వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన రోజున ప్రజలకు తెలిసివచ్చేలాగా… ఆయన కొడుకు జగన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆయనను ముఖ్యమంత్రిని చేసిన ఆ స్వప్నం కూడా- ఈ నిర్ణయం కారణంగా నెమ్మదిగా చచ్చిపోతుందా?
(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేసే విద్యుత్ కు బిల్లులు మేం రైతుల ఖాతాలో జమ చేస్తాం. రైతులు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగుపల్లి శ్రీకాంత్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 2004 నుంచి వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రభుత్వమే లెక్కగట్టి విద్యుత్ పంపిణీ సంస్థలకు బిల్లులు చెల్లిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటి? ప్రభుత్వ నిర్ణయం రైతులకు మేలు చేస్తుందా? రైతుల్లో ఆందోళన ఎందుకు మొదలైందో ఒక్కసారి పరిశీలిద్దాం…
ఏపీలో మొత్తం 18 లక్షల పంపుసెట్లు ఉన్నాయిని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇందుకుగాను ఏటా ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.8,400 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. అంటే సగటున ఒక్కో మోటారుకురూ.50000 చెల్లిస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానంలో రైతులు ఎంత విద్యుత్ వాడారో తెలుసుకునే విధానం లేదు. రాండమ్ గా జిల్లాలో ఎక్కడో ఒక ట్రాన్సుఫార్మర్ వద్ద మీటరు బిగించి దాన్నే జిల్లా మొత్తానికి వర్తింప జేస్తున్నారు.
ఇది ఖచ్ఛితమైన విధానం కాదు. దీని వల్ల ఏటా విద్యుత్ సంస్థలు మాకు నష్టం వాటిల్లుతోందని గగ్గోలు పెడుతున్నాయి. వ్యవసాయరంగానికి చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులను కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడంలేదు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఒక్క ఏపీలోనే విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.20000 కోట్ల అప్పుల్లో ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రతి పంపు సెట్టుకు స్మార్ట్ మీటర్ బిగించాల్సి ఉంటుంది.
స్మార్ట్ మీటర్ ఏర్పాటు సాధ్యమా?
రాష్ట్రంలో ఉన్న 18 లక్షల మోటార్లకు ముందుగా స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఈ నెల నుంచి ఏదో జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రం మొత్తం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొలాల్లో ఎక్కడెక్కడో విసిరేసినట్టు ఉండే మోటార్లకు మీటర్లు బిగించడం ఒక ఎత్తయితే… వాటి నుంచి ప్రతి నెలా రీడింగ్ తీసుకోవడం కూడా కష్టమే. గత ప్రభుత్వంలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలనే నిర్ణయం పెద్ద దుమారాన్నే రేపింది. మీటర్లు బిగిస్తే ఇక భారీగా బిల్లులు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం భారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని రైతాంగం చర్చించుకుంటున్నారు. ఉచిత విద్యుత్ భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. తెల్లరేషన్ కార్డు లేని రైతులను, ఆదాయపన్ను చెల్లిస్తున్నవారిని, కారు ఉన్న రైతులను, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వారికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఉంటే వారికి ఉచిత విద్యుత్ సేవలు నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
రైతులెందుకు వ్యతిరేకిస్తున్నారంటే?
నందమూరి తారకరామారవు పార్టీ పెట్టిన కొత్తల్లో వ్యవసాయానికి హార్స్ పవర్ కు రూ.50 మాత్రమే అంటూ ప్రచారం చేయడంతో రైతులు చాలా ఆనందించారు. ఎంత విద్యుత్ వాడుకున్నా రైతులు రూ.250 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. అది కూడా సంవత్సరానికి ఒక్కసారే. ఒక్కోసారి రైతులు ఆ మొత్తం కూడా చెల్లించే స్థోమత ఉండేది కాదు. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లే అందుకు కారణం. ఆ తరవాత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వచ్చాక విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు మొదలయ్యాయి.
ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్ కు లెక్క పక్కాగా ఉండాలని ఆయన భావించారు. వ్యవసాయ విద్యుత్ ఛార్జీలు కూడా భారీగా పెంచారు. కొందరు రైతుల మోటార్లకు మీటర్లు కూడా బిగించారు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఒక్కో రైతు తాము వాడుకున్న విద్యుత్‌కు బిల్లు చెల్లించాలంటే ఏటా రూ.50000 నుంచి రూ. 100000 దాకా చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు సాధ్యంకాని పని. అందుకే వ్యవసాయ పంపుసెట్టుకు మీటర్లు బిగిస్తున్నారంటేనే రైతులు పలు విధాలుగా ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నారు.
అప్పులు తెచ్చేందుకేనా?
విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుతం నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. వ్యవసాయ పంపుసెట్లకు కూడా మీటర్లు బిగించి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం లెక్క పక్కాగా ఉంటే భారీగా అప్పు పుట్టే అవకావం ఉంది. కేంద్రం తాజాగా విద్యుత్ రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణలు కూడా ఇవే చెబుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలు భారీగా అప్పులు తెచ్చుకుని వారి కార్యకలాపాలు విస్తరించుకోవాలంటే ప్రభుత్వం వారికి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈ కొత్త సంస్కరణలకు నాంది పలికారని తెలుస్తోంది.
10000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసమేనా ఇదంతా?
కడప జిల్లాలో రూ.50000 కోట్ల అంచనా వ్యయంతో 10000 మెగావాట్ల సోలార్ ప్లాంటు నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు విద్యుత్ సంస్థలకు రుణాలు కావాలంటే సంస్కరణలు తప్పనిసరి. అందుకే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ప్రతి యూనిట్ విద్యుత్‌కు లెక్క తీయాల్సి ఉంటుంది. అప్పుడే ఆర్థిక సంస్థలు, ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తాయి. ఇందులో భాగంగానే వ్యవసాయ పంపుసెట్లకు రాబోయే నాలుగైదు నెలల్లోనే స్మార్ట్ మీటర్ల బిగించే అవకాశం ఉంది.
రైతులు ఆందోళన చెందకుండా ముందుగా రైతుల ప్రత్యేక ఖాతాలో సొమ్ము జమ చేస్తామని, ఆ డబ్బు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లిస్తే సరిపోతుందని చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించిన దాఖలాలు లేవు. అంతటా ర్యాండమ్ రీడింగ్ తీస్తున్నారు. తాజాగా ఏపీలో తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు వ్యవహారం భవిష్యత్ లో ఎటు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.











