మాబున్నీసాకు సలాం చెప్పాలి. కూతురు, అల్లుడు మనవడు మనవరాలు అందరినీ కోల్పోయిన మాబున్నీసా.. ప్రభుత్వం సాయం చేస్తామని పాతికలక్షల చెక్కు ఇస్తే.. నాకు వద్దు.. నా అల్లుడి పేర ఒక మసీదు కట్టించండి.. అని చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ కుటుంబానికి ఎవరు మిగిలారు గనుక.. ప్రభుత్వం ఇచ్చే సొమ్మును ఆమె వారికోసం వినియోగించగలదు! పోలీసుల దాష్టీకమో, వారితో అలాంటి ఒత్తిడికి కారణమైన ఇతర తెరవెనుక శక్తుల దుర్మార్గమో ఏదైనా కావొచ్చు గాక.. కానీ.. కుటుంబం మొత్తం బలైపోయిన తర్వాత.. పాతిక లక్షల రూపాయలు ఎవరి కన్నీళ్లు తుడవడానికి? అందుకే ఆమె వద్దంది.. అధికారులు బలవంతంగా ఆమెను ఒప్పించి.. పాతిక లక్షల చెక్కు ఆమె చేతిలో పెట్టి పంపించారు.
చెక్కు అందజేత
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబీకులకు ప్రభుత్వం ప్రకటించిన 25లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్,ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి లు కలిసి సలాం అత్తకు అందజేశారు. అయితే ఈ సందర్భంగా వారికి ప్రతిఘటన ఎదురైంది. సలాం అత్త మాబున్నీసా చెక్కు తీసుకోవడానికి నిరాకరించారు. ప్రభుత్వం ఇవ్వదలచుకున్న డబ్బుతో సలాం పేరుపై మసీద్ కట్టించమని ఆమె కలెక్టరుకు చెప్పారు. ఎంపీ,ఎమ్మెల్యే, అధికారులు నచ్చజెప్పడంతో మాబున్నీసా చివరికి చెక్కు తీసుకున్నారు. తన ఆప్తులను మొత్తం.. సకుటుంబంగా కోల్పోయినప్పటికీ.. ఆమె ప్రభుత్వ సాయం ఆశించకుండా.. ఆ సొమ్మును మసీదుకు వెచ్చించమని చెప్పడం ఉదార హృదయమే. తనకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ సాయం ఏ రకంగానూ భర్తీ చేయలేని పరిస్థితుల్లో ఆమె కేవలం అధికార్ల మాటకోసం చెక్కు తీసుకున్నట్లుగా పరిస్థితి తయారైంది.
పోలీసులు ఆమె వినతిని పరిశీలించాలి..
అసలైన నిందితులకు శిక్ష పడితేనే సలాం కుటుంబానికి ఆత్మశాంతి చేకూరుతుందని ఈ సందర్భంగా మాబున్నీసా పేర్కొనడం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం ఇద్దరు పోలీసులను ఇందుకు బాధ్యులుగా గుర్తించారు. అయితే, వారి వెనుక ఉండి.. సలాంపట్ల పోలీసులు అంత కఠినంగా వ్యవహరించేలా.. ఒత్తిడి తెచ్చిన అసలు వ్యక్తులు ఎవరనేది ఇప్పటిికీ సస్పెన్స్‌గానే ఉంది. పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే.. ఆ అసలు వ్యక్తుల బాగోతాన్ని బయటకు తీసుకురావాలి.
అర్ధరాత్రి వెళ్లడంలో ఔచిత్యం ఏమిటి?
ఇదంతా ఒక ఎత్తు. కానీ.. సాయం ఇవ్వడానికి వివరాలకోసం వెళ్లాం అంటూ.. పోలీసులు అర్ధరాత్రి వేళ మాబున్నీసా ఇంటికిి వెళ్లడం ఇప్పుడు మరో వివాదంగా రూపుదిద్దుకుంటోంది. బుధవారం అర్ధరాత్రి అబ్దుల్ సలాం ఇంటికి వెళ్లిన మహిళా ఎఎస్సై, కానిస్టేబుల్ వెళ్లారు. వైట్ పేపర్ పై సంతకం చేయాల్సందిగా అబ్దుల్ అత్త మాబున్నీసాపై పోలీసులు ఒత్తిడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన మాబున్నీసా, సబ్ కలెక్టర్ కల్పన కుమారికి ఫోన్ చేసింది. సబ్ కలెక్టర్ జోక్యంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు.
ఈ విషయం వివాదంగా మారేసరికి పోలీసులు మాత్రం బ్యాంక్ వివరాల కోసమే మాబున్నీసా వద్దకు వెళ్ళామని అంటున్నారు. అయితే బ్యాంకు వివరాలకోసం అర్ధరాత్రి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే విషయంలో ముస్లిం సంఘాలు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నాయి.
పోలీసుల వేధింపులతో ఇటీవలే అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సాయం పేరిట అర్ధరాత్రి ఆమెఇంటికి వెళ్లడం, ఫిర్యాదు వస్తున్న రీతిలో తెల్లకాగితంపై సంతకం పెట్టాల్సిందిగా అడగడం వివాదాస్పదం అవుతోంది.











