ఆటుపోట్లులేని సముద్రం ఉండదు… గెలుపు ఓటములు లేని యుద్ధం ఉండదు- జైబోలో తెలంగాణ చిత్రంలో నటి స్మృతి ఇరానీ పలికిన డైలాగ్ ఇది. ఈ మాట తనకు అక్షరాలా వర్తిస్తుందంటారు దర్శకుడు ఎన్. శంకర్. ఎన్ కౌంటర్ శంకర్ గా ఆయన అందరికీ తెలుసు. ఈ సినిమా విడుదలై నేటికి 24 సంవత్సరాలు నిండుతాయి. ఆయన సామాజిక స్ఫూర్తి కలిగించే సినిమాలే ఆయన ఊపిరి. 1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం లాంటి స్ఫూర్తి కలిగించే సినిమాలు ఎన్నో తీశారు. అనేక అవార్డులు, రివార్డులతో పాటు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓ పక్క కరోనాతో చిత్రసీమ నలిగిపోతోంది, షూటింగులు లేక సినీ కార్మికులు అలమటిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దర్శకుల సంఘం ఏంచేస్తోంది? షూటింగులు ఎప్పటికి ప్రారంభమవుతాయి, తన సినిమా అనుభవాలను శంకర్ ది లియోన్యూస్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం.
సామాజిక చైతన్యం అనే ఆలోచన మీకు ఏ వయసులో కలిగింది?
మా ఊళ్లన్నీ నక్సలైట్ల ప్రభావం ఉన్న ఊళ్లు. అక్కడ పోలీసు క్యాంపులు కూడా ఉండేవి. ఇలాంటా వాతావరణం ఉండటం వల్ల సాహిత్యం బాగా చదవడం, సొసైటీ పట్ల అవగాహన, ఉద్యమకారులతో పరిచయాలు, నా వ్యక్తిగత సాంఘిక, సామాజిక ఆర్థిక పరిస్థితులు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవాడిని, మాది మధ్యతరగతి కుటుంబం, మాది మారుమూల గ్రామం. నా చిన్నప్పుడు మా ఊరిలో కరెంటు కూడా ఉండేది కాదు. నా సినిమాల్లో ఇలాంటి వాతావరణాలే కనపడాలన్నది నా తాపత్రయం. నా అనుభవాలనూ, నేను ఆలోచించిన దాన్నీ తెరమీద చూపిస్తున్నా. దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలని సినిమాల్లో చెప్పా, ఆర్థిక సమానత్వం కావాలని చెప్పా. ఇప్పటిదాకా మహాత్మాఫూలే అంటే చాలామందికి తెలియదు. గుంటూరు నా సినిమాకు అభినందన సభ పెడితే 70 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు వచ్చారు. తమిళనాడు నుంచి పెరియార్ వారసులు, కర్ణాటక నుంచి కన్నడ పరిరక్షణ సమితి వాళ్లు, మంత్రులు వచ్చారు. సాధారణంగా సినిమా వార్తలు సినిమా పేజీలోనే వస్తాయి. కానీ నా సినిమా వార్తలు జనరల్ పేజీల్లో కూడా వచ్చేవి. ఎన్ కౌంటర్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చంద్రబాబు నాయుడు దృష్టి కూడా ఆ సినిమాపై ఉండేది. నా షూటింగ్ మీద ప్రతిరోజూ నిఘా ఉండేది. ఏ సన్నివేశం తీస్తున్నానో కనుక్కునేవారు. శ్రీరాములయ్య కూడా అలాంటిదే. జయంమనదేరా, భద్రాచలం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. పట్టుదల, కృషి, నిజాయితీ, ధైర్యం ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమని చెప్పాం. నా పాటలు విని సివిల్స్ కు వెళ్లి సాధించుకున్నవారు కూడా ఉన్నారు.
ఇన్ని సంవత్సరాల మీ సినిమా ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నదేమిటి?
