తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చిన దర్శకుడు కె. విశ్వనాథ్. ఇక మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. వీరిద్దరూ కలిస్తే అంతకంటే అపురూప క్షణాలు ఇంకేముంటాయి. తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు దర్శకులు విశ్వనాథ్. పైగా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. విశ్వనాథ్, చిరు కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి.
కె. విశ్వనాథ్ ను తన గురువుగా భావిస్తారు మెగాస్టార్ చిరంజీవి. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. మెగాస్టార్ కెరీర్లో అవి మైలురాళ్లుగా నిలిచిపోయాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకైనా వన్నె తేగలరని నిరూపించారు. తనకు అంతటి క్లాసికల్ సినిమాలను ఇచ్చిన దర్శకుడిని అప్పుడప్పుడూ కలవకపోతే ఎలా? అందుకే ఈరోజు సతీసమేతంగా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
తెలుగు సినిమా పెద్ద స్థాయిలో ఉన్న చిరంజీవి తన శిష్యుడిగా ఇంటికి రావడంతో విశ్వనాథ్ ఆనందానికి అవధులు లేవు. వీరిద్దరూ కాసేపు ఇద్దరు తమ మధుర అనుభవాలను, అప్పటి సినిమా సంగతులను గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ ఆరోగ్య క్షేమాలను చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. ఇది ఇటు చిరు అభిమానుల్లోనూ, విశ్వనాధ్ అభిమానుల్లోనూ దీపావళి సంతోషాన్ని నింపింది.
కళాతపస్వి విశ్వనాథ్ సినిమాలకు ప్రపంచ స్థాయిలో ఆదరణ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిగారు మాట్లాడుతూ.. విశ్వనాథ్ గారిని కలవాలనిపించి ఈరోజు ఆయన ఇంటికి వచ్చానని చెప్పారు. ఆయన తనకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారని, ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం తనకు చాలా సంతోషంగా కలిగించిందని అన్నారు.











