ఉద్యోగ విధులు, ఇతర పనుల ఒత్తిడితో నిత్యం కుస్తీలు పట్టే సిటీ జనం సెలవుల్లో విశ్రాంతి కోసం విహారయాత్రలు పెట్టుకుంటారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తే టూరిస్ట్ ప్లేస్‌కో లేకుంటే వారి స్వగ్రామలకో పయనమవుతారు. సహజంగా ఎన్నికలంటే ఆసక్తి చూపని సిటీ ప్రజలకు ఈ సారి వరుస సెలవులు కలిచొచ్చాయి.
అసలే పోలింగ్ శాతం తక్కువ
ఏ ఎన్నికల్లో అయినా గ్రామీణ ప్రాంతాలకంటే సిటీలోనే పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. గత గ్రేటర్ ఎన్నికల్లో 45 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ సారి కరోనా కారణంగా చాలామంది వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నారు. సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉండే టెకీలు ఈ ఎన్నికల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోం కారణంగా పాల్గొనే అవకాశాల్లేవు. అంతేగాక కరోనా నిబంధనలలు కారణంగా పోలింగ్ కూడ స్లోగా జరిగే అవకాశముంది. దీనికి తోడు వరుసగా నాలుగు రోజులు సెలవులు కూడ ఉన్నాయి.
వరుస సెలవులు
డిసెంబర్ 1వ తేదీన జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై వరుస సెలవుల ప్రభావం పడనుంది. నాలుగో శనివారం నేడు బ్యాంకులకు సెలవు, ఆదివారం చాలామందికి సెలవే. సోమవారం గురునానక్ జయంతి. ఇక మంగళవారం పోలింగ్ రోజు పోలింగ్ సెలవు . దీంతో చాలామంది నగరవాసులు ఎక్కడోచోటుకు చెక్కేసే ఉంటారు. ఈ ఫ్రభావం ఖచ్చితంగా గ్రేటర్ పోలింగ్‌పై చూపనుంది.
ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటేయాలి
మధ్య తరగతి వారు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోపోవడం వల్లనే గత మున్సిపల్ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్లు స్వచ్చంద సంస్థలు పేర్కొన్నాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేసి మంచి పాలకులను ఎన్నుకోవాలని ఎన్నికల నిఘా వేదిక వంటి సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా పెద్దగా ఫలితం కలగటం లేదు. మధ్యతరగతి ప్రజల్లో రాజకీయాలపై ఉన్న విముఖత పోలింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించడంతో చాలా మంది ప్రజలు బయట తిరుగుతున్నారు. అయితే అందరూ ఓపిగ్గా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేస్తారా.. అనేది సందేహామే. కరోనా నిబంధనల దృష్టా చాలామంది పోలింగ్ బూత్‌ల వద్ద నిరీక్షించేందుకు వెనుకంజ వేస్తే ఈ సారి కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం లేదు. కానీ హైదరాబాద్ నగర అభివృద్ధి దృష్ట్యా ఈ ఎన్నికలు ఎంతో కీలకం. అందరూ బాధ్యత గా ఆలోచించి, ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకుని ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.