నా సినిమాలో ఓ డైలాగ్ ఉంది… ‘ఆటుపోట్లులేని సముద్రం ఉండదు… గెలుపు ఓటములు లేని యుద్ధం ఉండదు’ అని. సో ఏ బ్యాగ్రౌండు లేకుండా వచ్చిన నాలాంటివాడికి ఇవి తప్పదు. నా సినిమా కథల్లోనూ సంఘర్షణ ఉంటుంది, జీవితంలోనూ సంఘర్షణ ఉంటుంది. నా జీవితం, నా అనుభవాలు, నేను నేర్చుకున్న అంశాలన్నీ నా సినిమాల్లో ఉంటాయి. సమాజానికి సరిపడే నూతన ఆలోచనా విధానం కావచ్చు, నేనుభవించిన ఆర్థిక, సాంఘిక పరిస్థితులు, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు కావచ్చు వీళ్లందరి ప్రభావం నా జీవితం మీద ఉంటుంది, నా సినిమాల మీద కూడా ఉంటుంది. అకస్మాత్తుగా ఈ పరిశ్రమకు వచ్చాను. సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డిగారిది, మాది పక్కపక్క ఊర్లు. నేను నల్గొండలో శ్రీశీగారి కవిసమ్మేళనంలో ఓ కవిత చదివాను. అది చూసి నువ్వు సినిమాల్లోకి రారా బాబూ అని ఆయన అన్నారు.అలా ఆయన నన్ను సినిమా రంగంలోకి తీసుకెళ్లడం జరిగింది. 1984లో మద్రాసు వెళ్లాను. భారతంలో శంఖారావం అనే సినిమాకి అసిస్టెంటు డైరెక్టర్ గా చేరాను. దానికి బి. భాస్కరరావు దర్శకుడు. అక్కడిని సినిమాని నేర్చుకుంటున్న సమయంలో దాని మీద ఆసక్తి ఏర్పడింది. దీని ద్వారా సమాజానికి ఏమైనా చెప్పొచ్చు అనే అభిప్రాయం కలిగింది. స్టూడెంట్స్ ఆర్గనైజర్ గా ఉన్న నేను సినిమా అనే మాధ్యమం ద్వారా మనం ఏదైనా బలంగా చెప్పొచ్చనే అభిప్రాయం కలిగింది. నా ఆలోచనలను పంచుకోడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని కూడా భావించాను. దర్శకత్వ శాఖలో 13 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేశాను.
మీ ఎన్ కౌంటర్ సినిమా విడుదలై శుక్రవారానికి 24 ఏళ్లు నిండుతాయనుకుంటాను? ఆ విశేషాలేమిటి? ఎలా తెరకెక్కింది?
తెలంగాణలోగాని, ఉత్తరాంధ్రలోగాని, రాయలసీమ కొన్ని ప్రాంతాల్లోని, కొన్ని కల్లోలిత ప్రాంతాల్లోగాని కూంబింగ్ పేరుతో చిన్నపిల్లలను సైతం ఎన్ కౌంటర్ పేరుతో కాల్చి చంపడం నాకు బాధేసింది. నేను దర్శకుడు అవ్వాలనుకుంటున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. నా ఆలోచనలను, నా ఆవేదనను సినిమాల ద్వారా చెప్పటమే నా ఉద్ధేశం కాబట్టి ఎన్ కౌంటర్ పైనే సినిమా చేయాలనుకున్నా. అసలు ఈ సినిమాని సెల్వమణి చేయాల్సి ఉన్నా కొంత గ్యాప్ రావడంతో నాకు ఈ అవకాశం వచ్చింది. సినిమా మొదలైనపుడు కూడా షూటింగ్ మీద చాలా నిఘా ఉండేది. ఆ రోజుల్లో ఎన్ కౌంటర్ వార్త లేని పేపర్ ఉండేది కాదు. నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే నిన్ను ఎన్ కౌంటర్ చేసేస్తారని చాలా మంది భయపెట్టారు కూడా.
