(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
మూడు రాజధానులు కావాలంటూ కొందరు ప్రీఫెయిడ్ ఆర్టిస్టులు అమరావతిలో ఉద్యమం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారికి అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం ప్రచారంలో ఉంది. రాజధాని రైతులకు, మంగళగిరి నుంచి తరలించిన ప్రీపెయిడ్ ఆర్టిస్టుల మధ్య గొడవలు సృష్టించి, రైతులపై కేసులు పెట్టాలని చూస్తున్నారని లియో న్యూస్ ఇప్పటికే ప్రచురించింది. లియో న్యూస్ చెప్పిందే నేడు నిజమైంది. (ఇదీ చదవండి : శాంతి భద్రతల సమస్య సృష్టే లక్ష్యం )
నిలదీసినందుకే అట్రాసిటీ కేసులా?
అమరావతి రాజధాని గ్రామం కృష్ణాయపాలెంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని అక్కడ ఉద్యమం చేస్తున్న రైతులు నిలదీశారు. మీరెందుకు వచ్చారని ప్రశ్నించారు. మూడు రాజధానుల కోసం ఉద్యమం చేస్తున్నామని వారు చెప్పారు. రెండో రోజు ఏకంగా సీడ్ యాక్సెస్ రోడ్డుపై టెంట్లు వేసుకున్నారు. ముందుగానే రోజుకు రూ.800 కూలీ చెల్లించి, ఆటోల్లో తరలించిన ఆర్టిస్టులను టెంట్లలో కూర్చో పెట్టి దొంగ దీక్షలు చేయించారు. అక్కడికి వచ్చి కొందరు రాజధాని రైతులు వారిని ప్రశ్నించారు. మీరెందుకు ఇక్కడ ఉద్యమం చేస్తున్నారని అడగ్గా, 30 లక్షల ఇళ్ల స్థలాలు, మూడు రాజధానుల కోసం దీక్ష చేస్తున్నామని చెప్పారు. దీంతో రైతులు వెనుదిగిరి వెళ్లిపోయారు.
అమరావతి రైతులపై కేసుల నమోదు
అమరావతి రాజధాని గ్రామమైన కృష్ణాయపాలెం రైతులపై మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. మూడు రాజధానుల ఉద్యమం చేస్తున్న దళితులను నిలదీశారని, వారితో అసభ్యంగా మాట్లాడారంటూ అట్రాసిటీ కేసులు బనాయించారు. దీంతో రాజధాని ఉద్యమంలో అరాచక శక్తుల పాత్ర బయటపడింది.
హింసాత్మకంగా మార్చడమే వారి లక్ష్యం
అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి, వారిపై కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతి రైతులు ఈ విషయాన్ని గ్రహించి శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. అయినా అరాచక శక్తులు వదిలేలా లేవు. రాజధానిలో ఎలాంటి అరాచక శక్తులు ప్రవేశించినా, రాజధాని రైతులు వారి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇలాంటి కేసులతో ఉద్యమాన్ని అణచివేయలేరని అమరావతి జేఏసీ నేతలు హెచ్చరించారు.











