ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే అనుమతించనున్నారు. ఇక పాక్షిక కర్ఫ్యూ కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వైద్యారోగ్య మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.ఈ ఆంక్షలు మే5 నుంచి 19 వరకు అమల్లో ఉంటాయని మంత్రి తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ప్రకటించారు.
ఒకే రోజు 24వేల కేసులు
ఏపీలో ఒకే రోజు 24వేల కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.పాజిటివిటీ రేటు 19.65 శాతంగా ఉంది. అంటే టెస్టులు నిర్వహించిన ప్రతి ఐదుగురిలో ఒకరు కరోనా పాజిటివ్ భారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ఆసుపత్రుల్లో బెడ్లు కొరత, ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోతూ ఉండటంతో ఇక కట్టడి తప్పదని ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్దమైంది. కర్ఫ్యూ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.