కృష్ణగారిని ఈ పాత్రకు ఎంచుకోడానికి కారణం?
కచ్చితంగా సరిపోతారని అనుకున్నా. ఎందుకంటే నేను కృష్ణగారి అల్లూరి సీతారామరాజు సినిమాని నా చిన్నపుడు చూశా. అది నా మీద చాలా ముద్ర వేసింది. అప్పటినుంచి ఆయనంటే అభిమానం కూడా పెరిగింది. మొదట మూడు భాషల్లో ఎన్ కౌంటర్ సినిమాని చేయాలనుకున్నారు. తమిళం, మలయాళం, తెలగు భాషల్లో చేద్దామనేది వారి ఆలోచన. ఇందులో కృష్ణ గారితో పాటు మమ్ముట్టి, రాధిక, రోజా, ప్రశాంత్ తారాగణం. అయితే మమ్ముట్టి స్థానంలో వినోద్ కుమార్, ప్రశాంత్ స్థానంలో రమేష్ బాబుతో సినిమాని ప్రారంభించాం. తెలుగు సినిమాని మాత్రమే చేయగలిగాం. కృష్ణ గారు కథ విన్న 15 రోజులకే షూటింగ్ ప్రారంభమైంది.మూడు నెలల్లో సినిమాని ఆగస్టు 14న విడుదల చేయడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత చేసిన శ్రీరాములయ్య సినిమా కూడా ఇదే రోజు విడుదల కావడం కాకతాళీయమే. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమే కారు బాంబులు పేలడంతో జరిగింది. నవంబరు 16న నా పెళ్లి, 19వ తేదీన సినిమా షూటింగ్… భయమూ బాధ ఉన్నా కూడా సినిమా చేయగలిగాం.
మీ సినిమాలన్నీ సామాజిక చైతన్యంతో ఉంటాయి ఎందుకు?
నాకంటూ ఒక శైలి కావాలనుకున్నా. సినిమాని కమర్షియల్ గానూ తీయవచ్చు, కళాత్మకంగా తీయవచ్చు. ఆర్ట్ ఫిలిమ్ లను ఎక్కువమంది చూసే అవకాశం లేదు. దర్శకత్వశాఖలో నేను చేసినవన్నీ కమర్షియల్ సినిమాలే. కమర్షియల్ సినమాల రీచింగ్ నాకు తెలుసు. కళాత్మకంగా సినిమా చేస్తే ఎంతమంది చూస్తారు అనే ప్రశ్న ఉండేది. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే సిద్ధాంతం నాది. ఎక్కువమంది చూస్తేనే కదా ఆ కళకు ప్రయోజనం. నాకంటూ ఒక శైలి కావాలని కమర్షియల్ ఫార్మాట్ లో రియలిస్టిక్ కొలబద్దను మిక్స్ చేసి సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నా. నా సినిమాలన్ని అదే ఫార్ములాలో ఉంటాయి. నేను చెప్పలకున్నది ఎక్కువమందికి తెలియాలన్నదే నా ఉద్ధేశం. నా ప్రయాణం అలా కొనసాగింది. డాక్టర్ ప్రభాకరరెడ్డి నన్ను సినిమాకు పరిచయం చేస్తే కృష్ణ గారు నన్ను సినిమా దర్శకుడిని చేయగా నాకు ఒక వేదిక అనేది దొరికింది.
ఎలాగూ మీకు వేదిక దొరికింది… మంచి విజయాలు అందుకున్నారు? మీ లైఫ్ యాంబిషన్ ఏమిటి?
