తొలి వన్డేలో టీమిండియా మ్యాజిక్ ఈసారి పారలేదు. 337 పరుగుల లక్ష్యం ఇంగ్లాండ్ జట్టుకు చిన్నదైపోయింది. బెన్ స్టోక్స్, బెయిర్ స్టో విధ్వంసానికి టీమిండియా బౌలింగ్ చేతులెత్తేసింది. మైదానంలో సిక్సర్ల వర్షం కురిసింది. బంతి పడితే చాలు బౌండరీనే అన్న రీతిలో మ్యాచ్ సాగింది. ఫలితంగా లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 43.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఆదివారం జరగనున్న చివరి వన్డేతో సిరీస్ ఫలితం తేలనుంది.
భారత్ భారీ లక్ష్యం..
తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ శతకంతో రాణించాడు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ అర్ధ సెంచరీలతో అలరించారు. రెండో వన్డేలో సైతం భారత్ విజయం ఖాయమనే దీమాను అందరిలోనూ కల్పించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కరన్, తోప్లే చెరో రెండు వికెట్లు తీశారు. .
బెయిర్ స్టో, స్టోక్స్ విధ్వంసం..
భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆధ్యంతం దూకుడు ప్రదర్శించింది. బెయిర్ స్టో- స్టోక్స్ విధ్వంసం సృష్టించారు. టీ 20ని తలపిస్తూ 117 బంతుల్లోనే 177 పరుగులు సాధించిందీ ద్వయం. బెన్ స్టోక్స్ 52బంతుల్లో 99 పరుగులు సాధించాడు. అందులో 10 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. బెయిర్ స్టో 112 బంతుల్లో 124పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, 7 సిక్సులు ఉండడం విశేషం. వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ఇంగ్లాండ్ దూకుడు మాత్రం తగ్గించలేదు. చివరికి లివింగ్ స్టోన్, డేవిడ్ మలన్ విక్టరీతో మ్యాచ్‌ను ముగించారు.
Must Read ;- ప్రసిద్ధ్,కృనాల్ అదుర్స్.. తొలి వన్డేలో భారత్ విజయం











