సున్నితమైన ప్రేమకథలను తెరపై అందంగా ఆవిష్కరించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. ఆనంద్ .. గోదావరి .. ఫిదా సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనాలుగా కనిపిస్తాయి. చివరిగా ఆయన తెరకెక్కించిన ‘ఫిదా’ చిత్రం సంచలన విజయానికి సరికొత్త అర్థం చెప్పింది. ప్రేమకథా చిత్రమే అయినా, బలమైన కుటుంబ బంధాలను మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించడంతో ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణను పొందగలిగింది. ఈ ప్రేమకథా కావ్యం ప్రేక్షకుల ముందుకువచ్చి మూడేళ్లు దాటిపోయినా, వాళ్ల మనసు తెరపై నుంచి ఇంతవరకూ చెరిగిపోలేదు. అంతగా ఈ సినిమా అందరి హృదయాలపై బలమైన ముద్రవేసింది.
‘ఫిదా’ సినిమాతోనే తెలుగు తెరకి సాయిపల్లవి పరిచయమైంది. పోస్టర్స్ పై ఈ అమ్మాయిని చూసినవాళ్లు గ్లామర్ పరంగా ఏవరేజ్ గా ఉందని అనుకున్నారు. థియేటర్ కి వెళ్లిన తరువాత ఆ అమ్మాయికి అభిమానులుగా మారిపోయి బయటికి వచ్చారు. ఈ సినిమాలో ‘భానుమతి’ పాత్రకు ఆమె ప్రాణం పోసింది. అల్లరి .. అలక .. ఆవేదన .. ఆనందం .. ఇలా అనేక భావాలను ఆమె ఎంతో సహజంగా పలికించింది. ఈ సినిమా తరువాత ‘భానుమతి’గానే ఆమెను చాలామంది గుర్తుపెట్టుకున్నారంటే, ఆ పాత్రలో ఆమె ఎంతగా ఒదిగిపోయిందనేది అర్థం చేసుకోవచ్చు.
‘ఫిదా’ తరువాత శేఖర్ కమ్ముల మళ్లీ సాయిపల్లవితోనే ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేశాడు. ఇది కూడా ప్రేమకథా నేపథ్యంలోనే సాగేది కావడంతో, అందరిలో మరింత కుతూహలాన్ని పెంచుతోంది. అందమైన ఈ ప్రేమకథను బలమైన ఎమోషన్స్ నడిపించేతీరు యూత్ ను ఆకట్టుకుంటుందని శేఖర్ కమ్ముల చెప్పాడు. ‘ఫిదా’ స్థాయికి తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. దాంతో ఇప్పుడు అందరూ ‘లవ్ స్టోరీ’ పైనే దృష్టిపెట్టారు. ఈ సినిమాకి సంబంధించి బయటికి వచ్చిన స్టిల్స్ వాళ్లలో మరింత ఆత్రుతను పెంచుతున్నాయి.
ఇందులో సాయిపల్లవి జోడీగా నాగచైతన్య నటించాడు. ‘పడి పడి లేచె మనసు’ వంటి ప్రేమకథా చిత్రం తరువాత సాయిపల్లవి, ‘మజిలీ’ వంటి ప్రేమకథా చిత్రం తరువాత నాగచైతన్య చేసిన సినిమా ఇది. అందుకే అటు ఇండస్ట్రీలోను .. ఇటు బయట కూడా ‘లవ్ స్టోరీ’ పై అంచనాలు బాగానే వున్నాయి. సాయిపల్లవి – చైతూ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కూడా యూత్ లో వుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తరువాత ఈ సినిమా ‘ఫిదా’ రికార్డులను అందుకుంటుందో .. అధిగమిస్తుందో చూడాలి మరి.