దానికి కూడా ఒక వేదిక కావాలనేదే నా ప్రయత్నం. 2003లో ఆయుధం సినిమాకి ఐదుగురు కొత్తవారిని పాటల రచయితలుగా ఎంపిక చేశా. వారంతా 25 ఏళ్ల లోపువారే. వారంతా ఇప్పుడు చక్కగా సెటిలయ్యారు. చిన్ని చరణ్, గోరటి వెంకన్న లాంటి వారంతా నేను పరిచయిం చేసినవారే. ప్రతి సినిమా నాకు ఒక పోరాటమే. సినిమా రంగంలో ఎన్నో ఆటుపోట్లు నాకు తెలుసు. ఐదుగురిని నేను పరిచయం చేయడంతో చాలామంది నన్ను కలిసి అవకాశాల కోసం అడిగేవారు. ఆయుధంకు నేను నిర్మాతను. ఇంతమందికి మనం అవకాశం ఇవ్వాలంటే మనల్ని మనం విస్తరించుకోవాలని అర్థమైంది. నేనే వేదిక అవ్వాలనుకున్నా. అందుకే నేను వేదికను ప్రారంభించాలనుకున్నా. దీనికోసమే స్టూడియోకు భూమి ఇవ్వండి అడిగాను. అది మెటీరియలైజ్ కాలేదు. నా రెండు సినిమాలు విడుదలైన రోజున వేదిక అనే ఫ్లాట్ ఫామ్ ని ప్రకటించాలనకున్నా. అదే రేపే అవుతుంది. ఈ వేదిక ద్వారా ఐదు వెబ్ సిరీస్, మరో ఐదు వెబ్ మూవీస్, రెండు చిన్న సినిమాలు నిర్మించబోతున్నా. దర్శకుడిగా నేను ప్రపంచానికి పరిచయమైన రోజున ఈ విషయాలు ప్రకటించబోతున్నా. కథలు సిద్ధమయ్యాయి. అక్టోబరు నుంచి వీటిని ప్రారంభించాలనేది నా ఉద్ధేశం. కరోనా ఉంది కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలనే ఆలోచిస్తున్నా. రెండు దఫాలు దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నా.అసోసియేషన్ తరఫున అనేక సహాయక కార్యక్రమాలు చేస్తున్నా.
ఈ కరోనా సమయంలో ఎలాంటి సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు?
దర్శకుల సంఘం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. రెండు దఫాలు నిత్యావసరాలు పంపిణీ చేశాం. ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాం. త్వరలో మళ్లీ సహాకకార్యక్రమాలు ఉంటాయి. ఎవరూ తిరగని లాక్ డౌన్ టైమ్ లో మేం తిరిగి చాలాకార్యక్రమాలు చేపట్టాం.
కేవలం యువతనే టార్గెట్ గా చేసుకుని చేసేవారా?
గమ్యం, లక్ష్యం లేని యువతకు మార్గనిర్ధేశం చేయాలనేది నా ఉద్ధేశం. ఆయుధం సినిమా కూడా అలాంటిదే. రాయలసీమ ప్రాంతం నాకు బాగా పరిచయం. నా సినిమా షూటింగులు ఎక్కువ అక్కడే చేశాను. అప్పటిదాకా రాయలసీమ అంటే ఫ్యాక్టనిస్టులుగానే చూసేవారు. రాయలసీమ ప్రజలు రాక్షసులు కాదు అత్యున్నమైన మానవత్వం ఉన్న ప్రజలు వారు అని నాకు అర్థమైంది. అక్కడ రాళ్లల్లో కూడా నీళ్లున్నాయి, అక్కడ అలాంటి హృదయాలు ఉన్నాయని చెబుతూ ఆయుధం సినిమా చేశాను. అక్కడి మట్టిమనుషుల్ని కొంతమంది ఆయుధాలుగా వాడుకుని వాళ్ల రక్తం పారుతూ ఉంటే పెద్దలు హైదరాబాద్ వచ్చి సరదాలు, సంతోషాలు తీర్చుకుంటున్నారు, అక్కడి మనుషుల్లో మానవత్వం ఉందని ఆ సినిమా ద్వారా చెప్పాను.
జైబోలో తెలంగాణ సినిమా ఎందుకు చేయాలనుకున్నారు?
