఆ ‘దూకుడు’కు ఎవరూ సాటి రారని అనిపించింది. ఓ జర్నలిస్టు మీరు ఫలానా పాత్ర చేయవచ్చుగా అని అంటే ‘మీరు తీస్తారా.. తీస్తే చేస్తా’ అనేశారు. అందులో భావాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు.
ఆయనలోని కవి హృదయం అర్థం కాకపోయినా జర్నలిస్టు మిత్రులు మాత్రం నవ్వేస్తూ ఎంజాయ్ చేసేశారు. నేను కూడా అడిగి చూద్దామని ‘సరిలేరు నీకెవ్వరు అనే బదులు సరిలేరు నాకెవ్వరు అని పెట్టొచ్చు కదా?’ అన్నా. అలా పెడితే హీరోయిజం ఎలివేట్ అవుతుందన్నది నా అభిప్రాయం. ‘బాగుండదండీ’ ఠక్కున చెప్పేశాడు మహేష్. పంచ్ ని అంత స్పాంటేనియస్ గా ఎలా వేసేస్తున్నాడా అనిపించింది. మాటల్లో సున్నితమైన హాస్యం ధ్వనిస్తూనే చురకలంటించేస్తున్నాడు. అది గోదావరి ఎటకారమో తెలియదు.. మాటల మీదున్న మమకారమో తెలియడం లేదు. అంత గలగల మాట్లాడే మహేష్ ను మొదటిసారి చూసిన భావన కలిగింది. సినిమాల్లో డైలాగులు చెప్పీ చెప్పీ పంచ్ లు అలవోకగా వచ్చేస్తున్నాయి.
ఎంత చిలిపిగా ఉన్నా ఓ పరిధి దాటి వ్యవహరించకపోవడం అతనిలోని లౌక్యాన్ని సూచించింది. తన మీద, తన కుటుంబం మీద విమర్శలు వచ్చినా మౌనంగా ఉండటం నిజంగా సూపర్ స్టారిజమే. ప్రతిదీ కెలుక్కుని వివాదాలు తెచ్చుకోవడం కూడా మహేష్ కెరీర్ లో కనిపించలేదు. ఈ విషయంలో ఒకవిధంగా చెప్పాలంటే కృష్ణగారికే అలాంటి దూకుడు ఉండేది. ఏం చేయాలనుకున్నా, ఎవర్ని ఎదిరించాలనుకున్నా ఆయన వెనక్కి తగ్గేవారు కాదు. అందుకే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అయ్యారు. మహేష్ మాత్రం కెరీర్ కేరింగ్ హీరో అయ్యారు. అందుకే ఆయన రాజకుమారుడైన యువరాజుగానే ఉండిపోయారు. 49 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎప్పుడూ భేషజాలకు పోలేదు. తన సమయాన్ని ఎక్కువగా కుటుంబానికే కేటాయిస్తూ వచ్చారు.
‘బిజినెస్ మ్యాన్’గా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వచ్చారు. మహేష్ బాబు విషయంలో ఉన్న ఒకే ఒక్క విమర్శ ఏమిటంటే డైరెక్టర్ల దగ్గర కథలు వింటూ వాటిని ఓ పట్టాన తేల్చకపోవడం, చివరికి దర్శకుడిని మార్చేయడం లాంటివి చేస్తుంటాడని అంటారు. నటుడికి ఆ మాత్రం స్వార్థం ఉండటంలో తప్పేమీ లేదు. సినిమా మీద నమ్మకం కుదిరితే ఏ హీరో ఆ సినిమాని చెయ్యకుండా ఉండరు. మహేష్ అనే వజ్రం రాజమౌళి లాంటివారి చేతిలో పడితే మరింత మెరుపులు తప్పదు. ఆరోజు కోసం మహేష్ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. సూపర్ స్టార్ గా మహేష్ నీడలో నేను గమనించిన అడుగుజాడలివి. నీడ సమయంలో కృష్ణగారి అబ్బాయి అన్నారు.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ అంటున్నారు.. అంతే తేడా.
– హేమసుందర్ పామర్తి











