ఆ రాగ మాధుర్యం.. ఆ స్వరాల లాలిత్యం ఇక వినిపించదు.. కనిపించదు. ఒకటా రెండా 6500 పైచిలుకు పాటలు.. జనం బాటలోకి పయనించాయి. కరోనా కర్కశత్వం ఆనంద్ పైనా చూపించింది. గాన గంధర్వుడు బాలుకు తోడుగా ఆనంద్ అనే నీడను తీసుకువెళ్లిపోయింది.
ఆనంద్ స్థాపించిన స్వరమాధురి సంస్థతో ప్రపంచమంతటా పాటలు వినిపించేలా చేసిన ఆనంద్ ఇక కనిపించని తీరాలకు చేరిపోయారు. ఆనంద్ పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లాలోని తులగం గ్రామం. 1944 ఫిబ్రవరి16న ఆయన జన్మించారు. ఆయనలోని సంగీత కళకు పునాది తండ్రి నుంచే పునాది పడిందని చెప్పాలి. ఆయన తండ్రి రంగస్థలం మీద అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆనంద్ సంగీత ప్రయాణం తండ్రి వద్దనే ప్రారంభమైంది. తండ్రి ప్రదర్శించిన అనేక నాటకాల్లో ఆనంద్ కూడా చేరిపోయారు. తండ్రి రాముడి పాత్ర పోషిస్తే ఆనంద్ తో పాటు అతని సోదరుడు కలిసి లవకుశులుగా నటించారు.
నటుడిగా అనేక బహుమతుల్ని ఆనంద్ చిన్నతనంలోనే అందుకున్నారు. ఊళ్లో పండగొచ్చినా పబ్బమొచ్చినా ఆనంద్ పాట వినిపించేది. సంగీత విభావరికి చిన్నప్పుడే బీజం వేశారు ఆనంద్. అలాంటి ఓ సంగీత పోటీలకు న్యాయమూర్లులుగా వ్యవహరించిన ప్రముఖ సంగీత దర్శకుడు కేవీ మహదేవన్, గాయకుడు బాలు ప్రశంసలు ఆనంద్ కు దక్కడమే కాక ఆ పోటీలో విజేతను చేశాయి. తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చిన కేవీ మహదేవన్ మాట ఇచ్చారు. సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ అవకాశం ఇచ్చారు. ఆనంద్ పాట అందలం ఎక్కింది. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రాలకు గళం అందించిన ఘనత కూడా ఆనంద్ కే దక్కింది.
ఆ ‘వేణువు’ అలా వినిపించింది..
ఆనంద్ చెన్నైలోనూ సంగీత విభావరిలో పాల్గొన్న సమయంలో చెన్నైలో ఉండాల్సి వచ్చింది. అప్పటి గాయని లీలారాణి ఇంట్లోనే బస చేశారు. ఆ తర్వాత మేడిశెట్టి అప్పారావు, శరత్ బాబులతో కలిసి రూమ్ లో ఉన్నారు. నటుడు చంద్ర మోహన్ ఇంట్లో ఓ ఫంక్షన్ లో పాటలు పాడే అవకాశం వచ్చింది ఆనంద్ కు. అతని పాట విన్న నవతా కృష్ణంరాజు సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ కు పరిచయం చేశారు. నీకు పాట ఇస్తానంటూ వెంకటేష్ హామీ ఇచ్చారు. ఇచ్చినట్టుగానే దాన్ని నిలుపుకున్నారు. అదే ‘ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక’ పాట.
అమెరికా అమ్మాయి చిత్రలోని ఈ పాటను మైలవరపు గోపి రాశారు. అలా నవత ఆర్ట్స్ లో అతనికి పాట పాడే అవకాశం దక్కింది. తొలిపాటతోనే మనసులు కొల్లగొట్టేశారు ఆనంద్. పండంటి కాపురం, అమె కథ, కల్పన, దాన వీర శూర కర్ణ, చక్రధారి, బంగారక్క, మన ఊరి పాండవులు, ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారయ్య, గాంధీనగర్ రెండవ వీధి తదితర చిత్రాల్లో ఎన్నో పాటలు పాడారు. స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి, రంగవల్లి చిత్రాలకు సంగీతం సమకూర్చారు.
దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ, విఠలా విఠలా పాండురంగ విఠలా, దూరాన దూరాన తారాదీపం.. ఇలా ఆయన గళం పలికిన పాటలెన్నో జనావళిలో కోటలు కట్టాయి. స్వరమాధురి సంస్థను స్థాపించి ఎందరో కొత్త వారికి అవకాశాలు కల్పించారు. షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్స్ కి ఆయనే సంగీతం అందించారు. భక్తి పాటల అల్బుమ్స్ కూడా రూపొందించారు.