నేను 2001 నుంచి కేసీఆర్ గారితో పయనిస్తున్నా. 1997లో నేను డైరెక్టర్ ని అయితే 2001 వరకూ ఐదు సినిమాలు చేస్తే అన్నీ హిట్లే అయ్యాయి. ఆ తర్వాత సినిమాలు తగ్గిపోయాయి. దానికి కారణం తెలంగాణ ఉద్యమం కావచ్చు, మరేదైనా కావచ్చు. అలాగే నా కెరీర్ కు కూడా అనేక స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. నేను కళను నమ్ముకుని బతికే వాడిని. రామ్ సినిమా తర్వాత క్లీన్ ఇమేజ్ లేని హీరోతో నా కథలు ముందుకు వెళ్లలేవు అని నాకు అర్థమైంది. నేను ఎంత కమర్షియల్ సినిమా చేద్దామనుకున్నా అందులో ఆత్మ అనేది ఒకటుంటుంది. ఆ ఆత్మకు క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో కావాలి. అలాంటి హీరోలను పట్టుకోవడంలో నేను వెనుకబడ్డా. దాంతో కొంత గ్యాప్ వచ్చింది. కేసీఆర్ గారితో ఉన్న పరిచయాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులతో ఉన్న పరిచయాలు కావచ్చు,.. ఇవన్నీ జరుగుతున్నపుడు శ్రీకాంతాచారి ఆత్మహత్య నన్ను కలచివేసింది. మానవత్వం ప్రతి ఒక్కరూ ఏడ్చారు. ఆ టైమ్ లో చౌటుప్పల్ లో శ్రీకాంతాచారి 37వ రోజు సభ జరుగుతున్నపుడు మీటింగుకు వెళ్లా. అక్కడకు వచ్చిన ప్రజలంతా నువ్వు సినిమా తీయాల్సిదే అని పట్టుబట్టారు. అప్పటినుంచి ఆ సినిమా కథ మీద దృష్టిపెట్టి సినిమా చేశా. ఇది శంకర్ సినిమా అనుకోలేదు… ఇది మా సినిమా అని అందరూ ఫీలయ్యారు. దీని విడుదల సమయంలో కేసీఆర్ గారు తన భుజస్కందాలపై మోశారు. మంచి ధియేటర్లు కుదిర్చారు. ఈ సినిమాలో ఆయన ఒక పాట కూడా రాశారు. కళాత్మక సినిమాని కమర్షియల్ చెప్పటమే నా లక్ష్యం. మొదట ఈ సినిమాని కొత్త వాళ్లతో చేద్దామనుకున్నా స్మృతి ఇరానీ కావలసి వచ్చింది. అలాగే జగపతిబాబు కావలసి వచ్చింది. వాళ్లు లేకపోతే ఆ పాత్రలు పండవని నాకు తెలుసు. కథ అనుకున్నపుడు దానికి తగిన నటులు లేకపోతే అది వర్కవుట్ కాదు. మనం ఏం చెప్పినా పాత్ర ద్వారా చెప్పాల్సిందే. అక్కడ దర్శకుడు కనపడడు నటుడే కనిపిస్తాడు. శిల్పి ఏ రాయిని కొట్టినా ఆఖరిగా దేవత బొమ్మో, దేవుడి బొమ్మో చేయాల్సిందే. శిల్పి దేనినైనా చెక్కొచ్చు… కానీ దేవత అనుకుని చెక్కుతున్నాడా, దేవుడనుకుని చెక్కుతున్నాడా అనేది ముఖ్యం. రాయి శిల్పంగా మారాలంటే శిల్పి కనపడడు…కనపడేది రాయిలోంచి వచ్చిన శిల్పమే. అదే కథావస్తువు కూడా. ఆ కనపడే శిల్పమే హీరో.
మీరు స్టూడియో కోసం ఎకరా రెండున్నర కోట్లు ఖరీదుచేసే భూమిని రూ. 5 లక్షలకే తీసుకొన్నారని అభియోగాలకు మీ సమాధానం?
