కరోనాకు ఎవరూ అతీతులు కాదు. ఏపీలో ఉన్నతాధికారులు పదుల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ నగర కమిషనర్ సృజన కరోనా బారిన పడ్డారు. వీరితోపాటు జిల్లాలో మరో ముగ్గురు జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవో, డీఆర్వోకు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. జిల్లాలో ఉన్నతాధికారులంతా ఒకేసారి కరోనా భారినపడటం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది.
వారికే ముప్పు ఎక్కువ..
ఉన్నతాధికారులు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు ప్రతి రోజూ అధికారులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు,క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తూ ఉంటారు. దీంతో వారు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనాతో పోరాడుతూ కృష్ణా జిల్లా ఇంటిలిజెన్స్ ఎస్పీ రాం ప్రసాద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అందుకే ప్రభుత్వోగులందరికీ రెండో డోసు టీకా కూడా వెంటనే ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం అనుమతించాలని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు డిమాండ్ చేశారు.