దళితులపై జరుగుతున్న వరుస దాడులతో వైఎస్సార్సీపీ ఆత్మరక్షణలో పడింది. దాన్ని అధిగమించడానికి ఏం చేయాలో పాలుపోక ప్రతిపక్షం పై ఎదురుదాడి చేస్తోంది. విశాఖలో వైసీపీ నాయకుల తీరు చూస్తే ఈ విషయం ఎవరికైనా స్పష్టమవుతుంది. దళితులపై తెలుగుదేశం పార్టీ కపట ప్రేమ చూపిస్తోంది అంటూ వైఎస్ఆర్ సీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేయడం చూస్తుంటే… వారి వైఫల్యాన్ని ఎదుటివారి మీద నెట్టే స్తునట్టు స్పష్టమవుతోంది.
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ పై జరిగిన విషయంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ వ్యవహారంలో చివరకు కోర్టు జోక్యం చేసుకుని సిబిఐ విచారణకు ఆదేశించాల్సిన వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం హైకోర్టులో సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని, విచారణ కు మరో రెండు నెలల గడువు కావాలని కోరింది. దీంతో దళితులపై జరుగుతున్న దాడుల్లో రాజకీయ కుట్రలకు దాగి ఉన్నాయన్న విషయం బహిర్గతమవుతోంది. మరి కొన్ని వ్యవహారాల్లో పనిగట్టుకుని రాజకీయ పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నారు.
గత నెలలో తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ అనే దళితుడికి శిరోముండనం చేసిన వ్యవహారం మరవకముందే పెందుర్తిలో నిర్మాత నూతన్ నాయుడు కుటుంబ సభ్యులు దళిత యువకుడు శ్రీకాంత్ కు గుండు గీయించి, దారుణంగా హింసించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వరప్రసాద్ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రపతికి లేఖ రాయడం, ఆ మేరకు ప్రభుత్వం స్పందించడం జరిగింది.
విశాఖ పెందుర్తి వ్యవహారంలో మాత్రం పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వరుస సంఘటనలకు ఏ ఒక్కరినో బాధ్యులను చేయడం సమంజసం కాదు. కానీ డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉండడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షం దాడి చేస్తోంది. దానిని తిప్పికొట్టేందుకు ఇటువంటి వ్యవహారాలపై ఉక్కుపాదం మోపకుండా.. ప్రభుత్వం ఇదేదో తెలుగుదేశం తప్పిదం అంటూ చిత్రీకరించాలని చూస్తోంది. బాధితుల్ని నేరుగా పరామర్శించే ప్రయత్నం చేస్తుంటే.. తెలుగుదేశం నాయకుల్ని లాక్ డౌన్ ఉల్లంఘనల పేరుతో అరెస్టులు చేయిస్తున్నారు. ఆన్లైన్లో పలకరిస్తే… ఇంటి నుంచి కాలు కదపకుండా రాజకీయం చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
వీటికి తోడు దళితులపై టిడిపి కి ఎటువంటి ప్రేమ లేదని, వారి హయాంలో అనేక దాడులు జరిగాయని, వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని నమ్మించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అందులో భాగంగా గత రెండు మూడు రోజులుగా వైసిపి నాయకులు విశాఖలో అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వరుస పరిణామాలను గమనిస్తూ ఉన్న ప్రజలు మాత్రం ఔరా …! ఇదేమి చోద్యం అంటూ విస్తుపోతున్నారు.