సినిమాలు, మీడియా ద్వారా పదిమందికి అవకాశం ఇవ్వాలనే ఉద్ధేశంతో నాకు స్టూడియో నిర్మించాలన్న ఆలోచన కలిగింది. స్టూడియోకి ల్యాండ్ ఇవ్వాలని నేను 2003లోనే ప్రభుత్వాన్ని కోరాను. చాలామందికి పని ఇవ్వాల్సి ఉంది, చాలామందిని ప్రోత్సహించాల్సి ఉంది. ఆ విన్నపం మెటీరియలైజ్ కాలేదు. ఈ ఆలోచనలో భాగంగానే వేదిక అనే ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటుచేశాను. ఇక తక్కువ రేటుకు భూమి ఇచ్చారని మీరంటున్నారు. ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి 22 ఎకరాలు, ఫిలింనగర్ లో పద్మాలయా స్టూడియోకి 10 ఎకరాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకో ఐదు ఎకరాలు ఇవ్వగా నాగారంలో వారు కట్టుకున్నారు. రామానాయుడు స్టూడియోకి ఐదు ఎకరాలు ఫిలింనగర్ లో, ఏడెకరాలు నానక్ రామ్ గూడలో ఇచ్చారు. మీరు ఏ స్టూడియో చూసినా కూడా పది నుంచి 12 ఎకరాల భూమి ఉంటే కన్వీనియంట్ గా చేయవచ్చు. నేను కూడా 15 ఎకరాలు కావాలని అడిగాను. ఆ తర్వాత స్టూడియో కోసం అమెరికా నుంచి డిజైన్స్ తయారు చేయించాను. దీనికోసం ఐదు కోట్ల రూపాయలను ఫరమ్ పేరు మీద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు లోన్లకు సంబంధించిన రాతకోతలు పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాను. 2012లో నేను నంది అవార్డుల కమిటీకి ఛైర్మన్ గా ఉన్నపుడు జ్యూరీ నిష్పక్షపాతంగా పనిచేసింది జ్యూరీ అని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అభినందించారు. ఆ సందర్భంగా నేనాయనతో 1984 తర్వాత ఒక్కరికి కూడా స్టూడియో కోసం భూమి ఇవ్వలేదండీ, మాలాంటి యంగస్టర్స్ ను ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పట్నుంచో ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోవడం లేదు అన్నాను. దాంతో ఆయన అప్లికేషన్ పెట్టుకో నేను చూస్తాను అన్నారు. ఆ తర్వాత ప్రయత్నాలు జరిగాయి కానీ కొన్ని అనుకోని అవాంతరాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ ను సినిమా హబ్ గా మార్చాలన్న ఆలోచన కలిగింది. అన్ని రంగాలతోపాటు సినిమాని కూడా ఒక హబ్ గా ఆయన తయారుచేయాలనుకున్నారు. ఈ సందర్భంగా నా పోరాటాన్ని ఆయనకు వివరించాను. నా ప్రజెంటేషన్ ను మళ్లీ ఆయనకు ఓసారి ఇచ్చాను. అప్పుడు కూడా 15 ఎకరాలే అడిగాను. నా ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించాను. నేను అడిగిన భూమి ధర ఎక్కువని, దూరంగా పెట్టుకుంటే ఇస్తామని అన్నారు. అయినా నా కల నెరవేరడం కోసం వారు ఇస్తానన్న భూమికి అంగీకరించాను. ఆ భూమి శంకర్ పల్లిలోని మోకిల్లాలో ఉంది. అది ఫలింనగర్ కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెయిన్ రోడ్డుకు రెండున్నర కిలోమీటర్లు లోపలకు ఉంటుంది. పైగా కిలోమీటరు పైన మట్టి రోడ్డు. సంకల్పం ఉంది కాబట్టి ఈ కష్టాలను అధిగమించి చేద్దామని అనుకున్నా. క్యాబినెట్ నిర్ణయం మేరకు ఇచ్చారు. అక్కడ స్టాంపు డ్యూటీ ధర ఎకరా రూ. 10 లక్షలు ఉంది. నాకు ఐదు లక్షల రూపాయల ధరను నిర్ణయించి కేటాయించారు. ఆ నేలంతా చదును చేసి సిధ్ధం చేశాను.
ఈ ల్యాండ్ మీకు ఎప్పుడు అలాట్ అయ్యింది?
2009 జూన్ లో అలాట్ మెంట్ జరిగింది. 1984 తర్వాత ఎవరికీ ఎందుకు కేటాయించలేదు? భూమి కొనుక్కుని కట్టడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఎవరూ అలా చేయరు. అందుకే కొత్త స్టూడియోలు ఏవీ రాలేదు. ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప కంపెనీలకుగాని, ఇలాంటి వాటికి గాని ఎవరూ ముందుకురారు. అప్పట్లో అన్నపూర్ణకు, పద్మాలయకు భూమి ఇచ్చారు కాబట్టే సినీ పరిశ్రమ ఇక్కడకు వచ్చింది. ప్రభుత్వ దృష్టి, నా సంకల్పం కలవబట్టే నాకు ఆ భూమి ఇవ్వగలిగారు. కొనుక్కునే డబ్బుతో సినిమా స్టూడియో ఎందుకు కట్టుకుంటాడు… వేరే వ్యాపార్లో పెట్టుబడులు పెడతాడు. నేను క్రియేటివ్ జాబ్ లో ఉన్నాను కాబట్టి సినిమాలు, వెబ్ సిరీస్, హైదరాబాద్ కు బయటినుంచి ఆదాయం సమకూర్చుకోగల సామర్థ్యం ఉంది కాబట్టి భూమి కేటాయించారు. ఇది నేను అనుభవించడానికి తీసుకున్నది కాదు. పైగా ఈ భూమిని వేరొకరికి బదలాయించలేం. కొనుక్కుంటే నేను దీన్ని అమ్ముకోవచ్చు, తనఖా పెట్టుకోవచ్చు… ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడిచ్చిన నిబంధనల ప్రకారం అలా ఏమీ చేయలేం. ఇది నేను రిస్క్ తో చేసే పని. నాది ఒక్కటే ప్రశ్న… 36 సంవత్సరాలుగా స్టూడియోలు ఎందుకు రాలేదు? నా ఇన్వెస్ట్ మెంటు అంతా కథల మీదే పెట్టాను. రూపాయి అనేది ఏ రోజైనా రావచ్చు. కథనేది ఏ రోజు పడితే ఆ రోజు రాదు. కథను ఒక్క రోజులో సంపాదించలేం. నేను 15 ఎకరాలు అడిగితే ఐదు ఎకరాలు ఇచ్చారు… అయినా నేను బాధపడలేదు. దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఐదెకరాల్లో మనం ది బెస్ట్ ఏం చేయగలం అని ఆలోచించాను.
ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
వ్యవహారం కోర్టులో ఉండటంవల్ల ఆపేశాం. ఆ స్థలానికి సరిహద్దులు పక్కాగా వేసుకుని జాగ్రత్తలు తీసుకున్నాం. ఫెన్సింగ్ ఉంది. స్టూడియో కట్టడం ఆపగలిగాం గానీ కథలు తీసుకోవడ ఆపలేం కదా. కోర్టు నుంచి అనుమతి ఉంటే వెంటనే షూటింగులు చేసుకోవడమే.
కరోనాతో ఆగిపోయిన సినిమా షూటింగులు ఎప్పటికి ప్రారంభం కావచ్చని అనుకుంటున్నారు?
నాకు తెలిసి జనవరి దాకా ప్రారంభం కావు. పరిస్థితులన్నీ సద్దుమణగడానికి ఇంకో ఏడాది పైగానే పడుతుంది. ప్రభుత్వపరంగా చేయాల్సిందంతా చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటించవచ్చని అనుకుంటున్నాను.
బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...










